నోటీసులొస్తాయ్‌.. జాగ్రత్త!!

2 Apr, 2018 00:09 IST|Sakshi

కొత్త ఆర్థిక సంవత్సరం వచ్చింది. 2017–18 ఆర్థిక సంవత్సరానికి గానూ చెల్లింపులు, టీడీఎస్‌ వంటి వాటిని కచ్చితంగా చూసుకోండి. పన్ను రికవరీ చేసే అధికారులు/ సంస్థలు సరిగ్గా పనిచేయకపోవడం, రికవరీని బ్యాంకుల్లో చెల్లించకపోవడం, రిటర్నులను గవర్నమెంట్‌ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయకపోవడం వలన ఆదాయపు పన్ను శాఖ వారు నిర్వహిస్తున్న మీ ఖాతాలో సమాచారం లేకపోవడం లేదా తప్పుడు సమాచారం ఉండడం కారణంగా నోటీసులు వచ్చే అవకాశముంది. ఇటువంటివి ఏమైనా  జరుగుతున్నాయేమో ఒకసారి చూడండి...

రిటైర్డ్‌ హెడ్‌మాస్టర్‌ ప్రసాద్‌కు పెన్షన్‌ వస్తుంది. చివరి మూడు నెలల్లోనే పన్ను కోత వేశారు. కానీ సమాచారం అప్‌లోడ్‌ చేసేటప్పుడు ఫారం 26ఏఎస్‌లో 3 నెలల పెన్షన్, సంవత్సరపు ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ చూపించారు. మీరు రిటర్ను వేసేటప్పుడు 12 నెలల పెన్షన్‌ చూపించాలి. మీ రిటర్నుకి 26ఏఎస్‌కి సమాచారం పరంగా మిస్‌మాచ్‌. మీరు రిటర్ను సరిగ్గా వేసినా, పన్ను సరిగ్గా చెల్లించినా ఇలాంటి మిస్‌మాచ్‌ వలన సమస్యలు ఉత్పన్నమౌతాయి. నోటీసులు తథ్యం. 

చాలా మంది బ్యాంకులో చేసిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల విషయంలో అనాలోచితంగా ఆలోచిస్తున్నారు. ట్యాక్సబుల్‌ ఆదాయం ఉన్నప్పటికీ పన్ను రికవరీ చేయవద్దని ఫారాలు సబ్‌మిట్‌ చేస్తున్నారు. కొంత మంది ఈ అంశాన్ని కావాలని మరిచిపోతున్నారు. బ్యాంకర్లు పని ఒత్తిడి వలన వీలున్నప్పుడు రికవరీ చేయడం, వీలులేనప్పుడు మానేయడం చేస్తున్నారు. అసెసీలు కూడా ఫారం 26ఏఎస్‌ని చెక్‌ చేసుకోవడం లేదు.

ఫలితంగా రిటర్నులు వేసేటప్పుడు బ్యాంకుల్లో వడ్డీ విషయం మరచిపోతున్నారు. 26ఏఎస్‌లో ఉన్న వడ్డీని, టీడీఎస్‌ని పరిగణనలోకి తీసుకోకుండా రిటర్నులు దాఖలు చేస్తున్నారు. కొంత మంది వడ్డీ మీద టీడీఎస్‌తో పన్ను భారం తీరిపోయిందని అనుకుంటున్నారు. అది మీరున్న శ్లాబును బట్టి ఉంటుంది. వీటి వలన అదే మిస్‌మాచ్‌ సమస్య. మళ్లీ నోటీసులు. కొత్త సంవత్సరంలో ఇటువంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకండి.

1–4–2017 నుంచి 31–3–2018 వరకూ మీకువచ్చే ఆదాయపు జాబితా రూపొందించుకోండి. ఉదాహరణకు.. జీతం/పెన్షన్, ఇంటి అద్దె, బ్యాంకుల వడ్డీ, ఇతరత్రా వడ్డీ, స్వల్పకాలిక క్యాపిటల్‌ గెయిన్స్, దీర్ఘకాలిక క్యాపిటల్‌ గెయిన్స్‌ వంటివి.
   వీటికి సంబంధించిన జమలు, బ్యాంకుల్లో అన్ని అకౌంట్లని పరిశీలించండి.
    రావలసిన ఆదాయం కన్నా తక్కువగా అకౌంట్‌లో జమ అయిందంటే దానికి కారణం టీడీఎస్‌. చెక్‌ చేసుకోండి. అది పన్ను అయితే సంబంధిత సంస్థలను సంప్రదించండి.  
 టీడీఎస్‌ ప్రక్రియకి మే 2018 దాకా సమయం ఉంది. సమాచారాన్ని సిద్ధంగా పెట్టుకొని మే నెలాఖరు నుంచి 26 ఏఎస్‌ కోసం లాగిన్‌ అయ్యి చెక్‌ చేసుకోండి.
 తప్పుడు సమాచారం ఉన్నా.. లోటుపాట్లు ఉన్నా.. వెంటనే వారిని సంప్రదించండి.
   రిటర్ను వేయడానికి గడువు తేదీ జూలై 2018.  
   వీలయితే ఫారం 16, 16ఏలు పొందండి.
    26ఏఎస్‌ సమాచారమే మీకు మార్గదర్శకం. కానీ 26ఏఎస్‌లో తప్పులున్నా, మీకు సంబంధించని సమాచారం ఉన్నా మిమ్మల్ని మీరు సమర్థించుకోవచ్చు.   

మరిన్ని వార్తలు