ఎకానమీ ప్రగతికి ఏం చేద్దాం..

7 Jan, 2020 05:11 IST|Sakshi
ముకేశ్‌ అంబానీ, రతన్‌ టాటా, గౌతమ్‌ అదానీ తదితర కార్పొరేట్‌ దిగ్గజాలతో ప్రధాని మోదీ భేటీ. పక్కచిత్రంలో కిర్లోస్కర్‌ 100వ వార్షికోత్సవంలో ప్రసంగం

కార్పొరేట్‌ దిగ్గజాలతో ప్రధాని మోదీ భేటీ

ఉపాధి కల్పన తదితర అంశాలపై చర్చ

న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థ మందగమనం నేపథ్యంలో వ్యాపార దిగ్గజాలతో ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం సమావేశమయ్యారు. ఎకానమీ ఎదుర్కొంటున్న సవాళ్లు, వృద్ధి.. ఉపాధి కల్పనకు ఊతమివ్వడానికి తీసుకోతగిన చర్యలు తదితర అంశాలపై చర్చించారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ, టాటా గ్రూప్‌ గౌరవ చైర్మన్‌ రతన్‌ టాటా, భారతీ ఎయిర్‌టెల్‌ చైర్మన్‌ సునీల్‌ మిట్టల్, అదానీ గ్రూప్‌ అధిపతి గౌతమ్‌ అదానీ, మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా, మైనింగ్‌ దిగ్గజం అనిల్‌ అగర్వాల్‌ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. టీవీఎస్‌ చైర్మన్‌ వేణు శ్రీనివాసన్, ఎల్‌అండ్‌టీ అధినేత ఏఎం నాయక్‌ మొదలైన వారు దీనికి హాజరయ్యారు. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2019–20 ఏడాదికి బడ్జెట్‌ ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో కార్పొరేట్లతో ప్రధాని భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
 
సవాళ్లతో సమరం..: డిమాండ్‌ మందగమనం, తయారీ రంగం బలహీనత తదితర అంశాల కారణంగా జులై–సెప్టెంబర్‌ త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి మరింత నెమ్మదించి.. ఆరేళ్ల కనిష్టమైన 4.5 శాతానికి పడిపోయింది. వృద్ధికి ఊతమిచ్చేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ వడ్డీ రేట్లను గతేడాది గణనీయంగా తగ్గించుకుంటూ వచ్చింది. అటు కేంద్ర ప్రభుత్వం కూడా బ్యాంకులకు మరింత మూలధన నిధులివ్వడం, పలు బ్యాంకులను విలీనం చేయడంతో పాటు కార్పొరేట్‌ ట్యాక్స్‌ రేటును 30% నుంచి 22%కి తగ్గించడం వంటి సంస్కరణలు ప్రవేశపెట్టింది. అయితే, ఇవేవీ కూడా బలహీనపడిన వినియోగ డిమాండ్‌ను నేరుగా పెంచేందుకు దోహపడేవి కావనే విమర్శలు ఉన్నాయి. దీంతో వృద్ధికి ఊతమివ్వడానికి తీసుకోతగిన చర్యల గురించి తెలుసుకునేందుకు ఇటీవలి కాలంలో వివిధ రంగాలకు చెందిన 60 మంది పైగా వ్యాపారవేత్తలతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. అటు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కూడా బడ్జెట్‌ కసరత్తులో భాగంగా పరిశ్రమవర్గాలతో సమావేశమవుతున్నారు. దీంతో రాబోయే బడ్జెట్‌లో మరిన్ని సంస్కరణలపై అంచనాలు నెలకొన్నాయి.

కార్పొరేట్లపై కక్ష సాధింపు అనుకోవద్దు..
అవినీతి కట్టడి చర్యలపై మోదీ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: అవినీతికి పాల్పడుతున్న కొన్ని సంస్థలపై తీసుకుంటున్న చర్యలను కార్పొరేట్లపై కక్ష సాధింపుగా భావించరాదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఎలాంటి అవరోధాలు లేని పారదర్శక పరిస్థితుల్లో కార్పొరేట్లు నిర్భయంగా సంపద సృష్టి జరపాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన చెప్పారు. కిర్లోస్కర్‌ బ్రదర్స్‌ వందో వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ప్రధాని ఈ విషయాలు తెలిపారు. చట్టాల సాలెగూళ్ల నుంచి పరిశ్రమను బైటపడేసేందుకు గడిచిన అయిదేళ్లుగా తమ ప్రభుత్వం నిజాయితీగా పనిచేస్తోందని మోదీ పేర్కొన్నారు. కాగా, కిర్లోస్కర్‌ బ్రదర్స్‌ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రూపొందించిన పోస్టల్‌ స్టాంపును, సంస్థ వ్యవస్థాపకుడు లక్ష్మణ్‌రావ్‌ కిర్లోస్కర్‌ జీవిత కధ ‘యాంత్రిక్‌ కి యాత్ర’ హిందీ వెర్షన్‌ను ప్రధాని ఆవిష్కరించారు.   
 

>
మరిన్ని వార్తలు