లాభాల్లోకి పీఎన్‌బీ

27 Jul, 2019 13:27 IST|Sakshi

గత క్యూ1లో రూ.940 కోట్ల నష్టాలు  

ఈ క్యూ1లో 1,019 కోట్ల లాభం  

తగ్గిన మొండి బకాయిలు

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్‌ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ) ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌ క్వార్టర్‌లో మళ్లీ లాభాల్లోకి వచ్చింది. గత క్యూ1లో రూ.940 కోట్ల నికర నష్టాలు రాగా, ఈ క్యూ1లో రూ.1,019 కోట్ల నికర లాభం వచ్చిందని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ తెలిపింది. సీక్వెన్షియల్‌గా చూస్తే, గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.4,750 కోట్ల నికర నష్టాలు వచ్చాయని పేర్కొంది. రుణ నాణ్యత మెరుగుపడటంతో కేటాయింపులు తగ్గాయని, ఫలితంగా ఈ క్యూ1లో లాభాల బాట పట్టామని బ్యాంక్‌ ఎమ్‌డీ, సీఈఓ సునీల్‌ మెహతా చెప్పారు. గత క్యూ1లో రూ.15,072 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ1లో రూ.15,162 కోట్లకు పెరిగిందని తెలిపారు. గత క్యూ4 ఫలితాల వెల్లడి సందర్భంగా అధ్వాన పరిస్థితులు ముగిశాయని, రానున్న క్వార్టర్లలో మంచి పనితీరు చూపిస్తామని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

రుణ నాణ్యత మెరుగు...
బ్యాంక్‌ రుణ నాణ్యత మెరుగుపడింది. గత క్యూ1లో 18.26 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ1లో 16.49 శాతానికి తగ్గాయని మెహతా తెలిపారు. నికర మొండి బకాయిలు 10.58 శాతం నుంచి 7.17 శాతానికి చేరాయని పేర్కొన్నారు. విలువ పరంగా చూస్తే, స్థూల మొండి బకాయిలు రూ.82,889 కోట్ల నుంచి రూ.77,267 కోట్లకు, నికర మొండి బకాయిలు రూ.43,872 కోట్ల నుంచి రూ.30,180 కోట్లకు తగ్గాయని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరి కల్లా మొండి బకాయిలు 10–12 శాతం రేంజ్‌లో దిగిరాగలవని ఆయన ధీమాగా చెప్పారు. మొండి బకాయిలు తగ్గడంతో మొండి బకాయిలకు కేటాయింపులు దాదాపు సగం తగ్గాయి. గత క్యూ1లో రూ.4,982 కోట్లుగా ఉన్న కేటాయింపులు ఈ క్యూ1లో రూ.2,147 కోట్లకు తగ్గాయని తెలిపారు. ప్రొవిజన్‌ కవరేజ్‌ రేషియో 61.80 శాతం నుంచి 74.63 శాతానికి పెరిగిందని పేర్కొన్నారు. 

రిటైల్‌ రుణాలు 22 శాతం అప్‌...
భారీ మార్పుల దిశగా చర్యలు చేపట్టామని, ఫలితంగా వ్యాపారంలోనూ, రుణ నాణ్యతలోనూ మెరుగుదల సాధించామని మెహతా తెలిపారు. కేంద్రీకృత రుణ ప్రాసెసింగ్‌ ప్రక్రియ, ఒత్తిడిలోని రుణాల నిర్వహణలో మెరుగైన విధానం, పర్యవేక్షణ విభాగాల మెరుగుదల వంటి ప్రయత్నాలు ఫలాలనివ్వడం మొదలైందని పేర్కొన్నారు. రిటైల్‌ రుణాలు 22 శాతం, గృహ రుణాలు 30 శాతం పెరిగాయని పేర్కొన్నారు.
నష్టాల్లోంచి లాభాల్లోకి రావడం, రుణ నాణ్యత
మెరుగుపడటంతో బీఎస్‌ఈలో
పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ షేర్‌ 2.5 శాతం
లాభంతో రూ.67.75 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు