చైనీస్‌ యాప్‌లపై చర్యలు: ‘తనొక అమెరికన్‌ తోలుబొమ్మ’

13 Jul, 2020 14:58 IST|Sakshi

వైట్‌హౌజ్‌ ట్రేడ్‌ అడ్వైసర్‌ పీటర్‌ నావరో కీలక వ్యాఖ్యలు

వాషింగ్టన్‌: టిక్‌టాక్‌ సీఈఓ కెవిన్‌ మేయర్‌పై శ్వేతసౌధ వాణిజ్య సలహాదారు పీటర్‌ నావరో ఘాటు వ్యాఖ్యలు చేశారు. చైనీస్‌ సోషల్‌ మీడియా యాప్‌ అభివృద్ధికై పనిచేస్తున్న కెవిన్‌.. ‘‘అమెరికన్‌ తోలుబొమ్మ’’ అంటూ మండిపడ్డారు. మహమ్మారి కరోనా కల్లోలం,  హాంకాంగ్‌లో కొత్త జాతీయ భద్రత చట్టం, వీగర్‌ ముస్లింలపై అకృత్యాలు, టిబెట్‌లో భద్రతాపరమైన ఆంక్షలు తదితర విషయాల్లో చైనాపై అమెరికా గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డ్రాగన్‌పై కఠిన ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతున్నట్లు శ్వేతసౌధ ప్రతినిధులు ఇదివరకే సంకేతాలు ఇచ్చారు. సరిహద్దు వివాదాల నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా చైనీస్‌ యాప్‌లపై భారత్‌ నిషేధం విధించిన తర్వాత అమెరికా సైతం ఇదే బాటలో నడిచేందుకు సిద్ధమైంది. ఇప్పటికే చైనీస్‌ దిగ్గజం వావే టెక్నాలజీస్‌పై ఆంక్షలు విధించిన అగ్రరాజ్యం టిక్‌టాక్‌ సహా వీచాట్‌ తదితర యాప్‌లను బ్యాన్‌ చేసే దిశగా ముందుకు సాగుతోంది.(చైనా మూలాలను చెరిపేస్తున్న టిక్‌టాక్‌)

ఈ నేపథ్యంలో ఆదివారం ఫాక్స్‌ బిజినెస్‌తో మాట్లాడిన పీటర్‌ నావరో ప్రజల గోప్యత హక్కుకు భంగం కలిగిస్తూ, అమెరికన్ల డేటాను తమ దేశానికి చేరవేస్తున్న చైనీస్‌ యాప్‌లపై కఠిన చర్యలు తీసుకునేందుకు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సిద్ధంగా ఉన్నారన్నారు. ‘‘ఈ విషయాన్ని అమెరికా ప్రజలంతా అర్థం చేసుకోవాలి. పిల్లలకు వినోదాన్ని కలిగించే కొన్ని మొబైల్‌ యాప్‌ల నుంచి డేటా మొత్తం నేరుగా చైనా సర్వర్లలోకి వెళ్లిపోతుంది. అంటే చైనీస్‌ మిలిటరీ, చైనీస్‌ కమ్యూనిస్టు పార్టీ చేతుల్లోకి అన్నమాట.

అంతేకాదు మన మేథోసంపత్తిని దొంగిలించాలనుకునే మరికొన్ని సంస్థల చేతుల్లోకి కూడా. మనకు సంబంధించిన వ్యక్తిగత, ఆర్థిక కార్యకలాపాల సమాచారాన్ని సేకరించి బ్లాక్‌మెయిల్‌, దోపిడీకి దిగే అవకాశం ఉంది. నాకు తెలిసి టిక్‌టాక్‌, వీచాట్‌ యాప్‌లపై త్వరలోనే కఠిన చర్యలు ఉంటాయి’’ అని పేర్కొన్నారు. ట్రంప్‌ ఇందుకు సంబంధించిన ప్రక్రియ మొదలుపెట్టే ఉంటారని భావిస్తున్నా అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ విషయంపై స్పందించిన టిక్‌టాక్‌ అధికార ప్రతినిధి తాము చట్టాలకు లోబడే పనిచేస్తున్నామని, యూజర్ల డేటాను చైనా ప్రభుత్వానికి చేరవేయలేదని స్పష్టం చేశారు.(చైనాపై మరిన్ని ఆంక్షలు: అమెరికా)

కాగా టిక్‌టాక్‌కు ఇప్పటికే అమెరికాలో గట్టి ఎదురుదెబ్బలు తగిలిన సంగతి తెలిసిందే. కాలిఫోర్నియాకు చెందిన మ్యూజికల్‌.ఎల్‌వై(Musical.ly)ఒప్పందం కుదుర్చుకున్న టిక్‌టాక్‌ జాతీయ చిన్నారుల భద్రతా చట్టాన్ని అతిక్రమించిందని ఫెడరల్‌ ట్రేడ్‌ కమిషన్(ఎఫ్‌టీసీ) ఇదివరకే సంస్థకు 5.7 మిలియన్‌ డాలర్ల మేరు జరిమానా విధించింది. అదే విధంగా 2019 ఫిబ్రవరిలో ఎఫ్‌టీసీతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని(కన్సెంట్‌ డిక్రీ) టిక్‌టాక్‌ ఉల్లంఘించిందని పలు అమెరికా అడ్వకసీ గ్రూపులు టిక్‌టాక్‌పై ఫిర్యాదు చేశాయి. అంతేగాక తమ పాటలను యథేచ్చగా వాడుకుంటూ కాపీరైట్‌ నిబంధనలు ఉల్లంఘించినందుకు పలు టాప్‌ అమెరికన్‌ మ్యూజిక్‌ కంపెనీలు టిక్‌టాక్‌పై దావా వేసేందుకు సిద్ధమైనట్లు వార్తలు వెలువడ్డాయి.

మరిన్ని వార్తలు