పీఎన్‌బీ రికార్డు నష్టం!!

16 May, 2018 01:05 IST|Sakshi

క్యూ4లో రూ. 13,417 కోట్లు

నీరవ్‌ మోదీ స్కామ్, మొండిబాకీల ప్రభావం

11 శాతానికి నికర ఎన్‌పీఏలు  

న్యూఢిల్లీ: నీరవ్‌ మోదీ కుంభకోణంతో కుదేలైన ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ)... మార్చి త్రైమాసికంలో దారుణమైన నష్టాలు ప్రకటించింది. జనవరి–మార్చి క్వార్టర్‌లో ఏకంగా రూ.13,417 కోట్లు నష్టం నమోదు చేసింది. ఎన్‌పీఏల కేటయింపులు భారీగా ఎగియడం ఇందుకు కారణం. దేశీ బ్యాంకు ఈ స్థాయిలో నష్టాలు ప్రకటించడం ఇదే ప్రథమం.

2016–17 క్యూ4లో పీఎన్‌బీ రూ.262 కోట్ల లాభం నమోదు చేసింది. నీరవ్‌ మోడీ స్కామ్‌లో ఎల్‌వోయూలు, ఎఫ్‌ఎల్‌సీలకు సంబంధించి ఇతర బ్యాంకులకు రూ.6,586 కోట్లు చెల్లించినట్లు పీఎన్‌బీ పేర్కొంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికిగాను కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన పీఎన్‌బీ రూ.12,130 కోట్ల నష్టం ప్రకటించింది. 2016–17లో రూ.1,187 కోట్ల లాభం నమోదు చేసింది.

ఎగిసిన ఎన్‌పీఏలు..
2017–18 క్యూ4లో బ్యాంకు ఆదాయం రూ. 14,989 కోట్ల నుంచి రూ. 12,946 కోట్లకు తగ్గింది. స్థూల నిరర్ధక ఆస్తులు (జీఎన్‌పీఏ) 12.53 శాతం నుంచి 18.38 శాతానికి, నికర నిరర్ధక ఆస్తులు 7.81 శాతం నుంచి 11.24 శాతానికి ఎగిశాయి. పరిమాణం పరంగా చూస్తే స్థూల ఎన్‌పీఏలు రూ.55,370 కోట్ల నుంచి రూ.86,620 కోట్లకు, నికర ఎన్‌పీఏలు రూ.32,702 కోట్ల నుంచి రూ.48,684 కోట్లకు పెరిగాయి.

ఫలితంగా మొండి బాకీలకు ప్రొవిజనింగ్‌ కూడా రూ. 4,910 కోట్ల నుంచి రూ. 16,202 కోట్లకు చేరింది. అంత క్రితం ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్‌లో మొండిబాకీలకు ప్రొవిజనింగ్‌ రూ. 4,910 కోట్లే. 2017 ఆర్థిక సంవత్సరంలో స్థూల ఎన్‌పీఏలకు సంబంధించి రూ. 2,207 కోట్ల వ్యత్యాసమున్నట్లు ఆర్‌బీఐ గుర్తించడంతో తదనుగుణంగా ఆ సంవత్సరం నికర లాభాలను పీఎన్‌బీ సర్దుబాటు చేసింది. దీంతో 2016–17లో నమోదైన రూ. 1,324 కోట్ల లాభం కాస్తా రూ. 533 కోట్లకు పరిమితమైంది.

మరోవైపు, మార్చినాటికి  పీఎన్‌బీ మొత్తం డిపాజిట్లు 3.3% వృద్ధి చెంది రూ. 6.42 లక్షల కోట్లకు చేరాయి. కాసా (కరెంటు అకౌంటు సేవిం గ్స్‌ అకౌంటు) డిపాజిట్లు రూ. 2,63,247 కోట్లకు పెరిగాయి. డిపాజిట్లలో వీటి వాటా 43.85%.

మోడీ మోసం రూ. 14,357 కోట్లు..
ఆభరణాల వ్యాపారి నీరవ్‌ మోడీ స్కామ్‌కి సంబంధించి మొత్తం రూ. 14,357 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు పీఎన్‌బీ వెల్లడించింది. ఇందులో సగ భాగానికి.. అంటే రూ. 7,178 కోట్లకు క్యూ4లో ప్రొవిజనింగ్‌ చేసింది. మిగిలిన మొత్తాన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడు త్రైమాసికాల్లో సర్దుబాటు చేయనున్నట్లు బ్యాంకు తెలిపింది.

పీఎన్‌బీ ఉద్యోగులతో కుమ్మక్కై మోడీ సంస్థలు మోసపూరితంగా ఎల్‌వోయూలు తీసుకోవడం, వాటి ఆధారంగా ఇతర బ్యాంకుల నుంచి రుణాలు పొంది భారీ కుంభకోణానికి పాల్పడటం తెలిసిందే. ఈ స్కామ్‌కి సంబంధించి ఇప్పటికే ఇద్దరు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లకు బ్యాంకు బోర్డు అధికారాలన్నీ తొలగించింది. అప్పట్లో పీఎన్‌బీ చీఫ్‌గా వ్యవహరించిన ప్రస్తుత అలహాబాద్‌ బ్యాంక్‌ ఎండీ ఉషా అనంతసుబ్రమణియన్‌పై కూడా చర్యల ప్రక్రియ మొదలైంది.

రూ. 938 కోట్ల మార్కెట్‌ విలువ ఆవిరి...
ట్రేడింగ్‌ ఆఖర్లో ఆర్థిక ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో మంగళవారం పీఎన్‌బీ షేరు భారీగా క్షీణించింది. బీఎస్‌ఈలో 3.80 శాతం తగ్గి రూ.86 వద్ద క్లోజయింది. ఒక దశలో ఏకంగా 6.26 శాతం పతనమై 52 వారాల కనిష్ట స్థాయి అయిన రూ.83.80ని కూడా తాకింది. మొత్తం మీద కంపెనీ మార్కెట్‌ విలువ రూ.938 కోట్ల మేర హరించుకుపోయి రూ.23,741 కోట్లకు పరిమితమయింది.


అలహాబాద్‌ బ్యాంక్‌ ఎండీ అధికారాలకు కత్తెర ..
నీరవ్‌ మోదీ స్కామ్‌పై విచారణ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశాలకు అనుగుణంగా ఎండీ, సీఈవో ఉషా అనంతసుబ్రమణియన్‌ అధికారాలకు కోత విధిస్తూ అలహాబాద్‌ బ్యాంకు బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇది తక్షణమే అమల్లోకి వచ్చినట్లు స్టాక్‌ ఎక్సే్చంజీలకు తెలియజేసింది. బ్యాంకు కార్యకలాపాలు సజావుగా సాగేందుకు తగు ఏర్పాట్లు సూచించాలని కేంద్రాన్ని కోరింది.

2011– 2017 మధ్య నీరవ్‌ మోదీ స్కామ్‌ చోటుచేసుకోగా, 2017 మే వరకూ ఉష పీఎన్‌బీ సీఎండీగా కొనసాగారు. మోదీ స్కామ్‌పై దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఇప్పటికే ఈ కేసులో దాఖలు చేసిన చార్జిషీటులో ఉషా అనంత సుబ్రమణియన్‌తో పాటు పలువురు అధికారుల పేర్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఉషను తొలగించే దిశగా.. ఆమె అధికారాలకు కోత విధించాలంటూ అలహాబాద్‌ బ్యాంకును కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఆదేశించింది.

మరిన్ని వార్తలు