ఇక పతంజలి సిమ్‌ కార్డులు..!

29 May, 2018 00:21 IST|Sakshi

‘స్వదేశీ సమృద్ధి’ పేరుతో మార్కెట్లోకి

ఇప్పటికే బీఎస్‌ఎన్‌ఎల్‌తో జట్టు

తొలిదశలో పతంజలి సిబ్బందికే

సక్సెస్‌ అయితే సామాన్యులక్కూడా

న్యూఢిల్లీ: ఎయిర్‌టెల్‌ సిమ్‌ కార్డ్‌ చూసుంటాం. వొడాఫోన్, ఐడియా, జియో ఇలా వివిధ కంపెనీలకు చెందిన సిమ్‌ కార్డ్‌ల గురించి మనకు తెలుసు. రానున్న రోజుల్లో పతంజలి సిమ్‌ కార్డ్‌లనూ చూడబోతున్నాం. నిజమే!! యోగా గురు రామ్‌దేవ్‌ బాబాకు చెందిన పతంజలి ఆయుర్వేద్‌ కంపెనీ... త్వరలో సిమ్‌ కార్డుల్ని తీసుకొస్తోంది.

‘స్వదేశీ సమృద్ధి’ పేరిట ఈ సిమ్‌లను బాబా రామ్‌దేవ్‌ మార్కెట్‌లోకి విడుదల చేశారు కూడా. పతంజలి సంస్థ సిమ్‌ కార్డ్‌ సేవల కోసం ప్రభుత్వ రంగ బీఎస్‌ఎన్‌ఎల్‌తో జట్టుకట్టింది. సిమ్‌ల ఆవిష్కరణతో పతంజలి టెలికం రంగంలోకి కూడా అడుగుపెట్టినట్లయింది. పతంజలి  ప్రస్తుతం ఫుడ్, ఆయుర్వేద్‌ మెడిసిన్, కాస్మటిక్స్, హోమ్‌ కేర్, పర్సనల్‌ కేర్‌ విభాగాల్లో ఉత్పత్తులను విక్రయిస్తోంది. అలాగే Patanjaliayurved.net ప్రారంభంతో ఈ–కామర్స్‌లోకి కూడా ప్రవేశించింది.

పతంజలి డైవర్సిఫికేషన్‌ ప్రణాళికలు?
ఎలక్ట్రిక్‌ వెహికల్స్, స్టీల్, మొబైల్‌ చిప్‌ తయారీ కంపెనీలు తమ మద్దతును కోరినట్లు పతంజలి ఆయుర్వేద్‌ ఎండీ ఆచార్య బాలకృష్ణ తెలిపారు. కొన్ని కంపెనీలు భాగస్వామ్యాన్ని ఆశిస్తే, మరికొన్ని ఆర్థిక సహాయాన్ని కోరాయన్నారు. అయితే తాము ఇప్పటికీ డైవర్సిఫికేషన్‌కు సంబంధించి ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. దేశీ కంపెనీల్లోనే ఇన్వెస్ట్‌ చేస్తామని, అలాగే ఇక్కడి సంస్థలతోనే జతకడతామని తెలిపారు.

‘స్టీల్, ఎలక్ట్రిక్‌ వెహికల్, యాంటి– రేడియేషన్‌ మొబైల్‌ చిప్‌ సహా దాదాపు అన్ని రంగాలకు చెందిన తయారీదారులు మమ్మల్ని సంప్రతించారు. మేం అన్ని వ్యాపారాలూ చేయలేం. మా బిజినెస్‌కు ఏమైతే అనుకూలమో వాటినే చేస్తాం’ అని వివరించారు. అడ్వాన్స్‌ నావిగేషన్‌ అండ్‌ సోలార్‌ టెక్నాలజీస్‌ కొనుగోలుతో పతంజలి.. సోలార్‌ ఎక్విప్‌మెంట్‌ మాన్యుఫాక్చరింగ్‌ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

