ఫైజర్‌ వ్యాక్సిన్‌?- ఫాంగ్‌ స్టాక్స్‌ రికార్డ్‌

2 Jul, 2020 09:57 IST|Sakshi

సరికొత్త గరిష్టానికి నాస్‌డాక్‌ 

డోజోన్స్‌ డీలా- ఎస్‌అండ్‌పీ అప్‌

మరిన్ని యాపిల్‌ స్టోర్ల మూసివేత

3 శాతం జంప్‌చేసిన ఫైజర్‌ ఇంక్‌

అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌, టెస్లా రికార్డ్స్‌

కోవిడ్‌-19 చికిత్సకు వీలుగా రూపొందిస్తున్న వ్యాక్సిన్‌ అభివృద్ధిలో ముందడుగు వేసినట్లు ఫార్మా దిగ్గజం ఫైజర్‌ ఇంక్‌ వెల్లడించడంతో బుధవారం యూఎస్‌ మార్కెట్లు లాభపడ్డాయి. అయితే డోజోన్స్‌ 78 పాయింట్లు(0.3 శాతం) బలహీనపడి 25,735 వద్ద నిలవగా.. ఎస్‌అండ్‌పీ 16 పాయింట్లు(0.5 శాతం) ఎగసి 3,116 వద్ద ముగిసింది. నాస్‌డాక్‌ మరింత అధికంగా 96 పాయింట్లు(1 శాతం) పురోగమించి 10,155 వద్ద స్థిరపడింది. తద్వారా మరోసారి సరికొత్త గరిష్టాన్ని అందుకుంది. బయోఎన్‌టెక్‌తో సంయుక్తంగా ఫైజర్‌ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌ యాంటీబాడీలను న్యూట్రలైజ్‌ చేస్తున్నట్లు తాజాగా పేర్కొంది. ఆన్‌లైన్‌లో విడుదలైన ఈ ఫలితాలను మెడికల్‌ జర్నల్‌ సమీక్షించవలసి ఉన్నట్లు నిపుణులు తెలియజేశారు. కాగా.. వ్యాక్సిన్‌కు ఔషధ నియంత్రణ సంస్థలు అనుమతిస్తే ఏడాది చివరికల్లా 10 కోట్ల డోసేజీలను రూపొందించగలమని ఫైజర్‌ తెలియజేసింది. ఈ బాటలో 2021 చివరికల్లా 120 కోట్ల డోసేజీలను అందించగమని వివరించింది. ఈ నేపథ్యంలో ఫైజర్‌ ఇంక్‌ షేరు 3.2 శాతం ఎగసింది. 34 డాలర్ల సమీపంలో ముగిసింది. 

ఫేస్‌బుక్‌ అప్‌
ఇటీవల ఫ్లోరిడా, మిసిసిపి, టెక్సాస్‌ తదితర రాష్ట్రాలలో 60వరకూ స్టోర్లను మూసివేసిన ఐఫోన్ల దిగ్గజం యాపిల్‌ ఇంక్‌ తాజాగా మరో రెండు డజన్ల స్టోర్లను తాత్కాలికంగా క్లోజ్‌ చేయనున్నట్లు వెల్లడించింది. కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా కాలిఫోర్నియా, అలబామా, జార్జియా, లూసియానా, ఒక్లహామా తదితర రాష్ట్రాలలో వీటిని మూసివేస్తున్నట్లు తెలియజేసింది. ఫలితంగా మూత పడనున్న స్టోర్ల సంఖ్య 77కు చేరనున్నట్లు తెలుస్తోంది. అయితే యాపిల్‌ షేరు స్వల్పంగా 0.2 శాతం నీరసించి 364 డాలర్ల వద్ద నిలిచింది. కాగా..ఇతర ఫాంగ్‌(FAANG) స్టాక్స్‌లో ఫేస్‌బుక్‌ 4.6 శాతం, అమెజాన్‌ 4.4 శాతం, నెట్‌ఫ్లిక్స్‌ 6.7 శాతం చొప్పున జంప్‌చేయడంతో నాస్‌డాక్‌కు బలమొచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. అమెజాన్‌ 2879 డాలర్లకు, నెట్‌ఫ్లిక్స్‌ 486 డాలర్లకు చేరడం ద్వారా సరికొత్త గరిష్టాల వద్ద ముగిశాయి. ఇక ఆటో దిగ్గజం టెస్లా సైతం 3.7 శాతం పెరిగి 1120 డాలర్లకు చేరడం ద్వారా రికార్డ్‌ గరిష్టం వద్ద స్థిరపడింది. కొద్ది రోజులుగా పలు రాష్ట్రాలలో కోవిడ్‌-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అంతర్గతంగా ఇన్వెస్టర్లలో ఆందోళనలు కొనసాగుతున్నట్లు నిపుణులు తెలియజేశారు. దీంతో బుధవారం మార్కెట్లు ఆటుపోట్లు ఎదుర్కొన్నట్లు తెలియజేశారు.

మరిన్ని వార్తలు