వ్యాక్సిన్‌ తయారీలో దేశీ కంపెనీల స్పీడ్‌

20 Jul, 2020 10:40 IST|Sakshi

రేసులో 7 ఫార్మా, బయోటెక్‌ దిగ్గజాలు

విదేశీ కంపెనీలతో ఒప్పందాలు

క్లినికల్ పరీక్షలలో పలు వ్యాక్సిన్లు

జాబితాలో జైడస్‌ కేడిలా, భారత్‌ బయోటెక్‌

సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌, పనాసియా బయోటెక్‌

ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలనూ కబళిస్తున్న కరోనా వైరస్‌ కట్టడికి దేశీ ఫార్మా కంపెనీలు వేగంగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే పలు విదేశీ దిగ్గజాలు వ్యాక్సిన్లను రూపొందిస్తుండగా.. దేశీ కంపెనీలు సైతం ఈ రేసులో భాగం పంచుకుంటున్నాయి. గ్లోబల్‌ దిగ్గజాలతో ఒప్పందాల ద్వారా వ్యాక్సిన్ల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించేందుకు తమవంతు సహకారాన్ని అందిస్తున్నాయి. తద్వారా వేగంగా వ్యాక్సిన్లను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నాయి. అంతేకాకుండా వ్యాక్సిన్లను భారీ స్థాయిలో అందించేందుకు సైతం సన్నాహాలు చేస్తున్నాయి. ఈ అంశాలపై ఫార్మా వర్గాల విశ్లేషణ చూద్దాం..

నిజానికి వ్యాక్సిన్ల తయారీ ఏళ్ల తరబడి సాగుతుందని ఫార్మా నిపుణులు చెబుతున్నారు. అయితే అతర్జాతీయ స్థాయిలో లక్షలకొద్దీ జనాభాకు సవాళ్లు విసురుతున్న కోవిడ్‌-19 కట్టడికి వ్యాక్సిన్లను వేగంగా రూపొందించవలసి ఉన్నట్లు తెలియజేశారు. దీంతో అమెరికాసహా పలు దేశాల కంపెనీలు వ్యాక్సిన్లను రూపొందించేందుకు వేగవంత అనుమతులు పొందుతున్నట్లు తెలియజేశారు. ఈ బాటలో దేశీయంగా భారత్‌ బయోటెక్‌, సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌, జైడస్‌ క్యాడిలా, పనాసియా బయోటెక్‌, ఇండియన్‌ ఇమ్యునలాజికల్స్‌, బయోలాజికల్‌ ఈ తదితర దిగ్గజాలు వ్యాక్సిన్ల అభివృద్ధి, తయారీపై దృష్టిపెట్టినట్లు పేర్కొన్నారు. 

క్లినికల్‌ పరీక్షలు
కోవిడ్‌-19 వ్యాక్సిన్‌పై క్లినికల్‌ పరీక్షల నిర్వహణకు భారత్‌ బయోటెక్‌ ఔషధ నియంత్రణ సంస్థల అనుమతి పొందింది. తద్వారా కోవాగ్జిపై తొలి, రెండో దశల పరీక్షలను చేపడుతోంది. హైదరాబాద్‌ కేంద్రంలో రూపొందించిన ఈ వ్యాక్సిన్‌ పరీక్షలను గత వారమే చేపట్టింది. వ్యాక్సిన్‌ అభివృద్ధికి ఐసీఎంఆర్, ఎన్‌ఐవీలతో జత కట్టిన విషయం విదితమే. ఇదేవిధంగా 2020 చివరికల్లా కోవిడ్‌-19 కట్టడికి వ్యాక్సిన్‌ను తీసుకురాగలమని భావిస్తున్నట్లు సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌ పేర్కొంది. దీనిలో భాగంగా ప్రస్తుతం యూకే కంపెనీ ఆస్ట్రాజెనెకాతో కలసి పనిచేస్తున్నట్లు తెలియజేసింది. ఈ ఔషధంపై మూడో దశ క్లినికల్‌ పరీక్షలు నడుస్తున్నాయని.. తాము సైతం ఆగస్ట్‌లో పరీక్షలను చేపట్టనున్నామని తెలియజేసింది. వెరసి ఏడాది చివరిలోగా ఆస్ట్రాజెనెకా ఆక్స్‌ఫర్డ్‌ నుంచి వ్యాక్సిన్‌ లభించగలదని భావిస్తున్నట్లు పేర్కొంది. మరోవైపు యూఎస్‌ కంపెనీ కోడాజెనిక్స్‌, ఆస్ట్రియా కంపెనీ థెమిస్‌కు సైతం వ్యాక్సిన్‌ అభివృద్ధిలో సహకారమందిస్తున్నట్లు వెల్లడించింది. 

