దివ్యాంగుల కోసం ఫోన్లు!!

10 Jul, 2018 00:45 IST|Sakshi

వారికి టెక్నాలజీ ప్రయోజనాలను అందించేందుకు ట్రాయ్‌ సిఫార్సులు

న్యూఢిల్లీ: సాంకేతికత ప్రయోజనాలను దేశ ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావాలని  టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ భావిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా కేంద్ర ప్రభుత్వానికి పలు సిఫార్సులు చేసింది. కేంద్రం వీటికి ఆమోదం తెలిపితే దివ్యాంగులు సహా సమాజంలోని ప్రతి ఒక్కరికి సాంకేతికత ఫలాలు అందుతాయి.కాగా టెలికం, బ్రాండ్‌బాండ్‌ సేవల వినియోగంలో దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించేందుకు ట్రాయ్‌ గతేడాది డిసెంబర్‌ నుంచే పరిశ్రమతో చర్చలు ప్రారంభించింది. సిఫార్సులను పరిశీలిస్తే..  

ఐదు లేదా అంతకన్నా ఎక్కువ మోడళ్లను తయారుచేసే మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ కంపెనీలన్నీ 2020 నాటికి దివ్యాంగులు సైతం  సులువుగా వాడగలిగేలా కనీసం ఒక్క హ్యాండ్‌సెట్‌నైనా మార్కెట్‌లోకి తీసుకురావాలి.  
   ఇదే సయమంలో టీవీ సెట్‌–టాప్‌ బాక్స్‌ తయారీదారులు లేదా దిగుమతిదారులు కూడా యాక్సెసబిలిటీ ప్రమాణాలకు అనువుగా కనీసం ఒక మోడల్‌నైనా కలిగి ఉండాలి.  
    2023 నుంచి భారత్‌లో తయారయ్యే లేదా దిగుమతయ్యే మొబైల్‌ ఫోన్లు, ల్యాండ్‌లైన్‌ హ్యాండ్‌సెట్స్‌ అన్నీ యాక్సెసబుల్‌ ఫార్మాట్‌లోనే ఉండాలి. సెట్‌–టాప్‌ బాక్స్‌లకు కూడా ఇదే నిబంధన వర్తిస్తుంది.  
   టెలికం, బ్రాండ్‌కాస్ట్‌ ఆపరేటర్లు వారి కాల్‌ సెంటర్లలో దివ్యాంగుల కాల్స్‌ను హ్యాండిల్‌ చేసేందుకు ప్రత్యేకమైన డెస్క్‌లను కలిగి ఉండాలి.  
   ప్రభుత్వ వెబ్‌సైట్లన్నీ యాక్సెసబిలిటీ ప్రమాణాలకు అనువుగా మారాలి.
    ఇంటర్నేషనల్‌ టెలీ కమ్యూనికేషన్‌ యూనియన్‌ రూపొందించిన ప్రమాణాలన్నీ భారత్‌లో కూడా అందుబాటులోకి రావాలి.
   ప్రముఖ ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌లోని యాక్సెసబిలిటీ ఫీచర్లను తొలగించకుండా హ్యాండ్‌సెట్స్‌ తయారీదారులను ప్రభుత్వం ఆదేశించాలి.  
  టెలికం ఆపరేటర్లు దివ్యాంగులను ప్రత్యేక కేటగిరి కింద గుర్తించి, కస్టమర్‌ అక్వైజిషన్‌ ఫామ్‌లలో అవసరమైన మార్పులు తీసుకురావాలి.
 మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌లో కీలకమైన వాటికోసం ప్రి–రికార్డెడ్‌ వాయిస్‌ కమాండ్‌ సౌకర్యం, మెరుగైన స్థిరత్వం కోసం గ్రిప్స్, వాయిస్‌ డైలింగ్‌/థర్డ్‌ పార్టీ యాప్స్‌ ద్వారా యూజర్‌ ఇంటర్‌ఫేస్‌తో ఆడియో లేదా వాయిస్‌ ఇన్‌టరాక్షన్‌ వంటివి ఉండాలి. ల్యాండ్‌లైన్‌ విషయానికి వస్తే.. పెద్ద బటన్‌ ఉన్న ఫోన్స్, వాయిస్‌ కంట్రోల్డ్‌ కాలింగ్, ప్రోగ్రామబుల్‌ డైలర్, బ్రెయిలీ రీడర్‌తో కనెక్ట్‌ వంటివి సౌకర్యాలుండాలి.  

మరిన్ని వార్తలు