భారీగా పెరిగిన పెట్రోల్‌ ధర, మరింత పైకే..

18 Jan, 2018 18:22 IST|Sakshi

ముంబై : పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరింత పెరిగాయి. పెట్రోల్‌ ధరలు మూడేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. దీంతో ముంబైలో లీటరు పెట్రోల్‌ ధర 80 రూపాయలకు దగ్గరిలో రూ.79.44గా రికార్డైంది. అంటే ఒక్కరోజులోనే 17పైసల మేర పైకి ఎగిసింది. ఢిల్లీ, కోల్‌కత్తా, చెన్నైలో కూడా పెట్రోల్‌ ధరలు లీటరుకు రూ.71.56గా, రూ.74.28గా, రూ.74.20గా నమోదయ్యాయి. అదేవిధంగా డీజిల్‌ ధరలు కూడా ముంబైలో బుధవారం కంటే 21 పైసలు ఎక్కువగా రూ.66.30గా నమోదయ్యాయి. ఢిల్లీలో కూడా లీటరు డీజిల్‌ ధర ఒక్కరోజులోనే 19 పైసలు పెరిగి రూ.62.65గా ఉంది. ఇలా కోల్‌కత్తా, చెన్నై, హైదరాబాద్‌లో కూడా డీజిల్‌ ధరలు రికార్డులు సృష్టిస్తున్నాయి. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్‌ ధర రూ.75.32ను క్రాస్‌ కాగ, డీజిల్‌ ధర లీటరుకు రూ.67.09గా ఉంది. ఇవి ఇక్కడ ఆల్‌-టైమ్‌ హైగా తెలిసింది.

గతవారం నుంచి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. గ్లోబల్‌ క్రూడ్‌ ధరలు పెరుగుతుండటంతో, దేశీయంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ ధరలు మరింత పెరిగే అవకాశమే కనిపిస్తుండటంతో, పెట్రోల్‌, డీజిల్‌ ధరలను కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్‌లు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్ష పార్టీల అనంతరం, కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రి కూడా జీఎస్టీ కింద ఆయిల్‌, నేచురల్‌ గ్యాస్‌ తీసుకురావాలని ప్రతిపాదిస్తోంది. మరోవైపు  పలు ప్రధాన అంశాలపై నేడు జీఎస్టీ కౌన్సిల్‌ భేటీ అయింది. దీనిలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం ప్రధాన అంశంగా తెలుస్తోంది.

మరిన్ని వార్తలు