పీసీ జువెల్లరీ షేర్‌ బైబ్యాక్‌, స్టాక్‌ ర్యాలీ

11 May, 2018 11:54 IST|Sakshi
పీసీ జువెల్లరీ డైమాండ్‌ రింగ్‌

న్యూఢిల్లీ : ప్రముఖ జువెల్లరీ సంస్థ పీసీ జువెల్లరీ షేర్‌ బైబ్యాక్‌ ప్రకటించింది. రూ.424 కోట్ల విలువైన బైబ్యాక్‌ చేపడుతున్నట్టు పీసీ జువెల్లరీ పేర్కొంది. ఒక్కో యూనిట్‌ ధర రూ.350గా నిర్ణయించింది. ఇది గురువారం స్టాక్‌ ముగింపు ధర 209 రూపాయలకు 67 శాతం అధికం. గురువారం జరిగిన బోర్డు మీటింగ్‌లో 1.21 కోట్ల షేర్ల బైబ్యాక్‌ను ఆమోదించినట్టు ఈ జువెల్లరీ సంస్థ తెలిపింది. ఈ షేర్ల బైబ్యాక్‌లో ప్రమోటర్లు, ప్రమోటర్ల గ్రూప్‌ పాల్గొనదు. మార్చి క్వార్టర్‌ డేటా ప్రకారం ఈ కంపెనీలో ప్రమోటర్లు 57.63 శాతం వాటాను కలిగి ఉన్నారు. షేర్‌ బైబ్యాక్‌ ప్రకటనతో కంపెనీ స్టాక్‌ ప్రారంభ ట్రేడింగ్‌లోనే 18 శాతం పైకి ఎగిసింది. ఇంట్రాడేలో రూ.247 వద్ద గరిష్ట స్థాయిలను తాకింది. గత కొన్ని సెషన్లలో ఈ కంపెనీ షేరు తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది.

కానీ ఆరు ట్రేడింగ్‌ సెషన్ల నుంచి మాత్రం పీసీ జువెల్లరీ స్టాక్‌ సుమారు 88 శాతం ర్యాలీ జరుపుతూ వస్తోంది. మే 2న రూ.110.65గా ఉన్న పీసీ జువెల్లరీ స్టాక్‌, మే 10 తేదీకి రూ.209కు పెరిగింది. కానీ మే 3 తేదీన మాత్రం స్టాక్‌ 52 వారాల కనిష్ట స్థాయిలకు పడిపోయింది. మరోవైపు మరికొన్ని రోజుల్లో కంపెనీ తన మార్చి క్వార్టర్‌ ఫలితాలను ప్రకటించబోతోంది. 2018 మే 25న బోర్డు ఆఫ్‌ డైరెక్టర్లతో సమావేశం నిర్వహించిన అనంతరం ఈ ఫలితాలు వెల్లడికానున్నాయి. ఆ సమావేశంలోనే 2017 ఏప్రిల్‌ నుంచి 2017 సెప్టెంబర్‌ 1 మధ్య వరకు ఉన్న ప్రిఫరెన్స్‌ షేర్లపై డివిడెండ్‌ ప్రతిపాదనలను నిర్ణయించనున్నారు. పీసీ జువెల్లరీ ప్రస్తుతం మార్కెట్‌లో జువెల్లరీలను తయారీచేయడం, రిటైల్‌ చేయడం, ఎగుమతి చేయడం వంటి వ్యాపారాలను చేస్తోంది. 2005లో ఏర్పాటైన ఈ సంస్థ, దేశీయంగా రెండో అతిపెద్ద లిస్టెడ్‌ జువెల్లరీ రిటైలర్‌గా ఉంది.
 

మరిన్ని వార్తలు