వాహన విక్రయాల్లో 9 శాతం వృద్ధి

10 Jun, 2017 01:28 IST|Sakshi
వాహన విక్రయాల్లో 9 శాతం వృద్ధి

న్యూఢిల్లీ: దేశీ ప్యాసెంజర్‌ వాహన విక్రయాల్లో మే నెలలో బలమైన వృద్ధి నమోదయ్యింది. వాహన అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన 8.63 శాతం వృద్ధితో 2,31,640 యూనిట్ల నుంచి 2,51,642 యూనిట్లకు పెరిగాయి. కొత్త మోడళ్ల ఆవిష్కరణ, యుటిలిటీ వాహనాలకు బలమైన డిమాండ్‌ ఉండటం వంటి అంశాలు అమ్మకాల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ఇక దేశీ కార్ల విక్రయాలు కూడా 4.8 శాతం వృద్ధితో 1,58,996 యూనిట్ల నుంచి 1,66,630 యూనిట్లకు పెరిగాయి. యుటిలిటీ వాహన విక్రయాలు 18.8 శాతం వృద్ధితో 69,845 యూనిట్లకు ఎగశాయి. వాహన పరిశ్రమ సమాఖ్య సియామ్‌ తాజా గణాంకాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

వీటి ప్రకారం..
మారుతీ సుజుకీ దేశీ వాహన విక్రయాల్లో 15 శాతం వృద్ధి నమోదయ్యింది. ఇవి 1,30,238 యూనిట్లుగా ఉన్నాయి.
హ్యుందాయ్‌ అమ్మకాలు 1.59 శాతం వృద్ధితో 42,007 యూనిట్లకు పెరిగాయి.
మహీంద్రా వాహన విక్రయాలు 3.23 శాతం వృద్ధి చెందాయి. ఇవి 20,270 యూనిట్లుగా నమోదయ్యాయి.

హైబ్రిడ్‌ వాహనాలపై జీఎస్‌టీ తగ్గించండి  
కేంద్రానికి వాహన కంపెనీల విజ్ఞప్తి

హైబ్రిడ్‌ వాహనాలపై జీఎస్‌టీ పన్ను రేటును తగ్గించాలని వాహన కంపెనీలు కేంద్రాన్ని కోరాయి. వీటికి 18% జీఎస్‌టీ పన్ను రేటు వర్తింపజేయాలని అభ్యర్థించాయి. పర్యావరణ వాహనాలను, లగ్జరీ మోడళ్లలను ఒకే విధంగా పరిగణనలోకి తీసుకోవడం సబబు కాదని తెలియజేశాయి. జులై 1 నుంచి అమల్లోకి రానున్న వస్తు సేవల పన్ను జీఎస్‌టీలో హైబ్రిడ్‌ వాహనాలపై కూడా 28% పన్ను విధించారు. దీనికి 15% సెస్సు అదనం.  ప్రస్తుతం హైబ్రిడ్‌ వాహనాలపై పన్ను రేటు 30.3%.

>
మరిన్ని వార్తలు