ఏడాది గరిష్టానికి పెట్రోల్‌ ధరలు

25 Nov, 2019 14:20 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: పెట్రోల్ ధరల దూకుడు ఇప్పట్లో ఆగేలా లేదు. వరుసగా నాలుగో రోజు పెట్రోల్‌ ధరలు పెరిగాయి. పైసా.. పైసా పెరుగుతూ రూపాయలకు చేరి వినియోగదారులకు షాక్‌ ఇస్తున్నాయి. ఢిల్లీ, కోల్‌కతా, ముంబైలలో సోమవారం పెట్రోల్‌ ధర లీటర్‌కు 12 పైసలు పెరిగింది. చెన్నైలో 13 పైసలు ఎగిసింది. డీజిల్‌ ధరలో ఎటువంటి మార్పు లేదు. గత నాలుగు రోజుల్లో ఢిల్లీలో పెట్రోల్‌ ధర 46 పైసలు హెచ్చింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో ప్రభుత్వ రంగ ఆయిల్‌ కంపెనీలు ధరలు పెంచాయి.

తాజా పెరుగుదలతో పెట్రోల్‌ ధర ఏడాది గరిష్టానికి చేరుకుంది. ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 80.32 ఉండగా, ఢిల్లీలో రూ.74.66గా ఉంది. డీజిల్‌ ధరలు ఢిల్లీలో రూ. 65.73, కోల్‌కతాలో రూ. 68.14, ముంబైలో రూ. 68.94, చెన్నైలో రూ. 69.47గా ఉన్నాయి. పెట్రోల్ ధరలు రోజురోజుకు పెరుగుతుండటంతో వినియోగదారులపై అదనపు భారం పడుతోంది. ముఖ్యంగా తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుండటంతో ఉద్యోగులు, విద్యార్థులు, బయట పనులకు వెళ్లేవారు సొంత వాహనాలు ఎక్కువగా వాడుతున్నారు. ఆర్టీసీ సమ్మెకు తోడు, పెట్రోల్‌ ధరలు పెరగడంతో సామాన్యులు మరింత భారం మోయాల్సి వస్తోంది.

>
మరిన్ని వార్తలు