డైమండ్‌ కింగ్‌ నీరవ్‌ మోదీ అరెస్ట్‌!

9 Apr, 2018 14:29 IST|Sakshi

హాంకాంగ్‌ : పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుని భారీ కుంభకోణంలో ముంచెత్తి, విదేశాలకు పారిపోయిన డైమాండ్‌ కింగ్‌ నీరవ్‌ మోదీని హాంకాంగ్‌ పోలీసులు అరెస్ట్‌ చేసే అవకాశముంది. భారత అభ్యర్థన మేరకు, అక్కడి స్థానిక చట్టాలు, పరస్పర న్యాయ సహాయం ఒప్పందాలపై హాంకాంగ్‌ పోలీసులు నీరవ్‌ మోదీని అదుపులోకి తీసుకోనున్నారని చైనా విదేశీ వ్యవహారాల అధికార ‍ప్రతినిధి జెంగ్ షుయాంగ్ తెలిపారు. ఇటీవలే నీరవ్‌ మోదీ హాంకాంగ్‌లో ఉన్నట్టు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖ పార్లమెంట్‌కు తెలిపింది. పీఎన్‌బీ కుంభకోణ కేసులో భాగంగా నీరవ్‌ మోదీని ప్రొవిజనల్‌ అరెస్ట్‌(తాత్కాలిక నిర్భందం) చేయాలని హాంకాంగ్‌ అథారిటీలను కోరినట్టు ప్రభుత్వం పేర్కొంది.  

2018 మార్చి 23నే ఈ అభ్యర్థనను హాంకాంగ్‌ అథారిటీలకు సమర్పించామని మంత్రిత్వ శాఖ సహాయమంత్రి వీకే సింగ్‌ రాజ్యసభకు తెలిపారు. అయితే ఆదివారమే నీరవ్‌కు వ్యతిరేకంగా ముంబై సీబీఐ స్పెషల్‌ కోర్టు నాన్‌-బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంట్‌ జారీచేసిన సంగతి తెలిసిందే. నీరవ్‌తో పాటు మెహుల్‌ చౌక్సిపై కోర్టు నాన్‌-బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంట్‌ జారీచేసింది. కాగ, నీరవ్‌ మోదీ, ఆయన అంకుల్‌ మెహుల్‌ చౌక్సిలు కలిసి పీఎన్‌బీ బ్యాంకులో రూ.13,500 కోట్ల కుంభకోణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. జనవరిలో ఈ కుంభకోణం బయటికి రాకముందే, వీరిద్దరూ దేశం విడిచి పారిపోయారు. తొలుత స్విట్జర్లాండ్‌కు పారిపోయినట్టు వార్తలు రాగ, తర్వాత న్యూయార్క్‌, ఆ అనంతరం హాంకాంగ్‌లో ఉన్నట్టు తెలిసింది. దేశం విడిచి పారిపోయిన వీరిద్దరిన్నీ భారత్‌కు రప్పించడానికి దర్యాప్తు సంస్థలు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే.   

మరిన్ని వార్తలు