నెల బ్రేక్‌ : మళ్లీ పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌

5 Jul, 2018 10:34 IST|Sakshi
మళ్లీ పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

న్యూఢిల్లీ : వాహనదారులకు నెల పాటు ఎలాంటి షాకింగ్‌లు లేకుండా.. బ్రేక్‌ ఇచ్చిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మళ్లీ ఊపందుకున్నాయి. 36 రోజుల అనంతరం గురువారం మళ్లీ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. పెట్రోల్‌ ధరలు మెట్రో నగరాల్లో 16 నుంచి 17 పైసల చొప్పున పెరుగగా.. డీజిల్‌ ధరలు 10 నుంచి 12 పైసల చొప్పును ఎగిశాయి. దీంతో లీటరు పెట్రోల్‌ ధర ఢిల్లీలో రూ.75.71గా, కోల్‌కతాలో రూ.78.39గా, ముంబైలో రూ.83.10గా, చెన్నైలో రూ.78.57గా ఉన్నాయి. అటు లీటరు డీజిల్‌ ధర ఢిల్లీలో రూ.67.50గా, కోల్‌కతాలో రూ.70.05గా, ముంబైలో రూ.71.62గా, చెన్నైలో రూ.71.24గా నమోదయ్యాయి.   

ప్రభుత్వ రంగ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ఇండియన్‌ ఆయిల్‌, భారత్‌ పెట్రోలియం, హిందూస్తాన్‌ పెట్రోలియం ప్రతి రోజు ఉదయం ఆరు గంటలకు రోజువారీ ఈ ధరల సమీక్ష చేపడుతున్నారు. అన్ని మెట్రో నగరాలతో పోలిస్తే ఢిల్లీలో పెట్రోల్‌ ధరలు తక్కువగా ఉన్నట్టు తెలిసింది. దేశరాజధానిలో విక్రయ పన్ను లేదా వ్యాట్‌ తక్కువగా అమలు చేస్తుండటంతో ఈ ధర ఢిల్లీలో అన్ని నగరాలతో పోలిస్తే తక్కువగా ఉంది. కాగ, గత నెల రోజుల్లో పెట్రోల్‌ ధరలు 22 సార్లు, డీజిల్‌ ధరలు 18 సార్లు తగ్గించారు. మిగతా రోజుల్లో స్తబ్ధుగా ఉన్నాయి. తాజాగా అంతర్జాతీయంగా వీస్తున్న ఆందోళనకర పరిస్థితులతో దేశీయంగా కూడా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మళ్లీ పెరగడం ప్రారంభమైనట్టు తెలిసింది.  

మరిన్ని వార్తలు