ఆ నిర్ణయంతో 3 లక్షల ఉద్యోగాలు మాయం

24 Jun, 2018 19:15 IST|Sakshi

సాక్షి, ముంబై : ప్లాస్టిక్‌ను నిషేధిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై ప్లాస్టిక్‌ పరిశ్రమ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో రాత్రికి రాత్రి 3 లక్షల మంది ఉద్యోగులు వీధినపడ్డారని, రూ 15,000 కోట్ల ఆదాయ నష్టం వాటిల్లుతుందని పేర్కొంది. ప్లాస్టిక్‌ను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఉత్పత్తిదారులు తమ యూనిట్లను మూసివేశారని ప్లాస్టిక్‌ బ్యాగ్స్‌ తయారీదారుల సంఘం ప్రధాన కార్యదర్శి నీమిత్‌ పునామియా చెప్పారు.

ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయంతో ఈ రంగంపై ఆధారపడి జీవించే వారి పరిస్థితి దయనీయంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్లాస్టిక్‌ బ్యాగులు, స్పూన్‌లు, ప్లేట్లు, పెట్‌ బాటిల్స్‌, థర్మాకోల్‌ ఐటెమ్స్‌ సహా ప్లాస్టిక్‌ ఉత్పత్తుల తయారీ, వాడకం, అమ్మకం, సరఫఱా, నిల్వ చేయడాన్ని నిషేధిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం మార్చి 23న ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటివరకూ ఉన్న నిల్వలను విక్రయించేందుకు ఇచ్చిన మూడు నెలల గడువు ఈనెల 23తో ముగిసింది. ఇక ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యోగాలు తగ్గిపోవడం రాష్ట్ర జీడీపీపై ప్రభావం చూపుతుందని, ప్లాస్టిక్‌ రంగం నుంచి బ్యాంకులకు రుణ బకాయిలు పేరుకుపోతాయని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.

మరిన్ని వార్తలు