7 నెలల్లో
కోవిడ్‌-19 కట్టడికి రూపొందిస్తున్న జైకోవిడ్‌ వ్యాక్సిన్‌పై ఏడు నెలల్లోగా క్లినికల్‌ పరీక్షలను పూర్తిచేయగలమని ఆశిస్తున్నట్లు జైడస్‌ క్యాడిలా తెలియజేసింది. గత వారమే హ్యూమన్‌ ట్రయల్స్‌ను ప్రారంభించినట్లు తెలియజేసింది. పరీక్షలు విజయవంతమైతే జనవరికల్లా వ్యాక్సిన్‌ను తీసుకువచ్చేందుకు వీలుంటుందని అభిప్రాయపడింది. ఇక కరోనా వైరస్‌కు చెక్‌పెట్టేందుకు యూఎస్‌ సంస్థ రెఫనా ఇంక్‌తో భాగస్వామ్యంలో ఐర్లాండ్‌లో సంయుక్త సంస్థలను నెలకొల్పుతున్నట్లు జూన్‌లోనే పనాసియా బయోటెక్‌ పేర్కొంది. తద్వారా 50 కోట్ల డోసేజీలను తయారు చేసే సన్నాహాల్లో ఉన్నట్లు వెల్లడించింది. వచ్చే ఏడాది మొదట్లో 4 కోట్ల డోసేజీలను అందించగలమని తెలియజేసింది. ఇదే విధంగా వ్యాక్సిన్‌ అభివృద్ధికి ఆస్ట్రేలియా గ్రిఫిత్‌ యూనివర్శిటీతో చేతులు కలిపినట్లు ఇండియన్‌ ఇమ్యునలాజికల్స్‌ ఇప్పటికే పేర్కొంది. ఈ బాటలో మిన్‌వ్యాక్స్‌, బయోలాజికల్‌ ఈ తదితర కంపెనీలు సైతం వ్యాక్సిన్‌ను రూపొందించడంపై దృష్టిపెట్టాయి. 

పరీక్షలు ఇలా
ఫార్మా వర్గాల వివరాల ప్రకారం.. వ్యాక్సిన్లను అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా తొలుత జంతువులపై పరీక్షలను నిర్వహిస్తారు. తదుపరి దశలో మనుషులపైనా ప్రయోగాత్మకంగా వ్యాక్సిన్‌ పనితీరును పరిశీలిస్తారు. తొలి దశ క్లినికల్‌ పరీక్షలలో కొద్దిమందిపై వ్యాక్సిన్‌ ప్రభావాన్ని పరిశీలిస్తారు. తదుపరి మరింత మందిపైనా.. ఇవి విజయవంతమైతే వేలమందిపైనా పరీక్షలు నిర్వహిస్తారు. వ్యాధి నిరోధక శక్తి పెంపు, భద్రత తదితర పలు అంశాలను క్లినికల్‌ ప్రయోగాలలో నమోదు చేస్తారు. తద్వారా నాలుగు దశలలో క్లినికల్ పరీక్షలను పూర్తి చేస్తారు. ఆపై వీటిని క్షుణ్ణంగా విశ్లేషిస్తారు.  

మరిన్ని వార్తలు