విమాన ప్రయాణీకులకు భారీ ఊరట

18 Dec, 2017 14:37 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  విమాన ప్రయాణీకులకు ఇది నిజంగా శుభవార్తే. భారీగా బాదేస్తున్న విమాన టికెట్ల కాన్సిలేషన్‌ చార్జీలపై విమానయాన మంత్రిత్వ శాఖ త్వరలోనే ప్రయాణీకులకు భారీ ఊరట కల్పించనుంది. దేశీయ  విమానయాన సంస్థల్లో టికెట్ల  రద్దు  సమయంలో విధించే చార్జీల సవరణకు కసరత్తు చేస్తోంది. దీనికి బదులు సరికొత్త నిబంధనలను అమలు చేయనుంది.

దేశీయ విమానయాన సంస్థలు కాన్సిలేషన్‌  ఫీజు రూ. 3వేల చొప్పున వసూలు చేస్తున్న నేపథ్యంలో కాన్సిలేషన్‌ చార్జీల డేటా పంపించాల్సిందిగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కోరింది. తాజా నివేదికల ప్రకారం, రద్దు ఛార్జీలు బేస్ ఫేర్ కన్నా లేదా ఇంధన సర్‌ ఛార్జ్ మొత్తం కంటే ఎక్కువగా ఉండరాదు. వీటిలో ఏది తక్కువగా ఉంటే దాన్ని పరిగణనలోకి తీసుకునేలా  నియమాలను రూపొందించనున్నట్టు సమాచారం. ఇటీవల కాన్సిలేషన్‌ ఛార్జీలను పెంచిన నేపథ్యంలో డీజీసీఏ ఈ చర్యలకు దిగనుంది.

కాగ ఉడాన్‌(తక్కువ ధరల్లో విమాన ప్రయాణ) పథకం గంటకు రూ. 2500  విమాన టికెట్లను అందిస్తోంటే.. దానికంటే కాన్సిలేషన్‌ చార్జీలు అధికంగా ఉండడంపై ఏవియేషన్‌ మంత్రి జయంత్ సిన్హా  స్పందించారు.  ఈ రద్దు ఛార్జీలను తిరిగి నియం‍త్రించాల్సినవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో వీటిని సమీక్షించాలని జయంత్ సిన్హా  ఆదేశించారు.
 

మరిన్ని వార్తలు