ప్లాస్టిక్‌ కుర్చీ లగ్జరీ వస్తువా..?

8 Jun, 2017 00:52 IST|Sakshi
ప్లాస్టిక్‌ కుర్చీ లగ్జరీ వస్తువా..?

28 శాతం స్లాబ్‌లోకి ఎలా చేరుస్తారు
చిన్న కంపెనీలు మూతపడతాయి
మౌల్డెడ్‌ ఫర్నిచర్‌ తయారీదార్ల సంఘం


హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: లగ్జరీ వస్తువుల జాబితాలోకి ప్లాస్టిక్‌ కుర్చీలను చేర్చడాన్ని ప్లాస్టిక్‌ మౌల్డెడ్‌ ఫర్నిచర్‌ తయారీదారుల సంఘం తప్పుపట్టింది. జీఎస్టీ కౌన్సిల్‌ ప్లాస్టిక్‌ కుర్చీలపై 28 శాతం పన్ను రేటు నిర్ణయించింది. వీటిని హౌస్‌హోల్డ్‌ వస్తువుల జాబితాలోకి చేర్చడం ద్వారా 18 శాతం పన్ను స్లాబులోకి తేవాలని సంఘం డిమాండ్‌ చేస్తోంది. ఇప్పటి వరకు ప్లాస్టిక్‌ మౌల్డెడ్‌ ఫర్నిచర్‌ కంపెనీలు 5 శాతం వ్యాట్, 12.5 శాతం ఎక్సైజ్‌ డ్యూటీని చెల్లించాయి. దేశంలో 60 శాతం చిన్న స్థాయి కంపెనీలే ఉన్నాయి.

ప్లాస్టిక్‌ కుర్చీలపై పన్ను 28 శాతముంటే పరిశ్రమలో ఈ తయారీ కంపెనీలు మనలేవని సంఘం ప్రెసిడెంట్‌ కె.పి.రవీంద్రన్‌ తెలిపారు. ‘పెద్ద బ్రాండ్లు ఎంత ధర పెట్టినా కస్టమర్లు కొంటారు. చిన్న కంపెనీలు స్వల్పంగా ధర సవరించినా కొనేవారుండరు. రీసైక్లింగ్‌ ప్లాస్టిక్‌ తయారీలో ఉన్న యూనిట్లకు ఇప్పటి వరకూ పన్ను మినహాయింపు ఉంది. ఎస్‌ఎస్‌ఐ యూనిట్లకు ఎక్సైజ్‌ డ్యూటీ లేదు. ఇప్పుడు ఇవన్నీ కూడా 28 శాతం పన్ను పరిధిలోకి వచ్చాయి. ఇది భారత పరిశ్రమకు నష్టాన్ని కలిగిస్తుంది’ అని తెలిపారు.

చైనా దిగుమతుల వెల్లువ..: ప్రభుత్వం పన్ను సవరించకపోతే మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమానికి విఘాతం కలుగుతుందని సంఘం కార్యదర్శి సుశీల్‌ అగర్వాల్‌ అన్నారు. సామాన్యులు వాడే ప్లాస్టిక్‌ కుర్చీ లగ్జరీ ఎలా అయిందో అర్థం కావడం లేదన్నారు. ‘భారత కంపెనీ ఒక ఉత్పాదనను రూ.100కు విక్రయిస్తే, అదే ఉత్పాదనను చైనా కంపెనీ రూ.60కే ఇక్కడ ప్రవేశపెడుతుంది. దీంతో చైనా ఉత్పత్తులు వెల్లువలా వచ్చి పడతాయి. ఇక్కడి కంపెనీలు మూతపడక తప్పదు.

మౌల్డెడ్‌ ప్లాస్టిక్‌ తయారీ రంగంలో 200 కంపెనీలున్నాయి. వీటిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందినవి 40 దాకా ఉంటాయి. 20,000 మంది ప్రత్యక్షంగా పనిచేస్తున్నారు. వేల కుటుంబాలు రోడ్డున పడతాయి. పరిశ్రమ పరిమాణం రూ.300 కోట్లు. ఇందులో ప్లాస్టిక్‌ చైర్ల విక్రయాలు 80%. అందుకే జీఎస్టీ ప్రభావం ఎక్కువ’ అని చెప్పారు. ముడి ప్లాస్టిక్‌పై 18% జీఎస్టీ ఉందని సంఘం హైదరాబాద్‌ ప్రెసిడెంట్‌ ఉపేందర్‌ గుప్తా తెలిపారు.

>
మరిన్ని వార్తలు