పేటీఎంపై ఫిర్యాదుల వెల్లువ

23 Dec, 2016 00:31 IST|Sakshi
పేటీఎంపై ఫిర్యాదుల వెల్లువ

లావాదేవీలు నిలిచిపోతున్నాయంటూ యూజర్ల గగ్గోలు..
బ్యాంకులో సొమ్ము డెబిట్‌ అవుతోంది.. 
వ్యాలెట్‌లో మాత్రం జమ కావడం లేదని ఫిర్యాదులు


న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు(డీమోనిటైజేషన్‌)తో ఇప్పుడు ఎవరినోట విన్నా డిజిటల్‌ చెల్లింపులు.. క్యాష్‌లెస్‌ ఆర్థిక వ్యవస్థ అనే పదాలే వినబడుతున్నాయి. దీంతో మొబైల్‌ వ్యాలెట్‌ కంపెనీలు అనూహ్యంగా విశేష ప్రాచుర్యంలోకి వచ్చాయి. అయితే, లావాదేవీల విషయంలో మాత్రం వినియోగదార్లు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రధానంగా పేటీఎం యూజర్ల నుంచి క్రమక్రమంగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తమ బ్యాంక్‌ అకౌంట్ల నుంచి సొమ్ము వెళ్లిపోతోందని.. పేటీఎం ఈ–వ్యాలెట్‌లో మాత్రం ఇది జమ కావడం లేదనేది అత్యధికంగా వస్తున్న ఫిర్యాదు.

అంతేకాదు పేటీఎం వ్యాలెట్‌లో ప్రస్తుతం ఎంత నగదు ఉందో చూసుకోవడం కూడా కుదరడం లేదని గగ్గోలు పెడుతున్నారు. వ్యాలెట్‌లోని సొమ్మును తిరిగి బ్యాంక్‌ ఖాతాలోకి బదిలీ చేయాలనుకున్నా సాధ్యం కావడం లేదని... లావాదేవీలు పదేపదే విఫలం అవుతున్నాయని యూజర్లు పేర్కొంటున్నారు. గడిచిన కొద్ది రోజులుగా ఇలాంటి ఫిర్యాదులు పెరిగిపోతున్నాయి. దీంతో ఒకపక్క నగదు కొరతతో వ్యాలెట్లను ఆశ్రయిస్తున్న జనాలకు మరోరకం కొత్త సమస్యల్లో చిక్కుకోవాల్సిన పరిస్థితి నెలకొంటోంది.

కస్టమర్‌ (డోంట్‌)కేర్‌...
డిజిటల్‌ చెల్లింపులు విఫలం అయినప్పుడు పేటీఎం కస్టమర్‌ కేర్‌కు ఫోన్‌ చేసినా ఉపయోగం లేకుండా పోతోందని యూజర్లు పేర్కొంటున్నారు. అసలు ఆయా లావాదేవీలను పరిశీలించి, సమస్యను పరిష్కరించేందుకు వీలుగా పేటీఎం వ్యాలెట్‌ వ్యవస్థలో ‘నో ట్రాన్సాక్షన్‌ ఐడీ’లు అనేవి రూపొందడం లేదని కూడా వినియోగదార్లు చెబుతున్నారు. ఇక యాపిల్‌ హ్యాండ్‌సెట్లను ఉపయోగించే పలువురు యూజర్లయితే.. తమ పేటీఎం వ్యాలెట్‌ ఖాతాలను తెరిచి దానిద్వారా ఏదైనా చెల్లింపులు, ఇరరత్రా లావాదేవీలు చేయలేకపోతున్నామని కూడా పేర్కొం టుండటం గమనార్హం.

ఈ సమస్యలపై పేటీఎం అధికార ప్రతినిధి స్పందిస్తూ.. సర్వర్‌కు సరిగ్గా అనుసంధానం కాకపోవడం, ఇతరత్రా సాంకేతికపరమైన అంశాలను దీనికి కారణంగా పేర్కొన్నారు. వాస్తవానికి బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి సొమ్ము వెళ్లిపోయి.. వ్యాలెట్లో జమకానప్పుడు 48 గంటల సమయంలో ఆటోమేటిక్‌గా ఇది పరిష్కారం అవుతుందని.. బ్యాంక్‌ సర్వర్లు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటుండటం వల్లే ఇలాంటి సమస్యలు అధికం అవుతున్నాయనేది పేటీఎం ప్రతినిధి వివరణ. కాగా, పేటీఎం కస్టమర్‌ కేర్‌తో పలుమార్లు తమ సమస్యను చెప్పినప్పటికీ.. బదిలీ చేసిన సొమ్ము ఖాతాలోకి రావడంలేదని కొందరు యూజర్లు వాపోతున్నారు.

సర్వర్ల సామర్థ్యం పెంచుతున్నాం...
సాంకేతికపరమైన సమస్యలకు కారణాలను కూడా పేటీఎం సరిగ్గా వివరించడం లేదు. కస్టమర్ల ట్రాఫిక్‌ను కొత్త సర్వర్లకు మళ్లించే చర్యలు కొనసాగుతున్నాయని.. అదరపు సామర్థ్యాన్ని కూడా జతచేస్తున్నామని మాత్రం చెబుతోంది. ఇక యాపిల్‌ హ్యాండ్‌సెట్‌ యూజర్ల విషయానికొస్తే... పేటీఎం ఐఓఎస్‌ యాప్‌లో ఒక సమస్య(బగ్‌)ను గుర్తించామని..  దీనివల్ల యాప్‌ పనిచేయడం నిలిచిపోతోందని పేటీఎం ప్రతినిధి చెప్పారు. త్వరలోనే యాప్‌ అప్‌డేట్‌ను అందుబాటులోకి తెస్తామన్నారు.

మరిన్ని వార్తలు