పతంజలి భారీ డిస్కౌంట్స్‌ : మూడు కొంటే మూడు ఫ్రీ

2 Jul, 2019 20:48 IST|Sakshi

పతంజలి సంస్థ తొలిసారి సంచలన నిర్ణయం

పతంజలి ఆయుర్వేద ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్స్‌ 

మూడు కొంటే మూడు ఫ్రీ... కాంబో ఆఫర్లు  

సాక్షి, ముంబై : ఎఫ్‌ఎంసీజీ సెక్టార్‌లో దూసుకొచ్చిన దేశీయ సంస్థ  బాబా రామ్‌దేవ్‌కు చెందిన  పతంజలి తొలిసారి కీలక నిర్ణయం తీసుకుంది.  తమ ఉత్పత్తులపై  భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ పలు ఉత్పత్తులపై పరిమిత కాలానికి  ప్రత్యేక డిస్కౌంట్లను, కాంబో ఆఫర్లను అందిస్తోంది. గత రెండు ఆర్థిక సంవత్సరాలుగా విక్రయాలు భారీగా పడిపోయిన నేపథ్యంలో వినియోగ దారులను  ఆకట్టుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. తద్వారా భారీగా విక్రయాలను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రధానంగా అయిదారు రకాల ఆహారోత్పత్తులు, ఆయిల్స్‌, డ్రింక్స్‌, ఆటా, ఓట్స్‌, రడీ టూ ఈట్‌ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు అందిస్తోంది. ఈ ఆఫర్లలో భాగంగా మూడు వస్తువులు కొంటే మూడు వస్తులను ఉచితంగా అందిస్తోంది. అలాగే కొన్ని ఆహార ఉత్పతులను ధరలను సగానికిపైగా తగ్గించి వినియోదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఇంకా  షాంపూలు, ఫేస్‌వాష్‌, ఇతర  సౌందర్య సాధనాలపై కాంబో ఆఫర్లను అందిస్తోంది.  ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పోటీని తట్టుకునేందుకు,  వినియోగదారులకు భారీగా ఆకట్టుకునేందుకు  తొలిసారిగా పతంజలి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం విశేషం. 

కాగా రసాయన రహిత, సహజసిద్ద ఉత్పత్తులంటూ  దేశీయ ఎఫ్‌ఎంసీజీ మార్కెట్లో ప్రవేశించిన  పతంజలి ఆయుర్వేద సంస్థ అతి తక్కువ కాలంలోనే రూ.10వేల కోట్ల టర్నోవర్‌ సాధించిన భారతీయ  రంగ సంస్థగా రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. కానీ బాలకృష్ణ సీఈవోగా హరిద్వార్ కేంద్రంగా నడుస్తున్న పతంజలి లాభాలను ఎన్డీయే సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన జీఎస్టీ దెబ్బ కొట్టింది. అలాగే విదేశీ కంపెనీలు పోటీగా నిలవడంతో అమ్మకాల్లో, లాభాల్లోనూ వెనకబడింది. సీఏఆర్ఈ నివేదిక ప్రకారం గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే  2018లో వెయ్యికోట్ల రూపాయలు కోల్పోయింది. కంపెనీ 2016-17లో రూ.9030 కోట్లు అమ్మకాలు సాధించగా.. 2017-18లో రూ.8135కోట్లకు పడిపోయింది. 

మరిన్ని వార్తలు