కింభో కథ కంచికేనా ?

1 Jun, 2018 04:24 IST|Sakshi

పతంజలి యాప్‌పై ఒక్కరోజులోనే చుట్టుముట్టిన వివాదాలు

ఇదొక భద్రతా విపత్తు అంటున్న సైబర్‌ నిపుణులు

స్వదేశీ మంత్రాన్ని జపిస్తూ ఫాస్ట్‌ మూవింగ్‌ కన్జ్యూమర్‌ గూడ్స్‌ సెక్టార్‌లో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్న యోగా గురు బాబా రాందేవ్‌కి చెందిన పతంజలి సంస్థ డిజిటల్‌ రంగంలోనూ తన సత్తా చాటాలనుకుంది. వాట్సాప్‌కి ఈ స్వదేశీ యాప్‌తో సవాల్‌ విసురుతున్నాం అంటూ కొత్త మెసేజింగ్‌ యాప్‌ కింభోను ప్రవేశపెట్టింది. ఇప్పుడు భారత్‌ మాట్లాడుతోంది అన్న ట్యాగ్‌లైన్‌తో ఈ యాప్‌ ప్రవేశపెట్టి 24 గంటలు తిరగక ముందే దాని చుట్టూ వివాదాలు మొదలయ్యాయి. గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి కూడా కింభో అదృశ్యమైంది. ఈ యాప్‌కి ఏ మాత్రం సెక్యూరిటీ లేదన్న విమర్శలు మొదలయ్యాయి.

గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి ఎందుకు తొలగించారు ?
కింభో యాప్‌ తయారీదారులు పతంజలి కమ్యూనికేషన్స్‌ దీనిని గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి తొలగించినట్టు తెలుస్తోంది. పూర్తి స్వదేశీ అని చెప్పుకుంటూ వచ్చిన ఈ మెసెంజర్‌ యాప్‌లో పాకిస్తాన్‌ నటీమణి మావ్రా హోకేన్‌ ఫోటోను వాడడం ఇబ్బందికరంగా మారింది. అదీ కాకుండా కింభో యాప్‌ బోలో అన్న యాప్‌కి మక్కీకి మక్కీ కాపీ అంటూ ట్విట్టర్‌లో పోస్టులు వెల్లువెత్తాయి. ఇది స్వదేశీ యాప్‌ కాదు కాపీ క్యాట్‌ అంటూ రెండు యాప్‌ల స్క్రీన్‌షాట్‌లు పక్క పక్కన పెట్టి సామాజిక మాధ్యమాల్లో ట్రాల్‌ కావడంతో దీనిని ప్రస్తుతానికి తొలగించినట్టు తెలుస్తోంది. అయితే అండ్రాయిడ్‌ ప్లాట్‌ఫామ్‌లో ఈ యాప్‌ కనిపించకపోవడంపై కింభో సాంకేతిక బృందం వివరణ ఇచ్చింది. తాము ఊహించని దానికంటే అధికంగా స్పందన రావడంతో సర్వర్లు అప్‌గ్రేడ్‌ చేస్తున్నామంటూ ట్వీట్‌ చేసింది.

కింభో ఒక భద్రతా విపత్తు : ఫ్రెంచి నిపుణులు
కింభో యాప్‌ వచ్చిన ఒక్క రోజులోనే దాని చుట్టూ ఎన్నో వివాదాలు మొదలయ్యాయి. భద్రతాపరంగా అదొక పైఫల్యాల పుట్ట అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. కింభో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవడం ఏ మాత్రం సురక్షితం కాదని ఫ్రెంచి సైబర్‌ నిపుణులు సూచిస్తున్నారు. ఆధార్‌లోని డొల్లతనాన్ని బయటపెట్టిన ఫ్రాన్స్‌కు చెందిన నిపుణుడు ఎలియట్‌ ఆల్డర్‌సన్‌ కింభో యాప్‌ని ఒక పెద్ద జోక్‌ అంటూ అభివర్ణించారు..‘ కింభో యాప్‌ నిండా సాంకేతిక లోపాలే ఉన్నాయి. దీనిని డౌన్‌లోడ్‌ చేసుకోవద్దు. ఇది అచ్చంగా బోలో అన్న అప్లికేషన్‌కు కాపీలా ఉంది. అంతేకాదు కింభో యాప్‌ బోలోమెసేంజర్‌.కామ్‌కి రిక్వెస్ట్‌ కూడా పంపుతోంది‘ అని అల్డర్‌సన్‌ ట్వీట్‌ చేశారు.  ఈ యాప్‌ని వినియోగించే ప్రతీ ఒక్కరికీ తాను యాక్సెస్‌ అయి వారి మెసేజ్‌లు చదవగలుగుతున్నానని ఆయన  తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

కింభో ఎలా ఉంది ?
కింభో అచ్చంగా వాట్సాప్‌ని తలపించేలా ఉంది. మెసేజింగ్, ఆడియా చాట్, వీడియో కాలింగ్, గ్రూప్స్‌ ఏర్పాటు, ఫోటోలు వీడియోల షేరింగ్, స్టిక్కర్స్, క్వికీస్, గ్రాఫిక్స్‌ ఇలా అన్ని రకాల ఫీచర్లతో వాట్సాప్‌ను పోలి ఉండేలా ఈ యాప్‌ను రూపొందించారు. ఇంతే కాకుండా  సెలిబ్రిటీలను ఫాలో అయ్యే కొత్త ఫీచర్‌ కూడా ఇందులో పొందుపరిచారు.  కింభో అంటే సంస్కృతంలో ఎలా ఉన్నారు ? ఏంటి కొత్త విషయాలు ? అని అర్థం. ఒకరితో ఒకరు కమ్యూనికేషన్లు ఏర్పాటు చేసుకోవడానికి ఉద్దేశించిన ఈ యాప్‌కి అందరూ అడిగే మొట్టమొదటి కుశల ప్రశ్న ఎలా ఉన్నారు అన్న అర్థం వచ్చేలా కింభో అన్న పేరు పెట్టారు. ఇక లోగో దగ్గర్నుంచి మిగిలినవన్నీ ఇంచుమించుగా వాట్సాప్‌ మాదిరిగానే ఉన్నాయి. 

భారత్‌లో మొట్టమొదటి మెసేజింగ్‌ యాప్‌ ఇదే.. ‘ఇది మన స్వదేశీ మెసేజింగ్‌ ప్లాట్‌ఫామ్‌. వాట్సాప్‌ను సవాల్‌ చేసేలా ఈ యాప్‌ డిజైన్‌ చేశాం.‘ అని పతంజలి అధికార ప్రతినిధి ఎస్‌.కె. తిజరావాలా ట్వీట్‌ చేశారు.  ఈ యాప్‌ అందుబాటులోకి వచ్చిన ఒక్క రోజులోనే గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి అదృశ్యం కావడంతో దీని కథ ఇక కంచికేనా అన్న అనుమానాలు మొదలయ్యాయి. వాట్సాప్‌ డౌన్‌లోడ్లు 100 కోట్లు దాటిపోవడంతో, ఎంత స్వదేశీ రంగు పూసినా ఏ మెసేజింగ్‌ యాప్‌కి వాట్సాప్‌ని ఎదుర్కొనే సత్తా సమీప భవిష్యత్‌లో ఉండదనే అభిప్రాయమైతే వినిపిస్తోంది.

మరిన్ని వార్తలు