పెట్రో వాత : అక్కడ పెట్రోలు ధర రూ. 2 పెంపు

6 May, 2020 15:06 IST|Sakshi

ఇంధన ధరలను పెంచేసిన మరో రెండు రాష్ట్రాలు

పంజాబ్, యూపీలో పెట్రో భారం

సాక్షి,ముంబై : కరోనా వైరస్ , లాక్  డౌన్ సంక్షోభంతో అంతర్జాతీయ చమురు ధరలు దిగి వస్తోంటే.. మరోవైపు దేశంలోని పలు రాష్ట్రాలు  పెట్రో వాతకు సిద్ధమవుతున్నాయి. ఈ కోవలో ఇప్పటికే వ్యాట్ పెంపుతో  ఢిల్లీ పెట్రోలు, డీజిల్ ధరలను భారీగా  పెంచి వాహనదారులకు షాకిచ్చింది. తాజాగా ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలు  ఇంధన ధరలను పెంచేశాయి.  (పెట్రోపై పన్ను బాదుడు)

పంజాబ్ ప్రభుత్వ వ్యాట్ పెంపు నిర్ణయంతో పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలు రూ .2 చొప్పున పెరుగనున్నాయి. డీజిల్‌పై విలువ ఆధారిత పన్ను (వ్యాట్)  11.80 శాతం నుంచి 15.15 శాతానికి, పెట్రోల్‌ పై 20.11 శాతం నుంచి 23.30 శాతానికి పెంచినట్లు పంజాబ్ అధికారి తెలిపారు. ఈ అర్థరాత్రి నుంచి సవరించిన ధరలు అమల్లోకి వస్తాయి. పెట్రోల్ రిటైల్ రేటు లీటరుకు రూ .70.38 నుండి 72.43 కు పెరుగుతుంది, డీజిల్ రేటు లీటరుకు 62.02 నుండి 64.06 రూపాయలకు పెరగనుంది. మరోవైపు ఈ నిర్ణయంపై  పంజాబ్ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. పెట్రోలియం డీలర్ల ప్రయోజనాలకు వ్యతిరేకంగా తీసుకున్న ఈ నిర్ణయం  ఇంధన అక్రమ రవాణాను ప్రోత్సహిస్తుందని అసోసియేషన్ ప్రతినిధి అశ్విందర్ మొంగియా  ఆరోపించారు.

వ్యాట్ పెరిగిన తరువాత, చండీగడ్ తో పోలిస్తే పంజాబ్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు వరుసగా రూ.6.61, రూ .4.86 ఎక్కువ పెరగనున్నాయి. చండీగఢ్ లో ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రూ.65.82,  రూ .59.30 గా ఉన్నాయి. లక్నోలో ప్రస్తుత  ధర పెట్రోలు లీటరుకు రూ. 71.92 గాను, డీజిల్ ధర  రూ. 62.87 గా  వుంది. 

ఇక ఉత్తరప్రదేశ్ లో కూడా పెట్రోలు ధరలు మోత మోగనున్నాయి. పెట్రోలు ధర రూ. 2 లు, డీజిల్ పై రూ .1 చొప్పున పెరగనుంది. వ్యాట్ పెంపుతో సవరించిన ధరలు ఈ రోజు (బుధవారం) అర్ధరాత్రి నుండి వర్తిస్తాయని ఉత్తరప్రదేశ్‌ ఆర్థిక మంత్రి సురేష్ ఖన్నా వెల్లడించారు. (హెచ్1బీ ఉద్యోగుల వేతనాలపై షాకింగ్ రిపోర్టు )

>
మరిన్ని వార్తలు