పీఎఫ్‌ రేటు 8.55 శాతానికి తగ్గింపు 

22 Feb, 2018 00:38 IST|Sakshi
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ

న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్‌వో 2017–18 ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్‌పై వడ్డీ రేటును 8.65 శాతం నుంచి 8.55 శాతానికి తగ్గించింది. దీంతో రూ. 586 కోట్ల మేర మిగులు నమోదు కానుందని ఈపీఎఫ్‌వో ట్రస్టీల సమావేశం అనంతరం కేంద్ర కార్మిక మంత్రి సంతోష్‌ కుమార్‌ గంగ్వార్‌ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం 8.65 శాతం వడ్డీ రేటునివ్వడంతో.. రూ. 695 కోట్లు మిగులు నమోదైనట్లు వివరించారు. దాదాపు 6 కోట్ల చందాదారులపై ఇది ప్రభావం చూపనుంది. తాజా నిర్ణయానికి కార్మిక సంఘాలు సైతం అంగీకరించగలవని గంగ్వార్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు ఉమంగ్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా ఈపీఎఫ్‌వో యూఏఎన్‌కి ఆధార్‌ను అనుసంధానం చేసుకునే సదుపాయాన్ని మంత్రి ఆవిష్కరించారు.

అడ్మినిస్ట్రేటివ్‌ చార్జీలను 0.65 శాతం నుంచి 0.50 శాతానికి తగ్గించాలని సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ (సీబీటీ) నిర్ణయించినట్లు గంగ్వార్‌ వివరించారు. అటు, ఇకపై పది మంది ఉద్యోగులున్న సంస్థలు కూడా ఈపీఎఫ్‌వో స్కీములో భాగమయ్యేలా చేయాలని సీబీటీ నిర్ణయించింది. ప్రస్తుతం ఈ నిబంధన 20 మంది పైగా ఉద్యోగులన్న సంస్థలకే వర్తిస్తోంది. తాజా నిర్ణయంతో ఈపీఎఫ్‌వో చందాదారుల సంఖ్య ప్రస్తుతమున్న 6 కోట్ల నుంచి దాదాపు 9 కోట్ల దాకా పెరగవచ్చని గంగ్వార్‌ పేర్కొన్నారు.   

మరిన్ని వార్తలు