అలాగే ఎడిబుల్‌ ఆయిల్‌ తయారీ కంపెనీ రుచి సోయా ఇండస్ట్రీస్‌ కొనుగోలు రేసులోనూ ముందుంది. ఆఫర్‌ ధరను రూ.4,300 కోట్లకు పెంచింది. ఇది అదానీ గ్రూప్‌ ఆఫర్‌ కంటే 30 శాతం అధికం. ఈ  ఆఫర్లపై చర్చించడానికి రుచి సోయా రుణ దాతల కమిటీ రేపు(బుధవారం) సమావేశం కావచ్చు. పతంజలి ప్రధాన బిజినెస్‌ ప్యాకేజ్డ్‌ కన్సూమర్‌ గూడ్స్‌. కంపెనీకి రిటైల్, ఎడ్యుకేషన్, హెల్త్‌కేర్‌ (ఆయుర్వేద్‌) విభాగాల్లోనూ కార్యకలాపాలున్నాయి. కంపెనీ షాంపు, టూత్‌పేస్ట్‌ నుంచి బిస్కట్లు, నూడిల్స్, బియ్యం, గోధుమ వరకు చాలా ప్రొడక్టులను విక్రయిస్తోంది.

ఇతర విభాగాల్లోకి ఎందుకంటే..
పతంజలి ఆదాయాల వృద్ధి రేటు నిలిచిపోయింది. రెట్టింపు అమ్మకాలను లక్ష్యంగా నిర్దేశించుకున్నప్పటికీ పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ వంటి అంశాల కారణంగా కంపెనీకి సవాళ్లు ఎదురయ్యాయి. దీంతో 2017–18 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం దాదాపు 2016–17 ఏడాది మాదిరిగానే ఉంది.

2017 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం రూ.10,561 కోట్లు. అందుకే పతంజలి డైవర్సిఫికేషన్‌కు ప్రాధాన్యమిస్తోందని మార్కెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. మరోవైపు బీ2బీ, బీ2సీ వ్యాపారాల మధ్య చాలా వ్యత్యాసాలుంటాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.


ఇవీ... సిమ్‌ కార్డు విశేషాలు
తొలిదశలో పతంజలి ఉద్యోగులు, కార్యాలయ సిబ్బందే స్వదేశీ సమృద్ధి సిమ్‌ కార్డుల ప్రయోజనాలను పొందగలరు. ఈ స్కీమ్‌ గనక విజయవంతమైతే... వీటిని సామాన్య ప్రజలకూ అందుబాటులోకి తీసుకొస్తామని ట్విట్టర్, ఫేస్‌బుక్‌ ద్వారా సంస్థ తెలిపింది.
స్వదేశీ సమృద్ధి సిమ్‌ కార్డుల ద్వారా అర్జించిన లాభాలను దేశ ప్రజల సంక్షేమానికి వినియోగిస్తామని పతంజిలి పేర్కొంది.
సిమ్‌ కార్డులను పూర్తిస్థాయిలో మార్కెట్‌లోకి తెచ్చిన తర్వాత.. స్వదేశీ సమృద్ధి సిమ్‌ కార్డ్‌ తీసుకున్నవారు పతంజలి ప్రొడక్టులపై 10 శాతం డిస్కౌంట్‌ పొందొచ్చని ‘ఏఎన్‌ఐ’ వార్తా సంస్థ తెలిపింది. అలాగే ఆరోగ్య, ప్రమాద, జీవిత బీమా ప్రయోజనాలూ ఉంటాయి.
స్వదేశీ సమృద్ధి సిమ్‌ కార్డ్‌పై రూ.144 రీచార్జ్‌తో అపరిమిత కాల్స్, 2 జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు పొందొచ్చు. ఈ ప్యాక్‌ వాలిడిటీ మాత్రం వెల్లడి కాలేదు.
 బీఎస్‌ఎన్‌ఎల్‌కు చెందిన ఐదు లక్షల కౌంటర్ల ద్వారా త్వరలో వినియోగదారులు పతంజలి సిమ్‌ కార్డులను పొందొచ్చని రాందేవ్‌ బాబా చెప్పినట్లు ఏఎన్‌ఐ తెలిపింది. 

మరిన్ని వార్తలు