డిజిటల్ ఇండియా విప్లవభేరి

28 Sep, 2015 02:11 IST|Sakshi
డిజిటల్ ఇండియా విప్లవభేరి

మోగించిన మోదీ!
డేటా భద్రతకు పటిష్టమైన చర్యలు...
టాప్ ఐటీ కంపెనీల సీఈవోలతో ప్రధాని మోదీ
ఎం-గవర్నెన్స్‌తో ప్రజలకు మరింత చేరువ
పేపర్‌లెస్ లావాదేవీలే లక్ష్యం
ప్రజలందరికీ డిజిటల్ లాకర్లు...

 
సాంకేతిక సృజనాత్మకతకు పుట్టినిల్లు.. హైటెక్ పరిజ్ఞానానికి ప్రపంచ కేంద్రం.. డిజిటల్ ప్రపంచానికి రాజధాని అయిన సిలికాన్ వ్యాలీ వాకిట.. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, అడోబ్ చీఫ్ శాంతను నారాయణ్, క్వాల్‌కామ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పాల్ జాకబ్స్ వంటి దిగ్గజాల ముంగిట.. ‘డిజిటల్ ఇండియా’ విప్లవభేరిని ప్రధానమంత్రి నరేంద్రమోదీ మోగించారు. భారతదేశంలో డిజిటల్ విప్లవం తీసుకువచ్చేందుకు తన ప్రణాళికలను ప్రపంచ అగ్రగామి ఐటీ సంస్థల సీఈఓలతో శనివారం రాత్రి విందు భేటీలో బయటపెట్టారు. పేదలు, ప్రభుత్వ పథకాలను అందుకోలేనివారికి చేరువకావడంతో పాటు దేశంలో ప్రజల జీవన గమనాన్ని సమూలంగా మార్చివేసే లక్ష్యంతోనే డిజిటల్ ఇండియాకు అంకురార్పణ చేశామన్నారు. హైవేలతో పాటు ఐ-వేలు కూడా అవసరమంటూ.. భారత్‌లోని 125 కోట్ల మంది ప్రజలను డిజిటల్‌గా అనుసంధానించటం తమ లక్ష్యమని చెప్పారు. పల్లెలను స్మార్ట్ ఎకనమిక్ హబ్‌లుగా మార్చటమే ధ్యేయంగా.. దేశంలోని ఆరు లక్షల గ్రామాలను బ్రాడ్‌బ్యాండ్‌తో అనుసంధానించటాన్ని వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు.
 
 పేపర్ రహిత లావాదేవీలను సాకారం చేయాలన్నదే సంకల్పమంటూ.. పరిపాలనతో ప్రజలను మరింత భాగస్వామ్యం చేసేందుకు ఎం(మొబైల్)-గవర్నెన్స్ తోడ్పడుతుందన్నారు. ఇంకా భారత ప్రభుత్వం చేపడుతున్న మరిన్ని చర్యలను వివరించారు. నరేంద్రమోదీ తలపెట్టిన డిజిటల్ ఇండియా విప్లవానికి తమ సహకారం అందించేందుకు ప్రపంచ టెక్నాలజీ దిగ్గజాలు ముందుకొచ్చాయి. దేశంలో 500 రైల్వే స్టేషన్లలో ఉచితంగా వైఫై సౌకర్యాన్ని అందించేందుకు గూగుల్ సహకారం అందిస్తుందని సుందర్ పిచాయ్ ప్రకటించారు. భారత్‌లోని 5 లక్షల గ్రామాలకు చౌకగా బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యాన్ని కల్పించనున్నట్లు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల చెప్పారు. భారత్‌లో స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించేందుకు క్వాల్‌కామ్ దాదాపు రూ. వేయి కోట్లు మేర నిధులను అందించనున్నట్లు పాల్ జాకబ్స్ ప్రకటించారు. భారత్‌లో తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలన్న మోదీ విజ్ఞప్తికి యాపిల్ సీఈఓ టిమ్ కుక్ సానుకూలంగా స్పందించారు. ప్రధాని మోదీ ఆదివారం ఫేస్‌బుక్, గూగుల్ ప్రధాన కార్యలయాలను సందర్శించి.. సీఈఓలతో పాటు ఇతర ప్రతినిధులతో ముచ్చటించారు.     
 
