అంచనాలు తప్పిన ఔషధ ఎగుమతులు

9 May, 2020 02:45 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశీయ ఔషధ రంగానికి కోవిడ్‌–19 దెబ్బ పడింది. ఎగుమతుల అంచనా తప్పింది. 2019–20లో భారత్‌ నుంచి రూ.1,65,000 కోట్ల విలువైన ఔషధ ఉత్పత్తులు ఎగుమతి అవుతాయని ఫార్మాస్యూటికల్స్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ (ఫార్మెక్సిల్‌) గతంలో అంచనా వేసింది. వాస్తవానికి రూ.1,54,350 కోట్ల విలువైన మందులు ఎగుమతి అయ్యాయి. అయితే 2018–19తో పోలిస్తే ఇది 7.57 శాతం వృద్ధి అని ఫార్మెక్సిల్‌ డైరెక్టర్‌ జనరల్‌ రవి ఉదయ్‌ భాస్కర్‌ తెలిపారు.

ఏప్రిల్‌–డిసెంబర్‌లో ఎగుమతుల వృద్ధి 11.5 శాతంగా ఉందని చెప్పారు. జనవరి–మార్చిలో 2.97 శాతం తిరోగమన వృద్ధి నమోదైంది. మొత్తం ఎగుమతుల్లో 72 శాతంగా ఉన్న డ్రగ్‌ ఫార్ములేషన్స్, బయలాజికల్స్‌ 9.5 శాతం వృద్ధి సాధించాయి. రెండవ అతిపెద్ద విభాగమైన బల్క్‌ డ్రగ్స్, డ్రగ్‌ ఇంటర్మీడియేట్స్‌ 0.73 శాతం తిరోగమన బాట పట్టాయి. 32.74 శాతం వాటా దక్కించుకున్న యూఎస్‌ఏకు ఎగుమతులు 15.8 శాతం అధికమై రూ.50,250 కోట్లకు చేరుకున్నాయి.   

>
మరిన్ని వార్తలు