పతంజలి.. మరింత ‘క్లిక్‌’!!

17 Jan, 2018 00:52 IST|Sakshi

మరింత విస్తృతంగా ఆన్‌లైన్‌ మార్కెట్లోకి

ఎనిమిది ఈ–కామర్స్‌ దిగ్గజాలతో ఒప్పందం

2018 ఆన్‌లైన్‌ టర్నోవర్‌ లక్ష్యం రూ.1,000 కోట్లు

నీళ్ల బాటిళ్లతో పాటు దుస్తులు, పాదరక్షలూ విక్రయం

న్యూఢిల్లీ: యోగా గురు బాబా రామ్‌దేవ్‌ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద్‌ సంస్థ.. ఆన్‌లైన్‌ అమ్మకాలను మరింత పెంచుకోవడంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, గ్రోఫర్స్, షాప్‌క్లూస్, బిగ్‌బాస్కెట్, 1ఎంజీ, పేటీఎం మాల్, నెట్‌మెడ్స్‌ వంటి 8 ఈ–కామర్స్‌ దిగ్గజాలతో జట్టు కట్టింది. ఈ పోర్టల్స్‌లో తమ ఉత్పత్తుల శ్రేణి మొత్తం అందుబాటులో ఉంటుందని బాబా రామ్‌దేవ్‌ మంగళవారం చెప్పారు. ఆన్‌లైన్‌ అమ్మకాల ద్వారా తొలి ఏడాదే రూ.1,000 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలియజేశారు.

 అలాగే ’దివ్య జల్‌’ పేరిట బాటిల్డ్‌ వాటర్, ’పరిధాన్‌’ బ్రాండ్‌ కింద దుస్తులు, పాదరక్షలు ఈ ఏడాది ప్రవేశపెట్టనున్నట్లు రాందేవ్‌ తెలిపారు. ‘సంప్రదాయ రిటైల్‌ మార్కెట్‌ పరిధిని మరింతగా విస్తరించేందుకు ఆన్‌లైన్‌ ఉపయోగపడుతుంది. ఈ ఏడాది రూ.1,000 కోట్ల అమ్మకాల లక్ష్యం పెట్టుకున్నాం. సాధ్యపడితే అంతకు మించి కూడా చేయాలనుకుంటున్నాం‘ అని తెలియజేశారు. 2016–17లో పతంజలి ఆయుర్వేద్‌ టర్నోవరు రూ. 10,500 కోట్లు కాగా ఈ ఆర్థిక సంవత్సరం రెండు రెట్ల వృద్ధిని లకి‡్ష్యంచుకుంది.

సొంత పోర్టల్‌తో డిసెంబర్‌లో రూ.10 కోట్లు ..
ప్రయోగాత్మకంగా తమ సొంత పోర్టల్‌ ‘పతంజలిఆయుర్వేద్‌.నెట్‌’ ద్వారా స్వదేశీ ఉత్పత్తుల శ్రేణిని ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నామని, డిసెంబర్‌ నెలలో ఏకంగా రూ.10 కోట్ల విక్రయాలు జరిగాయని, మిగతా ఏ ఎఫ్‌ఎంసీజీ బ్రాండ్‌ కూడా ఒక నెలలో ఈ స్థాయి అమ్మకాలు సాధించలేదని రామ్‌దేవ్‌ తెలియజేశారు. రిటైల్‌ స్టోర్స్‌ సంఖ్యను కూడా పెంచుకోనున్నట్లు చెప్పారాయన. గ్రామాల్లోని కొనుగోలుదారులను ఆకర్షించేందుకు అందుబాటు ధరల్లో మరిన్ని ఉత్పత్తులను చిన్న ప్యాక్‌లలో అందించే ప్రణాళికలు కూడా ఉన్నట్లు తెలియజేశారు.

