పారిశ్రామిక దిగ్గజాలతో నేడు ప్రధాని భేటీ

19 Nov, 2018 01:32 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశీయంగా వ్యాపారాల నిర్వహణను సులభతరం చేసేందుకు తీసుకోదగిన మరిన్ని చర్యలపై చర్చించేందుకు పారిశ్రామిక దిగ్గజాలు, విధానకర్తలతో ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం సమావేశం కానున్నారు. టాప్‌ 50 దేశాల జాబితాలోకి చేరేందుకు అవసరమైన చర్యలు చర్చించనున్నారు. పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం దీన్ని నిర్వహిస్తోంది.

ఆనంద్‌ మహీంద్రా వంటి పారిశ్రామిక దిగ్గజాలు, సీఐఐ .. ఫిక్కీ .. అసోచాం వంటి పరిశ్రమల సమాఖ్యల ప్రతినిధులతో పాటు ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ సంస్కరణలను రూపొందించిన సీనియర్‌ ప్రభుత్వ అధికారులు ఇందులో పాల్గోనున్నారు. సులభతరంగా వ్యాపారాల నిర్వహణకు అనువైన పరిస్థితులున్న దేశాలకు సంబంధించి (ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌) అక్టోబర్‌ 31న ప్రపంచ బ్యాంకు ప్రకటించిన జాబితాలో భారత్‌ 23 స్థానాలు ఎగబాకి 77వ ర్యాంకుకి చేరిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు