మూడు మొండి పద్దుల విక్రయంలో పీఎన్‌బీ

7 Jul, 2018 01:08 IST|Sakshi

రూ. 136 కోట్ల రికవరీ యత్నాలు

న్యూఢిల్లీ: దాదాపు రూ. 136 కోట్ల మొండి బాకీలను రాబట్టుకునే క్రమంలో 3 నిరర్ధక ఆస్తుల (ఎన్‌పీఏ)ను విక్రయించే దిశగా ప్రభుత్వ రంగ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ) చర్యలు చేపట్టింది. ఈ ఖాతాల కొనుగోలుకు అసెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కంపెనీలు/ఎన్‌బీఎఫ్‌సీలు/ఇతర బ్యాంకులు/ఆర్థిక సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించింది. అమ్మకానికి ఉంచిన ఎన్‌పీఏల్లో గ్వాలియర్‌ ఝాన్సీ ఎక్స్‌ప్రెస్‌ వేస్‌ (రూ. 55 కోట్లు బాకీ), ఎస్‌వీఎస్‌ బిల్డ్‌కాన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (రూ. 50 కోట్లు), శివ టెక్స్‌ఫ్యాబ్స్‌ (రూ.31.06 కోట్లు) ఉన్నాయి.

జూలై 20న ఈ ఖాతా ల విక్రయానికి ఈ–బిడ్డింగ్‌ జరుగుతుందని పీఎన్‌బీ తెలిపింది. పీఎన్‌బీ ఇటీవల ఏప్రిల్‌లో కూడా మూడు ఎన్‌పీఏ ఖాతాల వేలానికి బిడ్లు ఆహ్వానించింది. ఈ ఖాతాల్లో మీరట్‌కి చెందిన శ్రీ సిద్ధబలి ఇస్పాత్‌ లిమిటెడ్‌ (రూ.165.30 కోట్లు), చెన్నై సంస్థ శ్రీ గురుప్రభ పవర్‌ (రూ.31.52 కోట్లు), ముంబైకి చెందిన ధరమ్‌నాథ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ (రూ.17.63 కోట్లు) ఉన్నాయి.

గతేడాది డిసెంబర్‌ ఆఖరు నాటికి బ్యాంకింగ్‌ వ్యవస్థలో ఎన్‌పీఏలు రూ. 8.31 లక్షల కోట్లుగా ఉన్న సంగతి తెలిసిందే. 2017–18 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు ఏకంగా రూ. 87,357 కోట్ల మేర నష్టాలు ప్రకటించాయి. నీరవ్‌ మోదీ కుంభకోణంతో దెబ్బతిన్న పీఎన్‌బీ అత్యధికంగా రూ. 12,283 కోట్ల నష్టం నమోదు చేసింది.

మరిన్ని వార్తలు