3వ రోజూ పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు అప్‌

9 Jun, 2020 10:00 IST|Sakshi

లీటర్‌ పెట్రోల్‌ 54 పైసలు ప్లస్‌

డీజిల్‌పై లీటర్‌కు 58 పైసలు వడ్డింపు

3 రోజుల్లో పెట్రోల్‌ లీటర్‌ రూ. 1.74 అప్‌

డీజిల్‌ లీటర్‌ ధర రూ. 1.78 పెంపు

వరుసగా మూడో రోజూ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. తాజాగా లీటర్‌ పెట్రోల్‌పై 54 పైసలు వడ్డించగా.. డీజిల్‌ ధర సైతం లీటర్‌కు 58 పైసలు ఎగసింది. దీంతో వరుసగా మూడు రోజుల్లో ఢిల్లీ మార్కెట్లో పెట్రోల్‌ లీటర్‌ ధర రూ. 1.74 బలపడగా.. డీజిల్‌ లీటర్‌ ధర రూ. 1.78 హెచ్చింది. దీంతో తాజాగా ఢిల్లీలో పెట్రోల్‌ లీటర్‌ ధర రూ. 73కు చేరగా.. డీజిల్‌ లీటర్‌ రూ. 71.17ను తాకింది. సుమారు 82 రోజులుగా పెట్రో ఉత్పత్తుల ధరల సవరణ చేపట్టని  ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్‌ దిగ్గజాలు మూడు రోజులుగా ధరలను పెంచుతూ వస్తున్నాయి. ఇందుకు ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లలో బలపడుతున్న ముడిచమురు ధరలు కారణమవుతున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. మరోపక్క డాలరుతో మారకంలో రూపాయి విలువసైతం ధరలను ప్రభావితం చేస్తుందని ఆర్థికవేత్తలు తెలియజేశారు. కాగా.. మార్చి 14న కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సయిజ్‌ డ్యూటీని లీటర్‌కు రూ. 3 చొప్పున పెంచడంతో పీఎస్‌యూ దిగ్గజాలు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(ఐవోసీ), భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌(బీపీసీఎల్‌), హిందుస్తాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌(హెచ్‌పీసీఎల్‌) రోజువారీ ధరల సమీక్షను నిలిపివేసిన సంగతి తెలిసిందే. తిరిగి మూడు రోజుల నుంచీ ధరలను సవరిస్తున్నాయి.

మరిన్ని వార్తలు