ట్రావెల్‌ బిజినెస్‌లో రూ.250 కోట్లు

20 Sep, 2019 06:00 IST|Sakshi

ఇన్వెస్ట్‌  చేస్తున్న పేటీఎమ్‌

ఈ ఆర్థిక సంవత్సరంలో 100% వృద్ధి

న్యూఢిల్లీ: డిజిటల్‌ చెల్లింపుల కంపెనీ పేటీఎమ్‌ తన ట్రావెల్‌ బిజినెస్‌లో రూ.250 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనున్నది. రానున్న ఆరు నెలల్లో ఈ పెట్టుబడులు పెడతామని పేటీఎమ్‌ తెలిపింది. పర్యాటక వ్యాపార విస్తృతిని పెంచుకోవడానికి, టెక్నాలజీని మరింత పటిష్టం చేసుకోవడానికి ఈ పెట్టుబడులను వినియోగిస్తామని పేటీఎమ్‌ ట్రావెల్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అభిషేక్‌ రాజన్‌ చెప్పారు. అంతే కాకుండా మార్కెట్‌ వాటా పెంచుకోవడానికి, పర్యాటకానికి సంబంధించిన కొత్త విభాగాల్లో ప్రవేశించడానికి కూడా ఈ పెట్టుబడులను ఉపయోగిస్తామని  వివరించారు. తమ పర్యాటక వ్యాపారంలో వినియోగదారుల సంఖ్య కోటిన్నరగా ఉందని, వార్షిక స్థూల వ్యాపార విలువ రూ.7,100 కోట్లని పేర్కొన్నారు.  

ప్రతి నెలా 60 లక్షల టికెట్ల విక్రయం....
కొత్త వినియోగదారుల్లో 65 శాతానికి పైగా మధ్య తరహా, చిన్న నగరాల నుంచే ఉంటారని ఈ నగరాల్లో  పటిష్టమైన వృద్ధి కొనసాగగలదని అంచనా వేస్తున్నామని రాజన్‌  పేర్కొన్నారు. తాజా పెట్టుబడులతో ట్రావెల్‌ బుకింగ్‌ స్పేస్‌లో తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోగలమని వివరించారు. ప్రతినెల 60 లక్షల ట్రావెల్‌ టికెట్లను విక్రయించగలుగుతున్నామని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వంద శాతం వృద్ధిని సాధించగలమని చెప్పారు.

విమాన, బస్‌ టికెట్లను రద్దు చేసుకోవడానికి ఎలాంటి చార్జీలు వసూలు చేయడం లేదని, దీని వల్ల తమ వినియోగదారులకు రూ.60 కోట్లకు పైగా ప్రయోజనం చేకూరిందని వివరించారు. విమాన టికెట్లను రద్దు చేసే విషయంలో ఎలాంటి చార్జీలు విధించని ఏకైక ట్రావెల్‌ సంస్థ తమదే కావచ్చని పేర్కొన్నారు. 90 శాతానికి పైగా టికెట్ల బుకింగ్‌లు మొబైల్‌ యాప్‌ ద్వారానే జరుగుతున్నాయని తెలిపారు. బెంగళూరు కేంద్రంగా పర్యాటక వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని, ఇక్కడ 300 మంది ఉద్యోగులతో పటిష్టమైన బృందాన్ని తయారు చేశామని తెలిపారు

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా