వాహన విక్రయాలు వెలవెల

11 Jul, 2017 01:51 IST|Sakshi
వాహన విక్రయాలు వెలవెల

జూన్‌లో 11 శాతం డౌన్‌
న్యూఢిల్లీ: ప్యాసింజర్‌ వాహన విక్రయాలు జూన్‌ నెలలో 11 శాతం తగ్గాయి. గత ఆరు నెలల కాలంలో అమ్మకాలు తగ్గడం ఇదే తొలిసారి. జీఎస్‌టీ అమలుకు ముందు డీలర్లు.. కంపెనీల నుంచి కొత్త స్టాక్‌ను తీసుకోకపోవడం విక్రయాలపై ప్రతికూల ప్రభావం చూపింది. ట్రాన్సిషనల్‌ నష్టాలను తప్పించుకోవాలనే ఉద్దేశంతో డీలర్లు కొత్త స్టాక్‌కు దూరంగా ఉన్నారు. సియామ్‌ తాజా గణాంకాల ప్రకారం..

దేశీ ప్యాసింజర్‌ వాహన విక్రయాలు జూన్‌లో 11.21 శాతం క్షీణతతో 1,98,399 యూనిట్లకు తగ్గాయి. గతేడాది ఇదే నెలలో వాహన అమ్మకాలు 2,23,454 యూనిట్లుగా ఉన్నాయి. డీమోనిటైజేషన్‌ ఎఫెక్ట్‌ నుంచి కోలుకొని జనవరి నుంచి పెరుగుతూ వస్తున్న ప్యాసింజర్‌ వాహన విక్రయాలు తాజా నెలలో ఒక్కసారిగా తగ్గాయి. 2013 మార్చి (–13.01 శాతం) నుంచి ఇదే అతిపెద్ద క్షీణత.
కార్ల విక్రయాలు 11.24 శాతం క్షీణించాయి. ఇవి 1,54,237 యూనిట్ల నుంచి 1,36,895 యూనిట్లకు తగ్గాయి. 2013 మే తరువాత ఇదే అతిపెద్ద క్షీణత.
మారుతీ సుజుకీ ఇండియా దేశీ ప్యాసింజర్‌ వాహన విక్రయాలు 1 శాతం వృద్ధితో 93,057 యూనిట్లకు పెరిగాయి.
హ్యుందాయ్‌ మోటర్‌ ఇండియా అమ్మకాలు 5.64 శాతం క్షీణతతో 37,562 యూనిట్లకు, మహీంద్రా విక్రయాలు 5.27 శాతం క్షీణతతో 16,169 యూనిట్లకు తగ్గాయి.
టాటా మోటార్స్‌ అమ్మకాలు 12.19 శాతం క్షీణతతో 13,148 యూనిట్లకు పరిమితమయ్యాయి.

మరిన్ని వార్తలు