 ‘డిజిటల్ ఇండియాలో మేం కూడా భాగస్వాములమవుతాం. చౌక బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ, క్లౌడ్ కంప్యూటింగ్ పరిజ్ఞానంతో ప్రభుత్వాలు, ప్రజలు, వ్యాపారాలకు మేలు చేకూరుతుంది. అన్నిస్థాయిల్లో సామర్థ్యం, ఉత్పాదకత, సృజనాత్మకతను పెంపొందించేందుకు తోడ్పడుతుంది.    
 - సత్య నాదెళ్ల, మైక్రోసాఫ్ట్ సీఈఓ  
 
 గుజరాతీ సహా 10 భారతీయ భాషల్లో టైపింగ్‌కు అవకాశం కల్పిస్తాం. వచ్చే నెలలో ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది. డిజిటల్ లిటరసీ (పరిజ్ఞానం)ని అందరికీ అందించాలంటే స్థానిక భాషల్లో టైపింగ్ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే మేం ఈ చర్యలు చేపడుతున్నాం.
 - సుందర్ పిచాయ్ గూగుల్ సీఈఓ
 
అమ్మకు కన్నీటి అభిషేకం
సిలికాన్ వ్యాలీలో ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్‌తో ముఖాముఖి సందర్భంగా.. అమ్మ ప్రస్తావన వచ్చినపుడు భావోద్వేగంతో.. కళ్లలో నీళ్లు ఉబికివస్తుండగా.. ప్రధాని మోదీ చెప్పిన మాటలివి.

శాన్‌జోస్: డిజిటల్ విప్లవం దిశగా భారత్ వడివడిగా అడుగులేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అమెరికా పర్యటలో భాగంగా సిలికాన్‌వ్యాలీలో ప్రపంచ అగ్రగామి ఐటీ కంపెనీల సీఈవోలతో సమావేశం సందర్భంగా తన మానస పుత్రిక అయిన ‘డిజిటల్ ఇండియా’ ప్రణాళికలను వివరించారు. డేటా గోప్యత(ప్రైవసీ), భద్రతకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామని, పాలనలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచడం తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని కూడా ఆయన టెక్ దిగ్గజాలకు హామీనిచ్చారు.

మోదీతో విందు(డిన్నర్) సమావేశంలో పాల్గొన్న వారిలో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, అడోబ్ చీఫ్ శాంతను నారాయణ్, క్వాల్‌కామ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పాల్ జాకబ్స్ తదితరులు ఉన్నారు. ఈ భేటీ సందర్భంగా డిజిటల్ ఇండియాలో భాగంగా చేపట్టబోయే పలు ప్రణాళికలను కూడా మోదీ ప్రకటించారు. ముఖ్యంగా దేశంలో పబ్లిక్ వైఫైను మరింతగా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. త్వరలోనే  500 రైల్వే స్టేషన్లలో వైఫై సౌకర్యాన్ని కల్పించనున్నామని, ఇందుకోసం గూగుల్‌తో జట్టుకట్టామని కూడా వెల్లడించారు.
 
ఐ-వేస్ కూడా అవసరం...
6 లక్షల గ్రామాలను బ్రాడ్‌బ్యాండ్‌తో అనుసంధానించడం కోసం జాతీయ ఫైబర్ ఆప్టిక్ నెట్‌వర్క్ విస్తరణను వేగవంతం చేస్తున్నామని ప్రధాని టెక్ సీఈవోలకు వివరించారు. ‘ఈ-గవర్నెన్స్‌తో మరింత సమర్థవంతమైన పాలన అందించేందుకు వీలవుతోంది. ఇప్పుడు భారత్‌లో 100 కోట్ల మంది మొబైల్ ఫోన్లను వినియోగిస్తున్నారు. పరిపాలనతో ప్రజలను మరింత భాగస్వామ్యం చేసేందుకు, ప్రభుత్వాన్ని వారి చెంతకు చేర్చేందుకు ఎం(మొబైల్)-గవర్నెన్స్ తోడ్పడుతుంది.  

స్కూళ్లు, కాలేజీన్నింటినీ బ్రాండ్‌బ్యాండ్‌తో అనుసంధానిస్తాం. పేవర్ రహిత లావాదేవీలను సాకారం చేయాలన్నదే మా సంకల్పం. దేశంలో ప్రతి ఒక్కరికీ డిజిటల్ లాకర్ సదుపాయాన్ని కల్పించనున్నాం. వ్యక్తిగత డాక్యుమెంట్లను ఇందులో దాచుకోవచ్చు. ఏ ప్రభుత్వ శాఖతో పనిఉన్నా నేరుగా వాటిని పంపడానికి వీలవుతుంది. వ్యాపారవేత్తలకు అనుమతులను వేగంగా ఇచ్చేందుకు ఈ-బిజ్ పోర్టల్‌ను నెల కొల్పాం’ అని మోదీ సీఈఓలకు వివరించారు.

మరిన్ని వార్తలు