రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌పై పేటెంట్‌ ఉల్లంఘన కేసు

21 May, 2019 00:53 IST|Sakshi

అమెరికాలో వ్యాజ్యం దాఖలు చేసిన ఫ్లాష్‌ ఎలక్ట్రానిక్స్‌  

న్యూఢిల్లీ: ఆటో విడిభాగాల తయారీ సంస్థ ఫ్లాష్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇండియా, ఐచర్‌ మోటార్స్‌కు చెందిన రాయల్‌ఎన్‌ఫీల్డ్‌కు వ్యతిరేకంగా అమెరికా న్యాయ స్థానంలో పేటెంట్‌ ఉల్లంఘన కేసు దాఖలు చేసింది. ద్విచక్ర వాహనంలో వినియోగించే ఓ ఉపకరణం పేటెంట్‌ను రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఉల్లంఘించినట్టు ఆరోపించింది. ఫ్లాష్‌ ఎలక్ట్రానిక్స్‌కు రెగ్యులేటర్‌ రెక్టిఫయర్‌ డివైజ్, అవుట్‌పుట్‌ ఓల్టేజ్‌ రెగ్యులేటింగ్‌ విధానానికి  అమెరికా పేటెంట్, ట్రేడ్‌ మార్క్‌ ఆఫీసు జారీ చేసిన పేటెంట్‌ ఉంది. దీన్ని రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఉల్లంఘించినట్టు ఫ్లాష్‌ ఎలక్ట్రానిక్స్‌ తన వ్యాజ్యంలో పేర్కొంది. యూరోప్‌లోని జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, బ్రిటన్, నెదర్లాండ్స్, స్వీడన్, స్పెయిన్, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, టర్కీలోనూ ఈ ఉపకరణంపై తమకు పేటెంట్‌ ఉన్నందున ఈ దేశాల్లోనూ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌కు వ్యతిరేకంగా ఇదే తరహా వ్యాజ్యాలను దాఖలు చేయనున్నట్టు ఫ్లాష్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇండియా తెలిపింది.

ఆటోమొబైల్‌ రంగంలో ప్రతిష్టాత్మక సంస్థ అయిన రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఈ తరహా అనూహ్యమైన, అసాధారణ చర్యకు పాల్పడడం, దానిపై తాము పోరడాల్సి రావడం దురదృష్టకరంగా ఫ్లాష్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ ఎండీ సంజీవ్‌ వాసుదేవ్‌ పేర్కొన్నారు. ఈ విషయాన్ని స్నేహపూర్వకంగా పరిష్కరించుకుందామని 2018 అక్టోబర్‌ 12న రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌కు చెందిన ముగ్గురు ఉద్యోగులను సంప్రదించినప్పటికీ పరిష్కారం లభించలేదన్నారు. పేటెంట్‌ ఉల్లంఘనకు ముగింపు పలికి, తమకు పరిహారం చెల్లించే వరకు ప్రపంచవ్యాప్తంగా దీనిపై పోరాడతామన్నారు. 

>
మరిన్ని వార్తలు