రికార్డు స్థాయిలో పెట్రోల్‌, డీజిల్‌ డిమాండ్‌

11 Jun, 2018 17:08 IST|Sakshi

న్యూఢిల్లీ : పెట్రోల్‌, డీజిల్‌ ధర అంతకంతకు పైకి ఎగిసినప్పటికీ, దేశీయంగా వీటి డిమాండ్‌ ఏ మాత్రం తగ్గలేదు. ధరలు పెరిగితే, డిమాండ్‌ పడిపోతుంది. కానీ ఇక్కడ ట్రెండ్‌ రివర్స్‌గా ఉంది. మే నెలలో దేశీయంగా డీజిల్‌, పెట్రోల్‌ విక్రయాలు గరిష్ట రికార్డు స్థాయిలను తాకాయి. పెట్రోలియం ప్లానింగ్‌ అండ్‌ అనాలసిస్‌ సెల్‌(పీపీఏసీ) వెలువరించిన డేటాలో ఈ విషయం వెల్లడైంది. గత నెలలో ఇంధన వినియోగం 18.72 మిలియన్‌ టన్నులుగా నమోదైనట్టు తెలిసింది. దీనిలో డీజిల్‌ విక్రయాలు 7.55 మిలియన్‌ టన్నులకు పెరిగినట్టు పీపీఏసీ డేటా వెల్లడించింది. గ్యాసోలిన్ లేదా పెట్రోల్‌ వినియోగం కూడా 2.46 మిలియన్‌ టన్నులకు చేరుకున్నట్టు తెలిపింది. 1998 ఏప్రిల్‌ నుంచి పోలిస్తే ఈ నెలలో అత్యధిక విక్రయాలు నమోదయ్యాయి. 

ఇంధన వినియోగంలో భారత్‌, ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆయిల్‌ కన్జ్యూమర్‌గా ఉంది. ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు ఇంధన వినియోగం 35.2 మిలియన్‌ టన్నులకు పెరిగిందని, ఇది గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 6 శాతం అధికమని పీపీఏసీ డేటా పేర్కొంది. 2018లో దేశీయంగా నెలవారీ సగటు డీజిల్‌ విక్రయాలు 7.05 మిలియన్‌ టన్నులుగా ఉన్నాయి. గతేడాది ఇవి 6.6 మిలియన్‌ టన్నులుగా ఉన్నట్టు తెలిసింది.  అదేవిధంగా పెట్రోల్‌ విక్రయాలు ఏప్రిల్‌ నుంచి మే నెలకు 7.6 శాతానికి పెరిగాయి. గతేడాది ఇదే నెలతో పోలిస్తే 2 శాతం అధికం. నెలవారీ పెట్రోల్‌ విక్రయాలు కూడా ఈ ఏడాది సగటున 2.27 మిలియన్‌ టన్నులకు పెరిగినట్టు పీపీఏసీ డేటా వెల్లడించింది. 2017 నుంచి 7 శాతం ఎక్కువ.  

అయితే గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది డీజిల్‌ వినియోగం రెండింతలు పైగా నమోదైందని విశ్లేషకులు, ట్రేడర్లు చెప్పారు. సాధారణ రుతుపవనాలు నమోదైతే, డీజిల్‌ డిమాండ్‌ మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. సగానికి పైగా దేశీయ జనాభా వ్యవసాయ రంగంపైనే ఎక్కువగా ఆధారపడుతుందని, ఈ రంగంలో నీటి పారుదల పంపులు ఎక్కువగా డీజిల్‌పై ఆధారపడి ఉంటాయని చెప్పారు.  

మరిన్ని వార్తలు