-

ప్రపంచ ఎకానమీకి చమురు సెగ..

16 Oct, 2018 00:40 IST|Sakshi
ఇండియా ఎనర్జీ ఫోరం సదస్సు సందర్భంగా చమురు దిగ్గజాల సీఈఓలతో ప్రధాని మోదీ

రేట్లను కట్టడి చేయకుంటే వృద్ధికి ముప్పే

చమురు ఉత్పత్తి దేశాలకు ప్రధాని మోదీ హెచ్చరిక

చెల్లింపుల విధానాలు సమీక్షించాలని సూచన  

న్యూఢిల్లీ: అంతకంతకూ పెరిగిపోతున్న ముడి చమురు ధరలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రతికూలంగా మారుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. నాలుగేళ్ల గరిష్టానికి చేరిన రేట్లను కట్టడి చేయకపోతే వృద్ధిపై తీవ్ర ప్రభావం పడుతుందని చమురు ఉత్పత్తి దేశాలను హెచ్చరించారు.  చమురు రేట్లను సముచిత స్థాయులకు తెచ్చేందుకు ఉత్పత్తి దేశాలు మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారాయన. ఇండియా ఎనర్జీ ఫోరం వార్షిక సదస్సు సందర్భంగా సోమవారం దిగ్గజ చమురు, గ్యాస్‌ కంపెనీల ప్రతినిధులతో భేటీలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.

పెరుగుతున్న ముడిచమురు రేట్లు ద్రవ్యోల్బణాన్ని ఎగదోస్తున్నాయని, భారత్‌ వంటి వర్ధమాన దేశాల బడ్జెట్‌లను తల్లకిందులు చేస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్రం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. సుమారు రెండు గంటలపైగా సాగిన భేటీలో సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ మంత్రులు, బ్రిటన్‌ ఇంధన దిగ్గజం బీపీ సంస్థ సీఈవో బాబ్‌ డడ్లీ, టోటల్‌ చీఫ్‌ ప్యాట్రిక్‌ ఫోయేన్, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ డైరెక్టర్‌ పీఎంఎస్‌ ప్రసాద్, వేదాంత చీఫ్‌ అనిల్‌ అగర్వాల్, కేంద్ర ఆర్థిక మంత్రి  జైట్లీ తదితరులు పాల్గొన్నారు.

తీవ్ర ఒత్తిడిలో ఉన్న దేశీ కరెన్సీకి తాత్కాలికంగానైనా మద్దతు లభించేలా.. చెల్లింపు విధానాలను కూడా సమీక్షించాలని ప్రధాని కోరినట్లు అధికారిక ప్రకటన పేర్కొంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఈ ఏడాది ఇప్పటిదాకా 14.5 శాతం మేర పతనమైన సంగతి తెలిసిందే. సుమారు 83 శాతం చమురు అవసరాల కోసం ప్రధానంగా దిగుమతులపైనే భారత్‌ ఆధారపడుతున్న నేపథ్యంలో రూపాయి పతనం కారణంగా చెల్లింపులు భారంగా మారుతున్నాయి.

పెట్టుబడులు ఎందుకు పెట్టడం లేదు..
గత సదస్సుల్లో కోరినట్లు నిబంధనలను సడలించినప్పటికీ చమురు, గ్యాస్‌ ఉత్పత్తికి సంబంధించి భారత్‌లో కొత్తగా పెట్టుబడులు ఎందుకు పెట్టడం లేదంటూ కంపెనీల సీఈవోలను ప్రధాని ప్రశ్నించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. చమురు ధరలు, ఉత్పత్తి పరిమాణం మొత్తం అంతా ఉత్పత్తి దేశాలే శాసిస్తున్నాయని ప్రధాని పేర్కొన్నారు. తగినంత ఉత్పత్తి ఉంటున్నప్పటికీ మార్కెటింగ్‌ విధానాల కారణంగా చమురు రేట్లు పెరిగిపోతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

ఫలితంగా తగినన్ని వనరులు లేక వినియోగ దేశాలు తీవ్రమైన ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నాయన్నారు. ఈ నేపథ్యంలో మిగతా ఉత్పత్తుల తరహాలోనే  ఉత్పత్తి దేశాలు, వినియోగదేశాల మధ్య భాగస్వామ్యం ఉండాలని మోదీ పేర్కొన్నారు. ‘ఇప్పుడిప్పుడే రికవరీ బాట పడుతున్న ప్రపంచ ఎకానమీ స్థిరపడేందుకు ఇది తోడ్పడగలదు‘ అని ఆయన చెప్పా రు. అలాగే చమురు ఎగుమతి దేశాలు తమ దగ్గర పెట్టుబడులకు ఉపయోగపడే మిగులు నిధులను.. వర్ధమాన దేశాల్లో ఆయిల్, గ్యాస్‌ ఉత్పత్తి కార్యకలాపాలపై ఇన్వెస్ట్‌ చేయడాన్ని పరిశీలించాలన్నారు.

మా వంతు ప్రయత్నాలు: సౌదీ మంత్రి
పెరుగుతున్న చమురు ధరలతో భారత్‌ తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటోందని ఇండియా ఎనర్జీ ఫోరంలో పాల్గొన్న కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు, అధిక ముడి చమురు ధరల కారణంగా వినియోగ దేశాలు పడుతున్న బాధలను ప్రధాని  మోదీ స్పష్టంగా వివరించారని  సౌదీ అరేబియా చమురు మంత్రి అల్‌–ఫలిహ్‌ చెప్పారు.

‘బంగారు గుడ్లు పెట్టే కోడిని (వినియోగ దేశాలు) ఒక్కసారిగా చంపేయొద్దు అంటూ మాలాంటి ఉత్పత్తి దేశాలను ప్రధాని మోదీ హెచ్చరించారు’ అని ఫలిహ్‌ పేర్కొన్నారు. సౌదీ ఇప్పటికే తన వంతు చర్యలు తీసుకుంటోందని, లేదంటే ఈ బాధ మరింత తీవ్రంగా ఉండేదని తెలిపారు. దేశీయంగా ఇంధన రంగ అభివృద్ధికి తీసుకోతగిన చర్యలపై సమాలోచనలు జరపడం ఇండియా ఎనర్జీ ఫోరం సదస్సుల ప్రధానోద్దేశం. 2016  ఇండియా ఎనర్జీ ఫోరం సందర్భంగా సహజ వాయువు ధరల సంస్కరణలపై వచ్చిన సూచనలను పరిశీలించిన కేంద్రం ఆ తర్వాత రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

మరిన్ని వార్తలు