ఎమ్‌ఎక్స్‌ ప్లేయర్‌లో పేటీఎమ్, టెన్సెంట్‌ పెట్టుబడులు

3 Jul, 2019 11:09 IST|Sakshi

రూ.860 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్స్‌

న్యూఢిల్లీ: టైమ్స్‌ ఇంటర్నెట్‌ ఆన్‌లైన్‌ వీడియో స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫార్మ్, ఎమ్‌ఎక్స్‌ ప్లేయర్‌లో భారీ పెట్టుబడులు రానున్నాయి. ఎమ్‌ఎక్స్‌ ప్లేయర్‌లో డిజటల్‌ చెల్లింపుల సంస్థ, పేటీఎమ్, చైనా ఇంటర్నెట్‌ సంస్థ, టెన్సెంట్‌లు ఈ నెలలోనే రూ.860 కోట్ల(12.5 కోట్ల డాలర్ల)మేర పెట్టుబడులు పెట్టనున్నాయి. భారత ఇంటర్నెట్‌ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టే వ్యూహంలో భాగంగా టెన్సెంట్‌ కంపెనీ ఈ పెట్టుబడులు పెడుతోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. దీర్ఘకాల పెట్టుబడుల వ్యూహంలో భాగంగా పేటీఎమ్‌ కంపెనీ ఎమ్‌ఎక్స్‌ ప్లేయర్‌లో ఇన్వెస్ట్‌ చేస్తోందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఈ వార్తలపై ఈ మూడు సంస్థలు ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. 

50 కోట్లకు పైగా డౌన్‌లోడ్స్‌...
ఆండ్రాయిడ్‌ ప్లాట్‌ఫార్మ్‌పై ఎమ్‌ఎక్స్‌ ప్లేయర్‌ డౌన్‌లోడ్స్‌ 50 కోట్లకు మించాయి. హిందీ, ఇతర భారత ప్రాంతీయ భాషల్లో ఒరిజినల్‌ కంటెంట్‌పై ఎమ్‌ఎక్స్‌ ప్లేయర్‌ దృష్టి పెడుతోంది. కాగా టైమ్స్‌ ఇంటర్నెట్‌ మ్యూజిక్‌ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫార్మ్‌ ‘గానా’లో గత ఏడాది ఫిబ్రవరిలో టెన్సెంట్‌ కంపెనీ 11.5 కోట్ల డాలర్ల మేర పెట్టుబడులు పెట్టింది.  

మరిన్ని వార్తలు