పేటీఎం ఆఫీసు బాయ్‌కి ఒక్కసారిగా రూ.20 లక్షలు

30 Jan, 2018 09:18 IST|Sakshi
లక్షాధికారులుగా పేటీఎం ఉద్యోగులు(ఫైల్‌)

ముంబై : డిజిటల్‌ లావాదేవీల్లో శరవేగంగా దూసుకెళ్తున్న పేటీఎం ఇటీవల ప్రకటించిన రెండో స్టాక్‌ విక్రయంతో, 100కు పైగా ఆ కంపెనీ ఉద్యోగులు మిలీనియర్లుగా మారిన సంగతి తెలిసిందే. దాదాపు రూ.500 కోట్ల విలువైన స్టాక్‌ సేల్‌ను ఈ కంపెనీ చేపట్టింది. ఈ విక్రయంలో కంపెనీలో పనిచేసే, పనిచేసిన ఉద్యోగులు వారికున్న వాటాను(ఈసాప్స్‌) విక్రయించుకున్నారని పేటీఎం తెలిపింది. అయితే ఈ విక్రయం ద్వారా పేటీఎం చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ హరిందర్‌ థాకర్‌ దాదాపు రూ.40 కోట్లను ఆర్జించారు. పెద్ద పెద్ద స్థాయిల్లో ఉన్నవారు మాత్రమే కాక, ఆ కంపెనీలో పనిచేసే ఆఫీసు బాయ్‌ కూడా లక్షాధికారి అయిపోయాడు. ఈ స్టాక్‌ విక్రయంతో తమ కంపెనీకి చెందిన ఆఫీసు బాయ్‌, రూ.20 లక్షలకు పైగా ఆర్జించినట్టు వన్‌97 కమ్యూనికేషన్‌ లిమిటెడ్‌ సోమవారం రిపోర్టు చేసింది. 

ఇతర ఉద్యోగుల వివరాలను బహిర్గతం చేయనప్పటికీ, కెనడా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌, ఆఫీసు బాయ్‌ వివరాలను మాత్రం బయటికి వెల్లడించింది. 2017 మార్చిలో లెక్కించిన విలువ కంటే పేటీఎం ప్రస్తుత విలువ 3 బిలియన్‌ డాలర్లు అధికంగా ఉంది.  కంపెనీ ప్రస్తుత ఇన్వెస్టర్లుగా సాఫ్ట్‌బ్యాంకు, ఎస్‌ఏఐఎఫ్‌ పార్టనర్స్‌, అలీబాబా గ్రూప్‌ హోల్డింగ్‌ లిమిటెడ్‌, యాంట్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ గ్రూప్‌లు ఉన్నాయి. కంపెనీ ఈసాప్స్‌ కేవలం టాప్‌, మిడ్‌ లెవల్‌ ఎగ్జిక్యూటివ్‌లకు మాత్రమే కాకుండా.. ముందు నుంచి కంపెనీ పనిచేసిన ఉద్యోగులకు, ఆఫీసు స్టాఫ్‌కు కూడా కంపెనీ అందించింది. ఉద్యోగులు సొంతంగా షేర్లను కలిగి ఉండటానికి అనుమతించే ఆర్థిక సాధనమే ఈసాప్స్‌. కొంత కాలం తర్వాత ఈ షేర్లను అమ్మి, నగదుగా మార్చుకోవచ్చు.  


 

మరిన్ని వార్తలు