పీఎన్‌బీ స్కామ్‌.. బ్యాంకర్లకు సమన్లు

7 Mar, 2018 00:41 IST|Sakshi

నీరవ్‌ మోదీ సంస్థలకు ఇచ్చిన రుణాలపై ఎస్‌ఎఫ్‌ఐవో ఆరా

విచారణకు 31 బ్యాంకుల ఎగ్జిక్యూటివ్‌లు

యాక్సిస్, ఐసీఐసీఐ చీఫ్‌లకూ పిలుపు?

వివరణ కోరిన స్టాక్‌ ఎక్సే్చంజీలు

గీతాంజలి గ్రూప్‌ వీపీ విపుల్‌ అరెస్టు  

ముంబై: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో (పీఎన్‌బీ) నీరవ్‌ మోదీ గ్రూప్‌ సంస్థల కుంభకోణానికి సంబంధించి సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీస్‌ (ఎస్‌ఎఫ్‌ఐవో) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా నీరవ్‌ మోదీ, మెహుల్‌ చోక్సీ సంస్థలకు రుణాలిచ్చిన బ్యాంకర్ల నుంచి సమాచారం సేకరించడం ప్రారంభించింది. ఆయా సంస్థలకు సదరు బ్యాంకులు ఎంత మేర రుణాలిచ్చినదీ.. తదితర వివరాలు తెలియజేసేందుకు రావాలంటూ దాదాపు 31 బ్యాంకుల ఎగ్జిక్యూటివ్‌లకు ఆదేశాలు పంపింది. దర్యాప్తులో సహకరించాల్సిందిగా ఎస్‌ఎఫ్‌ఐవో కోరిన మీదట.. యాక్సిస్‌ బ్యాంక్‌ డిప్యూటీ ఎండీ వి. శ్రీనివాసన్‌తో పాటు ట్రేడ్, ట్రాన్సాక్షన్స్‌ విభాగంలో పనిచేసే కొందరు ఎగ్జిక్యూటివ్‌లు విచారణకు హాజరైనట్లు పేర్కొన్నాయి. సుమారు రెండు గంటలపాటు వారు ఎస్‌ఎఫ్‌ఐవో కార్యాలయంలోనే ఉన్నారని, చోక్సికి చెందిన గీతాంజలి జెమ్స్, నీరవ్‌ మోదీ సంస్థలతో లావాదేవీల గురించి ఎస్‌ఎఫ్‌ఐవో వారిని ప్రశ్నించిందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. మంగళవారం.. ఒకదశలో ఐసీఐసీఐ బ్యాంకు ఎండీ చందా కొచర్, యాక్సిస్‌ బ్యాంక్‌ సీఈవో శిఖా శర్మలకు కూడా ఎస్‌ఎఫ్‌ఐవో సమన్లు పంపిందంటూ వార్తలు వచ్చాయి. వీటిపై ఆయా బ్యాంకుల నుంచి స్టాక్‌ ఎక్సే్చంజీలు వివరణ కోరాయి. అయితే, సాధారణంగా నోటీసుల్లాంటివి చీఫ్‌ల కార్యాలయాలకే వస్తాయి కాబట్టి ఈ ఊహాగానాలు వచ్చి ఉంటాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. రుణాలు తీసుకున్న సంస్థలతో లావాదేవీలు జరిపే అధికారులకే ఎక్కువ వివరాలు తెలుస్తాయి కనక.. విచారణకు వారే హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నాయి. 

సీబీఐ అదుపులో ’మాస్టర్‌మైండ్‌’ విపుల్‌ చితాలియా..
పీఎన్‌బీ కుంభకోణం కేసులో గీతాంజలి గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ విపుల్‌ చితాలియాను సీబీఐ అరెస్టు చేసింది. నేరుగా గ్రూప్‌ చీఫ్‌ మెహుల్‌ చోక్సీకి రిపోర్ట్‌ చేసే చితాలియాను ’మాస్టర్‌మైండ్‌’గా సీబీఐ అభివర్ణించింది. పీఎన్‌బీ రిటైర్డ్‌ డిప్యూటీ మేనేజర్‌ గోకుల్‌నాథ్‌ శెట్టితో కుమ్మక్కై మోసపూరిత ఎల్‌వోయూలు, ఫారిన్‌ లెటర్స్‌ ఆఫ్‌ క్రెడిట్స్‌ (ఎఫ్‌ఎల్‌సీ)ల దరఖాస్తులను తయారు చేయడంలో చితాలియా కీలకపాత్ర పోషించినట్లు పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి అరెస్టయినవారిలో చితాలియా 19వ వ్యక్తి. ముంబై విమానాశ్రయంలో అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన తర్వాత.. సీబీఐ ప్రత్యేక కోర్టులో ఆయన్ను హాజరుపర్చారు. మార్చి 17 దాకా సీబీఐ కస్టడీకి కోర్టు ఆదేశించింది. చితాలియాపై ఇప్పటికే లుక్‌ అవుట్‌ నోటీసు జారీకావడంతో ఆయన బ్యాంకాక్‌ నుంచి రాగానే ఇమిగ్రేషన్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి.  

