రూ.300 కోట్లతో బీఈ కొత్త ప్లాంటు

18 Feb, 2020 07:49 IST|Sakshi
బీఈ కొత్త ప్లాంటు ప్రారంభోత్సవంలో కేటీఆర్‌ తదితరులు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఔషధ రంగ సంస్థ బయాలాజికల్‌–ఇ (బీఈ) లిమిటెడ్‌ హైదరాబాద్‌ సమీపంలోని శామీర్‌పేట వద్ద ఉన్న జీనోమ్‌ వ్యాలీ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌లో కొత్త ప్లాంటును ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కె.తారక రామారావు ఈ కేంద్రాన్ని సోమవారమిక్కడ ప్రారంభించారు. ఈ సందర్భంగా కంపెనీ రూపొందించిన టైఫాయిడ్‌ కాంజుగేట్‌ వ్యాక్సిన్‌ను ఆయన ఆవిష్కరించారు. 2017 బయో ఆసియా కార్యక్రమం సందర్భంగా ఈ ప్లాంటుకు పునాది రాయి వేశామని.. 2020 బయో ఆసియాలో ప్రారంభోత్సవం జరిగిందని కేటీఆర్‌ గుర్తు చేశారు. కాగా, 29 ఎకరాల విస్తీర్ణంలోని ఈ తయారీ కేంద్రానికి బీఈ సుమారు రూ.300 కోట్లు వెచ్చిం చింది. కొత్త ఫెసిలిటీ ద్వారా 1,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని సంస్థ ఎండీ మహిమ దాట్ల వెల్లడించారు. టైఫాయిడ్‌ కాంజుగేట్‌ వ్యాక్సిన్‌ను ఇటలీకి చెందిన జీఎస్‌కే వ్యాక్సిన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ భాగస్వామ్యంతో అభివృద్ధి చేశామన్నారు. కార్యక్రమంలో బయోకాన్‌ సీఎండీ కిరణ్‌ మజుందార్‌ షా, తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌ పాల్గొన్నారు.

సింజీన్‌ ఆర్‌అండ్‌డీ కూడా..
కాంట్రాక్ట్‌ రీసెర్చ్‌ సేవల్లో ఉన్న సింజీన్‌ ఇంటర్నేషనల్‌ జీనోమ్‌ వ్యాలీలో ఏర్పాటు చేసిన కొత్త పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని కూడా కేటీఆర్‌ ప్రారంభించారు. తొలి దశలో 52,000 చదరపు అడుగుల విస్తీర్ణం అందుబాటులోకి వచ్చింది. 2020 చివరికల్లా 94,000 చ.అ. విస్తీర్ణంలో సిద్ధం కానున్న ఈ సెంటర్‌కు రూ.167 కోట్లు వెచ్చిస్తున్నట్టు సింజీన్‌ సీఈవో జోనాథన్‌ హంట్‌ వెల్లడించారు. సైంటిస్టుల సంఖ్య ప్రస్తుతమున్న 150 నుంచి 270కి చేరనుంది.

>
మరిన్ని వార్తలు