పేటీఎంకు గోల్డెన్‌ ఛాన్స్‌..

12 Mar, 2018 18:46 IST|Sakshi

న్యూఢిల్లీ : డిజిటల్‌ పేమెంట్స్‌ ప్లాట్‌ఫాం పేటీఎం గోల్డెన్‌ ఛాన్స్‌ కొట్టేసింది. ఐపీఎల్‌ అంపైర్‌ పార్ట్‌నర్‌గా వ్యవహరించే అవకాశం దక్కించుకుంది. ఈ విషయాన్ని బీసీసీఐ సోమవారం ధ్రువీకరించింది. రానున్న ఐదేళ్లపాటు ఈ ఒప్పందం కొనసాగుతుందని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ‘ప్రస్తుతం పేటీఎం టీమిండియా టైటిల్‌ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. అలాగే ఐపీఎ‍ల్‌తో కూడా బంధం కొనసాగించేందుకు ఒప్పందం కుదిరింది. దీని ద్వారా బీసీసీఐతో పాటు పేటీఎం కూడా లాభపడుతుందని’ ఐపీఎల్‌ చైర్మన్‌ రాజీవ్‌ శుక్లా పేర్కొన్నారు.

పేటీఎం సీఈఓ విజయ్‌ శేఖర్‌ శర్మ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా క్రేజ్‌ సంపాదించుకున్న ఐపీఎ‍ల్‌లో భాగస్వాములవడం ఆనందంగా ఉందన్నారు. అనతికాలంలోనే తమకు ఈ అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నామంటూ హర్షం వ్యక్తం చేశారు. ఏప్రిల్‌ 7న ప్రారంభంకానున్న ఐపీఎల్‌-2018 సీజన్‌లో డిఫెండింగ్‌ చాంపియన్ ముంబై ఇండియన్స్‌తో.. చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు తలపడనుంది. రెండేళ్ల విరామం తర్వాత చెన్నై సూపర్‌కింగ్స్‌ ఐపీఎల్‌లోకి పునరాగమనం చేస్తుండటంతో ముంబై వేదికగా జరిగే  మ్యాచ్‌ కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

>
మరిన్ని వార్తలు