లాభాల్లో ఫార్మా షేర్లు - నష్టాల్లో మార్కెట్‌

10 Jul, 2020 12:16 IST|Sakshi

ఫార్మా షేర్లకు కలిసొచ్చిన రూపాయి బలహీనత

మార్కెట్‌ను దెబ్బతీసిన మెటల్‌, బ్యాంకింగ్‌ షేర్ల పతనం

మార్కెట్‌ నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నప్పటికీ.., శుక్రవారం ఉదయం సెషన్‌లో​ఫార్మా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో ఫార్మా రంగానికి ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పార్మా ఇండెక్స్‌ దాదాపు 2శాతం లాభపడింది. డాలర్‌ మారకంలో రూపాయి బలహీనత ఫార్మా షేర్లకు కలిసొస్తుంది. మనదేశంలో తయారయ్యే ఔషధాలు అధిక స్థాయిలో విదేశాలకు ఎగుమతి అవుతుంటాయి. రూపాయి బలహీనతతో విదేశీ ఎగుమతులు మరింత పెరగవచ్చనే ఆశవాహ అంచనాలు ఫార్మా షేర్లను నడిపిస్తున్నాయి. మరోవైపు కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ది చేయడంలో, వేగంగా తయారీని పెంచడంలో భారత్‌ కచ్చితంగా కీలకపాత్ర పోషిస్తుందని ప్రధాని మోదీ ప్రకటన ఫార్మా షేర్లకు కలిసొచ్చింది. 

ఉదయం గం.11:30ని.లకు ఫార్మా ఇండెక్స్‌ మునుపటి ముగింపు(9,987.55)తో పోలిస్తే 1శాతానికి పైగా లాభంతో 10100 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఫార్మా షేర్లైన సన్‌ఫార్మా 3శాతం, బయోకాన్‌ 2.50శాతం, టోరెంటో ఫార్మా 1.50శాతం, అరబిందో ఫార్మా, దివీస్‌ ల్యాబ్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ షేర్లు 1శాతం పెరిగాయి. సిప్లా, కేడిల్లా హెల్త్‌కేర్‌, ఆల్కేమ్‌ షేర్లు అరశాతం నుంచి 0.10శాతం పెరిగాయి. ఒక్క లుపిన్‌ షేరు మాత్రం స్వల్పంగా 0.10శాతం నష్టాన్ని చవిచూసింది.

నష్టాల్లో మార్కెట్‌:
మిడ్‌సెషన్‌ సమయానికి మార్కెట్‌ నష్టాల్లో కదలాడుతోంది. మెటల్‌, బ్యాంకింగ్‌ రంగ షేర్లలో అమ్మకాలతో సూచీల నష్టాలను మూటగట్టుకున్నాయి. మధ్యాహ్నం 12గంటలకు సెన్సెక్స్‌ 250 పాయింట్లను కోల్పోయి 36,494 వద్ద, నిఫ్టీ 76 పాయింట్లను నష్టపోయి 10,737 వద్ద కదులుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్‌ నేడు నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు