రిలయన్స్‌ నిధుల మళ్లింపుపై పిల్‌

4 Jul, 2018 00:20 IST|Sakshi

స్పందించిన హైకోర్టు

కేంద్రం, సెబీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లకు నోటీసులు

కౌంటర్ల దాఖలుకు ఆదేశం

విచారణ 24కి వాయిదా

సాక్షి, హైదరాబాద్‌: డమ్మీ కంపెనీలను ఏర్పాటు చేసి నిధులను మళ్లించిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌పై చర్యలు తీసుకోవడం లేదని, దీనిపై సమాచార హక్కు చట్టం కింద సమాచారం కోరినా అధికారులు ఇవ్వడం లేదంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలంటూ కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి, సెబీ చైర్మన్, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) చైర్మన్, ఎండీలకు నోటీసులు జారీ చేసింది.

పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని వీరిని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 24కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. వేల కోట్ల రూపాయలను డమ్మీ కంపెనీల ద్వారా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ దారి మళ్లించిందని, దీని వల్ల వాటాదారులకు రూ.27వేల కోట్ల మేర నష్టం వాటిల్లిందని, ఫిర్యాదు చేసినా కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదంటూ ప్రకాశం జిల్లాకు చెందిన టి.గంగాధర్‌ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు.

ఈ వ్యాజ్యంపై మంగళవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్‌ తరఫు న్యాయవాది ఎం.శ్రీకాంత్‌ వాదనలు వినిపిస్తూ, ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలను సమాచార హక్కు చట్టం కింద కోరితే కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ ఇవ్వడం లేదన్నారు. సంబంధిత ఫైల్‌ కనిపించడం లేదని చెబుతున్నారని ఆయన కోర్టుకు నివేదించారు.

ఈ సమయంలో ప్రతివాదుల తరఫు న్యాయవాదుల్లో ఒకరు స్పందిస్తూ, కోరిన సమాచారం ఇవ్వకపోతే అప్పీల్‌ దాఖలు చేసుకునే ప్రత్యామ్నాయం ఉందని, దానిని వినియోగించుకోకుండా ఈ వ్యాజ్యం దాఖలు చేయడం సరికాదన్నారు. దీనిపై ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. సమాచారం ఇవ్వనప్పుడు దానిని ప్రశ్నిస్తూ అధికరణ 226 కింద హైకోర్టును ఆశ్రయించవచ్చునంది. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలను తమ ముందుంచాలంటూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 24కి వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు