పన్ను చెల్లింపుదార్లను.. 10కోట్లకు పెంచాలి

17 Jun, 2016 00:38 IST|Sakshi
పన్ను చెల్లింపుదార్లను.. 10కోట్లకు పెంచాలి

రెట్టింపు చేయడమే లక్ష్యం...
వేధింపుల భయాన్ని తొలగించాలి...
ఎగవేతదారుల పని చట్టం చూసుకుంటుంది...
డిజిటైజేషన్‌తో మరింత మెరుగైన పన్నుల వ్యవస్థ
ప్రత్యక్ష, పరోక్ష పన్ను విభాగాల వార్షిక సదస్సులో అధికారులకు ప్రధాని మోదీ సూచనలు

న్యూఢిల్లీ: దేశంలో పన్ను చెల్లింపుదార్ల సంఖ్యను రెట్టింపుస్థాయిలో 10 కోట్లకు పెంచాల్సి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల విభాగం(సీబీడీటీ), పరోక్ష పన్నుల విభాగం(సీబీఈసీ) అధికారుల వార్షిక సదస్సును ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ లక్ష్యాన్ని నిర్ధేశించారు.  ప్రస్తుతం దేశంలో పన్ను చెల్లింపుదారుల సంఖ్య దాదాపు 5.43 కోట్లుగాఉందని ప్రధాని చెప్పారు.  పన్నులు ఎగవేసేవారిని చట్టం ఉపేక్షించబోదని, కఠిన శిక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా హెచ్చరించారు. రాజస్వ జ్ఞాన సంఘం పేరుతో రెండు రోజులపాటు ఈ సదస్సు జరుగుతోంది.

మరోపక్క, పన్ను అధికారులు.. చెల్లింపుదారులతో సుహృద్భావంతో మెలగాలని.. వారిలో ఉన్న వేధింపు భయాలను పోగొట్టేందుకు ప్రయత్నించాల్సిందిగా కూడా సూచించారు. ‘పన్నుల యంత్రాంగం అనేది ఆదాయం, జవాబుదారీతనం, దర్యాప్తు, సమాచారం, డిజిైటైజేషన్(ఆర్‌ఏపీఐడీ) అనేవి ఐదు మూల స్తంభాలపై నిలబడాలి. ప్రజలందరిలో చట్టాల పట్ల గౌరవం ఉండాల్సిందే. అంతేకాదు పన్ను ఎగవేతదారులు చట్టాలను చూసి భయపడాలి కూడా.

అయితే, అందరినీ ఎగవేతదారుల కోణంలో చూడటం సరికాదు. ప్రజలు పన్ను అధికారులను చూసి భయపడకూడదు. భారతీయులు ఎప్పుడూ నిజాయితీపరులే. వారిలో నమ్మకాన్ని మరింతగా పెంపొందించగలిగితే.. ఎలాంటి ఒత్తిడీ చేయకుండానే సులువుగా పన్ను వసూళ్ల లక్ష్యాన్ని సాధించేందుకు వీలవుతుంది’ అని మోదీ సూచించారు. కాగా, సదస్సులో ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, సహాయ మంత్రి జయంత్ సిన్హా కూడా పాల్గొన్నారు.

 డిజిటైజేషన్‌పై మరింత దృష్టి...
పన్నుల యంత్రాంగాన్ని మరింత మెరుగ్గా, సమర్థ్ధవంతంగా తీర్చిదిద్దేందుకు డిజిటైజేషన్‌పై దృష్టిసారించాలని సీబీఈసీ, సీబీడీటీలకు ప్రధాని సూచించారు. మరోపక్క, పన్ను చెల్లింపుదారుల్లో అపనమ్మకాన్ని తొలగించే దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. పన్నుల చెల్లింపులో వారికి ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూసుకోవాలన్నారు. దేశంలో పన్నుల యంత్రాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై అభిప్రాయాలు, సూచనలు చేయాల్సిందిగా అధికారులతో ప్రధాని పేర్కొన్నారు. ఆలోచనలను కార్యరూపంలోకి తీసుకొచ్చేవిధంగా ఈ ‘జ్ఞాన సంగం’ సదస్సును ‘కర్మ సంఘం’గా మార్చుకోవాలని చెప్పారు.

 అధికారుల నుంచి సూచనలు...
దాదాపు గంటపాటు సీబీడీటీ, సీబీఈసీ ఉన్నతాధికారులతో మోదీ వివిధ అంశాలపై చర్చించడంతోపాటు వారి నుంచి అభిప్రాయాలను అడిగితెలుసుకున్నారు. పన్ను చెల్లింపుదారులతో వ్యవహరించే తీరుకు సంబంధించి నిబంధనలతో ఒక చట్టాన్ని తీసుకురావాల్సిందిగా ఈ సందర్భంగా ప్రధానికి అధికారుల నుంచి ఒక సూచన వచ్చింది. తాము దర్యాప్తు సంస్థల మాదిరిగా పనిచేయాలా.. లేదంటే పన్ను చెల్లింపుదారులకు స్నేహపూర్వక విభాగాలుగా ఉండాలా అని కూడా కొంతమంది అధికారులు మోదీని అడిగారు. సదస్సులో జైట్లీ మాట్లాడుతూ... పన్ను విభాగాలు పూర్తిస్థాయిలో డిజిటైజేషన్‌పై దృష్టిసారించాలన్నారు. పన్ను చెల్లింపుదారుల్లో అపనమ్మకాన్ని పోగొట్టేందుకు తాము చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా సీబీడీటీ చైర్మన్ అతులేశ్ జిందాల్ చెప్పారు.

 నల్లధనం కొందరివద్దే...
దేశంలో నల్లధనం అనేది కొందరివద్ద మాత్రమే పోగుపడి ఉందని మోదీ పేర్కొన్నారు. పన్ను చెల్లింపుదారులకు అనువుగా ఉండేవిధంగా ఈ వ్యవస్థను తీర్చిదిద్దగలిగితే.. పన్నులు వాటంతటవే వస్తాయని చెప్పారు. పన్నుల వ్యవస్థలో లోపాలను కూడా మోదీ ఎత్తిచూపారు. ‘భారత్‌లో పన్నులను ఎలా చెల్లించాలి అని గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో వెదికితే దాదాపు 7 కోట్ల వరకూ సమాధానాలు దొరుకుతాయి. అదే చెల్లించకుండా ఉండాలంటే ఏం చేయాలని అడిగితే మాత్రం 12 కోట్ల సమాధానాలు వచ్చిపడతాయి’ అని దీనికి ఉదాహరణగా పేర్కొన్నారు.

ఆదాయపు పన్ను(ఐటీ) విభాగంలో 42,000 మంది అధికారులు ఉన్నప్పటికీ.. పన్ను రిటర్నుల మదింపుతో కేవలం 8% ఆదాయమే లభిస్తోందన్నారు. ‘ప్రత్యక్ష పన్నుల ఆదాయంలో 92 శాతం మూలం వద్ద పన్ను విధింపు(టీడీఎస్- ఎక్కువగా ఉద్యోగులకు సంబంధించినవే), కార్పొరేట్ల ముందస్తు పన్ను చెల్లిం పులు, సెల్ఫ్ అసెస్‌మెంట్ పన్నుల రూపంలోనే ఖజానాకు వస్తోంది’ అని మోదీ చెప్పారు.

మరిన్ని వార్తలు