డిటెక్టివ్‌లతో డిఫాల్టర్ల వేట!

26 Apr, 2018 00:42 IST|Sakshi

 మొండిబాకీలు రాబట్టుకునేందుకు పీఎన్‌బీ ప్రయత్నం

న్యూఢిల్లీ: భారీగా పేరుకుపోయిన మొండి బాకీలను రికవర్‌ చేసుకునేందుకు ప్రభుత్వ రంగ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా పత్తా లేకుండా పోయిన డిఫాల్టర్లను వెతికి పట్టుకునేందుకు డిటెక్టివ్‌ల సాయం తీసుకోవాలని నిర్ణయించింది. ఇందుకోసం సర్వీసులు అందించేందుకు డిటెక్టివ్‌ ఏజెన్సీల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. మే 5లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మొండి బాకీలను రాబట్టుకునే క్రమంలో క్షేత్ర స్థాయి సిబ్బందికి గణనీయంగా తోడ్పాటు అందించేలా డిటెక్టివ్‌ ఏజెన్సీలను నియమించుకోవాలని నిర్ణయించినట్లు పీఎన్‌బీ పేర్కొంది. పత్తా లేకుండా పోయిన లేదా బ్యాంకు రికార్డుల్లోని చిరునామాల్లో లేని రుణగ్రహీతలు, గ్యారంటార్లతో పాటు వారి వారసుల ఆచూకీని దొరకపుచ్చుకునేందుకు ఈ డిటెక్టివ్‌ ఏజెన్సీలు తోడ్పాటు అందించాల్సి ఉంటుంది.

డిఫాల్టర్ల ప్రస్తుత చిరునామా, ఉద్యోగం, వృత్తి, ఆదాయ మార్గాలు, ఆస్తుల వివరాలు మొదలైన సమాచారాన్ని డిటెక్టివ్‌లు సేకరించి ఇవ్వాల్సి ఉంటుంది. నివేదిక సమర్పించేందుకు ఏజెన్సీలకు గరిష్టంగా 60 రోజుల వ్యవధి ఉంటుంది. కేసు సంక్లిష్టతను బట్టి అవసరమైతే 90 రోజుల దాకా దీన్ని పొడిగించే అవకాశం ఉంది. రూ.13,000 కోట్ల నీరవ్‌ మోడీ స్కామ్‌తో సతమతమవుతున్న పీఎన్‌బీ నికర నిరర్థక ఆస్తులు 2017 డిసెంబర్‌ ఆఖరు నాటికి రూ. 57,519 కోట్ల మేర ఉన్నాయి. స్థూల రుణాల్లో ఇది 12.11 శాతం. వీటిని రికవర్‌ చేసుకునేందుకు బ్యాంకు ఇప్పటికే గాంధీగిరీ వంటి కార్యక్రమాలు కూడా చేపట్టింది. దీని ద్వారా ప్రతి నెలా రూ. 150 కోట్లు రికవరీ కాగలవని ఆశిస్తోంది.  

మరిన్ని వార్తలు