‘జేబ్’ నుంచి చెల్లించండి..!

26 Jul, 2016 00:51 IST|Sakshi
‘జేబ్’ నుంచి చెల్లించండి..!

వీసాఫ్ట్ నుంచి పేమెంట్ అప్లికేషన్..
త్వరలో అందుబాటులోకి
కంపెనీ చైర్మన్ మూర్తి వీరఘంట

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : బ్యాంకింగ్ టెక్నాలజీ సొల్యూషన్స్ కంపెనీ వీసాఫ్ట్ ‘జేబ్’ పేరిట వినూత్న అప్లికేషన్‌ను అభివృద్ధి చేసింది. మార్కెట్లో అందుబాటులో ఉన్న మొబైల్ పేమెంట్ సొల్యూషన్స్‌కు పూర్తి భిన్నంగా... వాలెట్ నుంచి కాకుండా చెల్లింపులు బ్యాంకు ఖాతా నుంచి మరో బ్యాంకు ఖాతాకు నేరుగా బదిలీ చేయటమే దీని ప్రత్యేకత. లావాదేవీ సైతం వెంటనే పూర్తవుతుంది. ఇక డబ్బులు స్వీకరించేవారికి యాప్ ఉండాల్సిన అవసరం కూడా లేదు. బ్యాంకు ఖాతా ఉంటే చాలు. ఈ యాప్ విషయమై వీసాఫ్ట్ ఇప్పటికే పలు బ్యాంకులతో చర్చిస్తోంది. ఆగస్టులో జేబ్ సేవలు సామాన్యులకు అందుబాటులోకి వచ్చే అవకాశమున్నట్లు సంస్థ చైర్మన్ మూర్తి వీరఘంట తెలిపారు. సీవోవో శ్రీనివాస్ ద్రోణంరాజుతో కలిసి సోమవారమిక్కడ మీడియాతో ఆయన మాట్లాడారు. కస్టమర్ తనకున్న అన్ని బ్యాంకు ఖాతాలను జేబ్ యాప్‌కు అనుసంధానించవచ్చని చెప్పారు. లావాదేవీలకయ్యే ఖర్చు చాలా తక్కువన్నారు.

 ఇవీ జేబ్ ప్రత్యేకతలు..
యాప్ నమోదుకు ఆధార్, మొబైల్ నంబరు, బ్యాంకు ఖాతా నంబరు లేదా ఈ-మెయిల్ ఐడీ వంటి వర్చువల్ అకౌంట్ అవసరం. వీటి ఆధారంగా నగదు స్వీకరించవచ్చు, చెల్లించవచ్చు. నగదు చెల్లించే సమయంలో ఎంత మొత్తం బదిలీ చేయాలి? ఎవరికి చెల్లించాలి? అనేది యాప్ అడుగుతుంది. స్వీకరించే వ్యక్తి తాలూకు ఆధార్, మొబైల్, బ్యాంకు ఖాతా నంబరు ఇవ్వాలి. లేదా క్యూఆర్ కోడ్ ఉంటే స్కాన్ చేయొచ్చు. ఎందుకు చెల్లిస్తున్నారో అడుగుతుంది. పిన్ ఇచ్చి ఓకే చెప్పగానే స్వీకర్త ఖాతాకు క్షణాల్లో నగదు వెళ్తుంది. స్వీకర్తకు స్మార్ట్‌ఫోన్ లేకపోయినా వారి బ్యాంకు ఖాతా కు డబ్బులు పంపించొచ్చు. నగదు వచ్చినట్టు స్వీకర్త మొబైల్‌లో సందేశం వస్తుంది. ఇక యాప్‌లోని క్యాలెండర్ ద్వారా రానున్న రోజుల్లో చేయాల్సిన చెల్లింపుల తేదీలను నమోదు చేసుకోవచ్చు.

 సొంత క్యాంపస్‌లు: వీసాఫ్ట్‌కు అట్లాంటాలో 200 మంది, హైదరాబాద్‌లో 800, రాజమండ్రిలో 200 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. హైదరాబాద్‌లో 2,500 మంది సిబ్బంది పనిచేసే వీలున్న సొంత కేంద్రాన్ని నెలకొల్పుతామని మూర్తి వీరఘంట వెల్లడించారు. అలాగే వైజాగ్‌లో 1,200 మంది సీటింగ్ సామర్థ్యంతో రూ.40 కోట్లతో డెలివరీ సెంటర్‌ను నిర్మిస్తున్నట్టు చెప్పారు. రాజమండ్రి కార్యాలయాన్ని విస్తరిస్తామన్నారు. విస్తరణకుగాను త్వరలో రూ.200 కోట్లకుపైగా నిధులు సమీకరిస్తామని వెల్లడించారు. తాము అభివృద్ధి చేసిన జేబ్ యాప్ రానున్న రోజుల్లో ఏటీఎం కార్డుల్ని భర్తీ చేస్తుందని చెప్పారాయన. 1996లో ప్రారంభమైన వీసాఫ్ట్ ప్రపంచవ్యాప్తంగా 2,600 ఫైనాన్షియల్ సంస్థలకు సేవలందిస్తోంది.

మరిన్ని వార్తలు