ఆ బ్యాంకునూ భారీగా ముంచేసిన బకాయిలు

18 May, 2016 16:07 IST|Sakshi
ఆ బ్యాంకునూ భారీగా ముంచేసిన బకాయిలు

న్యూఢిల్లీ : దలాల్ స్ట్రీట్ కు భారీ షాకింగ్. భారత బ్యాంకింగ్ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా అతిపెద్ద క్వార్టర్ నష్టం. ఒక్కసారిగా పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్బీ) ఢమాల్ మని పడిపోయింది.  బుధవారం ప్రకటించిన మార్చి త్రైమాసిక ఫలితాల్లో రూ.5,370 కోట్ల భారీ నష్టాలను నమోదుచేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.307 నికల లాభాలను చూపించిన పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఈ ఏడాది మార్కెట్ విశ్లేషకులకు షాకిస్తూ భారీ నష్టాల్లో నిలిచింది. ఈ ఏడాది రూ.81కోట్ల లాభాలను నమోదుచేస్తుందని మార్కెట్ విశ్లేషకులు భావించారు. అయితే వీరి అంచనాలన్నీ తలకిందులయ్యాయి.

స్థూల మొండిబకాయిలు ఈ త్రైమాసికంలో 12.9 శాతానికి ఎగబాకడంతో, నష్టాలు వాటిల్లాయని బ్యాంకు ప్రకటించింది. డిసెంబర్ త్రైమాసికంలో ఈ బకాయిలు 8.47శాతంగా ఉన్నాయి. మూడో త్రైమాసికంలో ఉన్న రూ.34,338 కోట్ల మొండిబకాయిలు, ఈ నాలుగో త్రైమాసికంలో రూ.55,818 కోట్లకి ఎగబాకాయి. స్థూల మొండి బకాయిలు త్రైమాసికం త్రైమాసికానికి రూ.21,480 కోట్లు పెరిగాయని బ్యాంకు తెలిపింది. ఇప్పటివరకూ విడుదలైన అన్ని బ్యాంకుల మొండి బకాయిల కన్నా ఈ బకాయిలే  ఎక్కువ.

మూడో అతిపెద్ద పబ్లిక్ రంగ బ్యాంకుగా ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంకు నికర నష్టాల దలాల్ స్ట్రీట్ ను షాకుకు గురిచేసింది. పీఎన్బీ ఫలితాల అనంతరం,  మొత్తం 18 పబ్లిక్ రంగ బ్యాంకుల్లో తొమ్మిది బ్యాంకుల మార్చి క్వార్టర్ నష్టాలు ఏకంగా రూ.14,808 కోట్లని గణాంకాలు విడుదలయ్యాయి. బ్యాంకులు నమోదుచేస్తున్న ఈ నష్టాలతో పీఎస్ యూ బ్యాంకింగ్ రంగం మార్కెట్లో తీవ్ర నష్టాలను చవిచూస్తోంది. గత ఐదేళ్ల కాలంలో ఈ నెలలో నిఫ్టీ పీఎస్ యూ బ్యాంకు ఇండెక్స్ 6శాతం మేర పడిపోయింది

>
మరిన్ని వార్తలు