ఎల్‌వోయూల ఆధారంగానే ఇతర బ్యాంకుల రుణాలు
పీఎన్‌బీ ఉద్యోగులతో కుమ్మక్కై తీసుకున్న లెటర్స్‌ ఆఫ్‌ అండర్‌టేకింగ్‌ (ఎల్‌వోయూ) ఆధారంగా ఇతర బ్యాంకుల నుంచి రుణాలు పొందిన మోడీ గ్రూప్‌ సంస్థలు రూ. 12,700 కోట్ల భారీ కుంభకోణానికి పాల్పడ్డాయని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై సీబీఐతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ వంటివీ విచారణ జరుపుతున్నాయి. గీతాంజలి జెమ్స్‌కి దాదాపు రూ.6,800 కోట్ల మేర రుణాలిచ్చిన 31 బ్యాంకుల కన్సార్షియంనకు ఐసీఐసీఐ బ్యాంక్‌ లీడ్‌ బ్యాంకర్‌గా ఉంది. మోదీ కంపెనీలకు అది నేరుగా ఎలాంటి రుణాలివ్వలేదు. అలాగే యాక్సిస్‌ బ్యాంక్‌ కూడా పీఎన్‌బీ  ఎల్‌వోయూల ఆధారంగానే గీతాంజలి జెమ్స్‌కి రుణాలిచ్చిందే తప్ప నేరుగా లోన్‌లు ఇవ్వనట్లు తెలుస్తోంది. 

ఈడీ కేసుపై హైకోర్టుకు ఫైర్‌స్టార్‌ డైమండ్‌..
పీఎన్‌బీ కుంభకోణం కేసుకు సంబంధించి నీరవ్‌ మోదీకి చెందిన ఫైర్‌స్టార్‌ డైమండ్‌ సంస్థ తాజాగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తమపై మనీ ల్యాండరింగ్‌ కేసు పెట్టడాన్ని సవాలు చేస్తూ పిటీషన్‌ దాఖలు చేసింది. తమ స్థిరాస్తులను జప్తు చేస్తూ ఈడీ తీసుకున్న చర్యలను రద్దు చేయాలని కోరింది. 

చర్యలపై పీఎంవోకి వివరణ..: పీఎన్‌బీ స్కామ్‌ కేసులో తీసుకున్న చర్యల గురించి మార్చి 1న ప్రధాని కార్యాలయానికి వివరాలు అందించినట్లు ఆర్థిక శాఖ  రాజ్యసభకు తెలిపింది. సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా రెండు కేసులు నమోదు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ పలు ప్రాంతాల్లో సోదాలతో పాటు కొన్ని ఆస్తులు కూడా జప్తు చేసినట్లు పేర్కొంది. అలాగే మ్యూచువల్‌ ఫండ్స్, బ్యాంక్‌ ఖాతాలనూ స్తంభింపచేసినట్లు, స్కామ్‌లో ఉన్న సంస్థల ఆస్తులు, ఖాతాల వివరాల కోసం 13 దేశాలకు అభ్యర్ధనలు పంపినట్లు వివరించింది.

భారీ రుణాలున్నవారి పాస్‌పోర్టులపై లుక్కేయండి!
ఆ వివరాలన్నీ  తీసుకోండి: ఆర్థిక శాఖ
బ్యాంకులకు ఆదేశాలు.. 45 రోజుల గడువు  

న్యూఢిల్లీ: విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీల తరహాలో భారీ ఎత్తున బ్యాంకులకు రుణాలు ఎగవేసి, విదేశాలకు పారిపోయే వారిని కట్టడి చేయడంపై కేంద్ర ఆర్థిక శాఖ దృష్టి సారించింది. ఇందులో భాగంగా రూ.50 కోట్లు, అంతకు మించి భారీగా రుణాలు తీసుకున్న రుణ గ్రహీతలందరి పాస్‌ పోర్టు వివరాలను సేకరించాలని ప్రభుత్వ రంగ బ్యాంకులను (పీఎస్‌బీ) ఆదేశించింది. ఇందుకు 45 రోజుల గడువు విధించింది. ఒకవేళ రుణ గ్రహీతకు పాస్‌పోర్ట్‌ లేని పక్షంలో ఆ విషయాన్ని ధ్రువీకరిస్తూ వారి దగ్గరి నుంచి డిక్లరేషన్‌ తీసుకోవాలని సూచించింది. అలాగే, పాస్‌పోర్ట్‌ వివరాలు కూడా పొందుపర్చేలా రుణ దరఖాస్తుల్లో మార్పులు, చేర్పులు చేయాలని పేర్కొంది. ఆర్థిక నేరగాళ్లు .. మోసాలకు పాల్పడి దేశం విడిచి పారిపోకుండా సత్వరం చర్యలు తీసుకోవడానికి పాస్‌పోర్ట్‌ వివరాలు బ్యాంకులకు ఉపయోగపడగలవని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ వివరాలు లేకపోవడం వల్లే.. ఉద్దేశపూర్వక ఎగవేతదారులు విదేశాలకు పారిపోకుండా వెంటనే తగు చర్యలు తీసుకోలేకపోతున్నాయని వివరించాయి.   

మరిన్ని వార్తలు