ప్యాసింజర్‌ వాహన అమ్మకాలు డౌన్‌

11 Dec, 2018 01:19 IST|Sakshi

నవంబర్‌లో 2,66,000 వాహన సేల్స్‌  

ఏడాది ప్రాతిపదికన 3.43% తగ్గుదల

న్యూఢిల్లీ: ప్యాసింజర్‌ వాహన విక్రయాలు ఈ ఏడాది నవంబర్‌లో నెమ్మదించాయి. సియామ్‌ గణాంకాల ప్రకారం.. ఈ నెలలో మొత్తం వాహన అమ్మకాలు 2,66,000 యూనిట్లుగా ఉండగా, గతేడాది ఇదేనెలలో 2,75,440 యూనిట్లుగా నమోద య్యాయి. ఏడాది ప్రాతిపదికన 3.43 శాతం తగ్గుదల చోటుచేసింది. జూలై తరువాత ఆగస్టులో మాత్రమే 1.55% అమ్మకాలు పెరుగగా.. ఆ తరువాత నుంచి మళ్లీ వరుసగా తగ్గుదలను నమోదుచేస్తూ వచ్చాయి. ఈ కాలంలో వడ్డీ రేట్ల పెరుగుదల, ముడి చమురు ధరలు పెరగడం వంటి అంశాలు ప్రధాన కారణాలుగా ఉన్నాయని డైరెక్టర్‌ జనరల్‌ మాథుర్‌ వ్యాఖ్యానించారు. అయితే, క్రూడ్‌ ధరలు క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో అమ్మకాలు పుంజుకోవచ్చని భావిస్తున్నట్లు చెప్పారు. పీవీ అమ్మకాల్లో నెమ్మది ఉన్నప్పటికీ.. మొత్తం వాహన అమ్మకాల్లో మాత్రం పెరుగుదల నమోదైనట్లు తెలిపారు. అన్ని విభాగాల వాహన అమ్మకాలు 5.03 శాతం వృద్ధి చెంది 20,38,015 యూనిట్లుగా ఉండగా, గతేడాది ఇదేనెలలో 19,40,462 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇక ఏప్రిల్‌–నవంబర్‌ కాలంలో కూడా పీవీ అమ్మకాలు 5 శాతం తగ్గగా.. వాణిజ్య వాహనాలు 31 శాతం,  త్రిచక్ర వాహనాలు 21 శాతం, ద్విచక్ర వాహనాలు 10 శాతం వృద్ధి చెందాయి. మొత్తం వృద్ధి 11 శాతంగా ఉంది.  నవంబర్‌ పీవీ అమ్మకాల గణాంకాలను కంపెనీల వారీగా పరిశీలిస్తే.. మహీంద్ర అండ్‌ మహీంద్రా 1.26 శాతం వృద్దితో 16,191 యూనిట్లను విక్రయించింది. టాటా మోటార్స్‌ 3.26 క్షీణతతో 18,226 యూనిట్లను విక్రయించింది. 

తగ్గిన కార్లు.. పెరిగిన బైక్‌లు
గతనెలలో మొత్తం కార్ల అమ్మకాలు 1,79,783 యూనిట్లు కాగా, అంతకుముందు ఇదే ఏడాదిలో 1,81,435 యూనిట్ల విక్రయాలు జరిగాయి. మరోవైపు ద్విచక్ర వాహనాలు 7.15 శాతం పెరిగి 16,45,791 యూనిట్లుగా నమోదయ్యాయి. అంతక్రితం 15,36,015 యూనిట్లుగా ఉన్నాయి. హీరో మోటోకార్ప్‌ 4.98 శాతం వృద్ధితో 5,36,193 యూనిట్లను విక్రయించింది. బజాజ్‌ ఆటో 4.98 శాతం వృద్ధితో 2,05,259 యూనిట్లను విక్రయించింది. హోండా మోటార్‌ సైకిల్స్‌ అమ్మకాలు 14.97 శాతం తగ్గి 1,27,896 యూనిట్లుగా ఉన్నాయి. స్కూటర్ల విభాగంలో మొత్తం 5,21,542 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి.  

మరిన్ని వార్తలు