 ‘ప్రస్తుతం 5,000 పైచిలుకు ఎక్స్‌క్లూజివ్‌ స్టోర్స్‌ ఉండగా.. వీటిని ఇంకా పెంచుతాం. జనవరి 26న స్వదేశ్‌ సమృద్ధి పేరిట కొత్తగా లాయల్టీ కార్డును ప్రవేశపెడుతున్నాం‘ అని వెల్లడించారు. బీమా ప్రయోజనం కూడా (మరణం, అంగవైకల్యం) కల్పించే ఈ లాయల్టీ కార్డు ద్వారా అయిదు కోట్ల మందికి చేరువ కావాలని నిర్దేశించుకున్నట్లు రామ్‌దేవ్‌ చెప్పారు. ప్రస్తుతం తమ ఉత్పత్తులు 15–20 లక్షల కిరాణా దుకాణాల్లో అందుబాటులో ఉన్నాయంటూ ఈ ఏడాది వీటిని 50 లక్షలకు పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు చెప్పారు. 

20వేల మంది నియామకం..
కార్యకలాపాల విస్తరణ ప్రణాళికల నేపథ్యంలో 20,000 మందికి పైగా ఉద్యోగులను రిక్రూట్‌ చేసుకోనున్నామని .. సేల్స్‌ మేనేజర్, జోనల్‌ మేనేజర్, రీజనల్‌ మేనేజర్‌ స్థాయి దాకా వివిధ హోదాల్లో ఈ పోస్టులుంటాయని రామ్‌దేవ్‌ తెలిపారు. ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా మరింతగా పెంచుకుంటున్నట్లు చెప్పారు. ‘వార్షికంగా రూ. 50,000 కోట్ల విలువ చేసే ఉత్పత్తుల తయారీ సామర్థ్యం మాకు ఉంది. ఎఫ్‌ఎంసీజీలో ఇదే  అత్యధికం. హరిద్వార్, తేజ్‌పూర్, అసోమ్‌లలో ప్లాంట్లున్నాయి. అటు నోయిడా, నాగ్‌పూర్, ఇండోర్‌లలో కూడా ప్లాంట్ల ఏర్పాటు ప్రక్రియ వేగంగా జరుగుతోంది‘ అని వివరించారు. ప్రిస్క్రిప్షన్‌ అవసరమయ్యే పతంజలి ఔషధాలు మాత్రమే నెట్‌మెడ్స్, 1ఎంజీ పోర్టల్స్‌లో లభ్యమవుతాయి. పతంజలి ఉత్పత్తులు ఆన్‌లైన్లో విక్రయిస్తున్నప్పటికీ.. ప్రత్యేక డిస్కౌంట్లేమీ ఉండవు. రిటైల్‌ అవుట్‌లెట్స్‌కి ధరలపరమైన ఇబ్బందులు ఎదురుకాకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు.

వచ్చే ఏడాది నుంచి ఎగుమతులు..
నాగ్‌పూర్‌లోని మిహా దగ్గర నిర్మిస్తున్న ఎగుమతి ఆధారిత ప్లాంటు అందుబాటులోకి వచ్చాక.. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఎగుమతులు కూడా ప్రారంభించనున్నట్లు రామ్‌దేవ్‌ తెలిపారు. యూఏఈ, అమెరికా, కెనడా, యూరప్, దక్షిణ అమెరికా, ఆఫ్రికన్‌ దేశాలతో పాటు పలు ప్రాంతాలకు ఎగుమతులు చేసేందుకు ఇది ఉపయోగపడగలదని ఆయన చెప్పారు. పతంజలి ఇటీవలే పిల్లలు .. పెద్దల డైపర్స్, చౌక శానిటరీ నాప్‌కిన్స్‌ను కూడా ప్రవేశపెట్టింది. సౌర విద్యుదుత్పత్తి పరికరాల తయారీలోకి కూడా అడుగుపెట్టనున్నట్లు ఇటీవలే ప్రకటించింది.

మరిన్ని వార్తలు