భారత్‌... అవకాశాల గని!

26 Sep, 2019 03:29 IST|Sakshi
బ్లూంబర్గ్‌ బిజినెస్‌ ఫోరంలో మైఖేల్‌ బ్లూంబర్గ్‌తో ప్రధాని మోదీ

పెట్టుబడులతో తరలిరండి...

బ్లూంబర్గ్‌ బిజినెస్‌ ఫోరంలో ఇన్వెస్టర్లకు ప్రధాని మోదీ పిలుపు

కార్పొరేట్‌ పన్ను తగ్గించాం.. 

మరిన్ని చర్యలు ఉంటాయని హామీ

న్యూయార్క్‌: అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు భారత్‌ స్వర్గధామంగా ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తమ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు దీర్ఘకాల ప్రయాణంలో కేవలం ఆరంభమేనన్నారు. కార్పొరేట్‌ పన్నును చరిత్రాత్మక స్థాయిలో ప్రభుత్వం తగ్గించిందని, పెట్టుబడులకు ఇదొక బంగారం లాంటి అవకాశమని అభివర్ణించారు. భారత్‌లో వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరిచేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటామని న్యూయార్క్‌లో బుధవారం జరిగిన బ్లూంబర్గ్‌ వ్యాపార సదస్సులో భాగంగా ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. కార్పొరేట్లను, సంపద సృష్టికర్తలను గౌరవించే ప్రభుత్వం భారత్‌లో ఉందన్నారు.

‘‘విస్తరణకు అవకాశం ఉన్న మార్కెట్లో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటే మీరు భారత్‌కు విచ్చేయండి. ఆధునిక ధోరణులు, ఫీచర్లను అభినందించే మార్కెట్లో చేయదలిస్తే భారత్‌కు రండి. భారీ మార్కెట్‌ ఉన్న చోట స్టార్టప్‌లలో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటే భారత్‌కు రండి. ప్రపంచంలో ఒకానొక అతిపెద్ద మౌలిక సదుపాయాల వ్యవస్థలో పెట్టుబడులు పెట్టాలనుకుంటే భారత్‌కు తరలిరండి’’ అని ప్రధాని అంతర్జాతీయ కంపెనీలకు పిలుపునిచ్చారు. కార్పొరేట్‌ పన్నును అన్ని రకాల సెస్సులు, చార్జీలతో కలుపుకుని 35 శాతంగా ఉన్నదాన్ని ఇటీవలే ప్రభుత్వం 25.17 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. దీంతో అంతర్జాతీయంగా అభివృద్ధి చెందిన, వర్ధమాన దేశాల పన్నులకు దీటుగా భారత కార్పొరేట్‌ పన్ను మారింది.

ఆ నాలుగు అంశాలే భారత్‌కు బలం...
‘‘భారత వృద్ధి పథం నాలుగు కీలక అంశాలతో ముడిపడి ఉంది. ప్రపంచంలో వేరెక్కడా ఇవి లేవు. అవి ప్రజాస్వామ్యం, జనాభా, డిమాండ్, నిర్ణయాత్మక శక్తి. ప్రజాస్వామ్యానికి తోడు, రాజకీయ స్థితర్వం, ఊహించతగ్గ విధానాలు, స్వతంత్ర న్యాయవ్యవస్థ అన్నవి పెట్టుబడుల వృద్ధికి భరోసానిచ్చేవి., రక్షణనిచ్చేవి. భారత్‌ తన పట్టణాలను ఎంతో వేగంగా ఆధునీకరిస్తోంది. ఆధునిక టెక్నాలజీలతో, పౌరులకు సౌకర్యమైన సదుపాయాలతో వాటిని తీర్చిదిద్దుతోంది. కనుక పట్టణీకరణపై ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటే భారత్‌కు రావాలి’’అని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. రక్షణ రంగంలో ముందెన్నడూ లేని స్థాయిలో పెట్టుబడులకు ద్వారాలు తెరిచినట్టు ఆయన చెప్పారు.భారత్‌ కోసం, ప్రపంచం కోసం భారత్‌లో తయారు చేయాలనుకుంటే భారత్‌కు రావాలని ఆహ్వానం పలికారు. వ్యాపార వాతావరణం మెరుగుపరిచేందుకు గాను రెండోసారి అధికార పగ్గాలు స్వీకరించిన అనంతరం.. మోదీ సర్కారు 50 చట్టాలను రద్దు చేసిన విషయం గమనార్హం.

ఆరంభమే... మున్ముందు ఇంకా చూస్తారు
‘‘భారత ప్రభుత్వం వ్యాపార ప్రపంచాన్ని, సంపద సృష్టిని గౌరవిస్తుంది. వ్యాపార నిర్వహణను సులభతరం చేసేందుకు కఠినమైన, భారీ నిర్ణయాలను తీసుకుంటోంది. నూతన ప్రభుత్వం కొలువుదీరి కేవలం మూడు నాలుగు నెలలే అయింది. ఇది కేవలం ఆరంభమేనని చెప్పదలుచుకున్నా. ఇంకా ఎంతో పదవీ కాలం ఉంది. ఈ ప్రయాణంలో అంతర్జాతీయ వ్యాపార సమూహంతో భాగస్వామ్యం పటిష్టం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఇది మీకు బంగారం లాంటి అవకాశం’’ అని మోదీ వివరించారు. 2024–25 నాటికి 5 ట్రిలియన్‌ డాలర్ల స్థాయికి (రూ.350 లక్షల కోట్లు) దేశ జీడీపీని తీసుకెళ్లాలన్న లక్ష్యాన్ని కేంద్ర సర్కారు విధించుకున్న విషయం గమనార్హం.

ఇప్పటికే ఐదేళ్లలో ట్రిలియన్‌ డాలర్ల మేర జీడీపీ స్థాయిని పెంచామని, 5 ట్రిలియన్‌ డాలర్ల స్థాయికి తీసుకెళ్లాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మోదీ చెప్పారు. 175 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన లక్ష్యంలో ఇప్పటికే 120 గిగావాట్ల మేర సాధించినట్టు తెలిపారు. 450 గిగావాట్ల లక్ష్యాన్ని సమీప కాలంలో చేరుకోవాలని అనుకుంటున్నట్టు చెప్పారు. గడచిన ఐదేళ్లలో భారత్‌ 286 బిలియన్‌ డాలర్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించిందని, అంతక్రితం 20 ఏళ్లలో వచ్చినవి ఇందులో సగమేనన్నారు. మౌలిక సదుపాయాలపై 100 లక్షల కోట్లు ఇన్వెస్ట్‌ చేయనున్నట్టు చెప్పారు. సరుకు రవాణా, అంతర్జాతీయ పోటీతత్వం, అంతర్జాతీయ ఆవిష్కరణ, వ్యాపార సులభతర నిర్వహణ సూచీల్లో భారత్‌ తన స్థానాలను మెరుగుపరుచుకున్న విషయాన్ని గుర్తు చేశారు.

>
మరిన్ని వార్తలు