స్విస్‌ బ్యాంకుల్లో మనోళ్ల డిపాజిట్లు తగ్గాయి

24 Jul, 2018 16:46 IST|Sakshi
కేంద్ర ఆర్ధిక మంత్రి పీయూష్‌ గోయల్‌ (ఫైల్‌ ఫోటో)

2017లో పెరిగాయన్నగణాంకాలు తప్పు

పార్లమెంటుకు కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్‌ గోయల్‌ వెల్లడి

న్యూఢిల్లీ: స్విస్‌ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు 2017లో పెరగలేదు. సరికదా 34.5 శాతంమేర పడిపోయాయి. 2014లో నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత  స్విస్‌ బ్యాంకుల్లో డబ్బు 80 శాతం తగ్గినట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ స్వయంగా మంగళవారం పార్లమెంటుకు లిఖిత పూర్వక సమాధానం రూపంలో తెలిపారు. సెంట్రల్‌ బ్యాంకుల అంతర్జాతీయ సంస్థ– బ్యాంక్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ సెటిల్‌మెంట్స్‌ (బీఐఎస్‌) గణాంకాలను ఉటంకిస్తూ మంత్రి ఈ సమాధానం ఇచ్చారు.

స్విస్‌ బ్యాంకుల్లో మూడు సంవత్సరాల నుంచి తగ్గుతూ వచ్చిన భారతీయుల డిపాజిట్లు 2017లో 50 శాతం పెరిగి 1.01 బిలియన్‌ స్విస్‌ ఫ్రాంక్‌ (రూ.7,000 కోట్లు)లుగా ఉన్నాయని స్విస్‌ నేషనల్‌ బ్యాంకు ఇటీవలే ప్రకటించింది. ఈ వార్తలను మంత్రి గోయల్‌ ప్రస్తావిస్తూ, ఇవి తప్పని స్విస్‌ అధికారులే పేర్కొన్నారని తెలిపారు. స్విస్‌ డిపాజిట్లకు బీఐఎస్‌ గణాంకాలే తగిన ఆధారమని ఆయన వివరించారు.  

భారతీయుల డిపాజిట్ల మొత్తం అది: ఎస్‌ఎన్‌బీ
అయితే, తాము ఇటీవల వెల్లడించిన భారతీయుల డిపాజిట్ల గణాంకాలు నిజమేనని స్విస్‌ నేషనల్‌ బ్యాంకు తాజాగా స్పష్టం చేసింది. ఈ గణాంకాలు భారతీయ కస్టమర్లు, బ్యాంకులు, సంస్థలకు సంబంధించిన మొత్తమని తెలిపింది. భారత్‌లోని స్విస్‌ బ్యాంకు శాఖల్లోని డిపాజిట్లను కూడా కలిపి చెప్పామని వివరించింది.

ఈ నేపథ్యంలో బీఐఎస్‌ గణాంకాలు మరితం ఆధారపడతగినవిగా పేర్కొంది. స్విట్జర్లాండ్‌కు చెందిన క్రెడిట్‌సూసే ప్రస్తుతం మన దేశంలో ఒక బ్యాంకు శాఖను కలిగి ఉంది. అలాగే, ఆ దేశానికి చెందిన యూబీఎస్, జుర్చెర్‌ కంటోనల్‌ బ్యాంకు మాత్రం రిప్రజెంటేటివ్‌ కార్యాలయాన్ని కలిగి ఉన్నాయి. 

మరిన్ని వార్తలు