ఈసారీ ఎక్కడి రేట్లు అక్కడే..!

4 Dec, 2017 01:39 IST|Sakshi

పాలసీ రేట్లలో మార్పులు ఉండకపోవచ్చు...

విశ్లేషకులు, బ్యాంకర్ల అభిప్రాయం..

5–6 తేదీల్లో ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్ష  

న్యూఢిల్లీ: రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ) కీలక పాలసీ రేట్లు వరుసగా రెండోసారి కూడా ఎలాంటి మార్పులూ ఉండకపోవచ్చని విశ్లేషకులు, బ్యాంకర్లు అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)వృద్ధి రేటు పుంజుకున్న నేపథ్యంలో ఇప్పుడు ద్రవ్యోల్బణం నియంత్రణపై అధికంగా దృష్టిపెట్టే అవకాశం ఉందనేది వారి అంచనా.

అయిదు త్రైమాసికాల తర్వాత మళ్లీ వృద్ధి మెరుగుదల కారణంగా ఆర్‌బీఐపై రేట్ల తగ్గింపు ఒత్తిడి తగ్గిందని నిపుణులు పేర్కొంటున్నారు. మరోపక్క, పారిశ్రామిక వర్గాలు మాత్రం ఆర్థిక వ్యవస్థలోసానుకూల సెంటిమెంట్‌ను పెంపొందించాలంటే రేట్ల కోత తప్పనిసరి అని డిమాండ్‌ చేస్తున్నారు. దేశ సార్వభౌమ రేటింగ్‌ను మూడీస్‌ పెంచిన(అప్‌గ్రేడ్‌) తరుణంలో దీనికి జతగా ఆర్‌బీఐ కూడా రేట్లను తగ్గిస్తే.. ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి మరింత చేయూతనిచ్చినట్లు అవుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.

ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ(ఎంపీసీ) ఈ నెల 5–6 తేదీల్లో పాలసీ సమీక్షను నిర్వహించనుంది. కమిటీ నిర్ణయాన్ని 6న(బుధవారం) ఉర్జిత్‌ పటేల్‌ ప్రకటిస్తారు. ఈ ఆర్థిక సంవత్సరంలో(2017–18)లో ఇది అయిదో ద్వైమాసిక పాలసీ సమీక్ష. అక్టోబర్‌ సమీక్షలో కూడా ద్రవ్యోల్బణం పెరుగుదల భయాలున్నాయంటూ ఆర్‌బీఐ పాలసీ రేట్లలో కీలక పాలసీ రేట్లను యథాతథంగా కొనసాగించిన సంగతి తెలిసిందే.

మరోపక్క, ఈ ఏడాది వృద్ధి రేటు అంచనాలను 7.3 శాతం నుంచి 6.7 శాతానికి తగ్గించింది కూడా. చివరిసారిగా ఆర్‌బీఐ రెపో రేటు(ఆర్‌బీఐ బ్యాంకులకు ఇచ్చే స్వల్పకాలిక రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు)ను పావు శాతం తగ్గించి 6 శాతానికి చేర్చింది. ఇది ఆరేళ్ల కనిష్ట స్థాయి. అయితే, చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి(ఎస్‌ఎల్‌ఆర్‌– బ్యాంకులు తమ డిపాజిట్లలో తప్పనిసరిగా ప్రభుత్వ బాండ్లలో ఉంచాల్సిన నిధుల పరిమాణం)ని మాత్రం అర శాతం తగ్గింపుతో... 20 శాతం నుంచి 19.5 శాతానికి చేర్చింది.

దీనివల్ల బ్యాంకులకు మరిన్ని నిధులు అందుబాటులోకి వచ్చేలా చేసింది. ఇక రివర్స్‌ రెపో రేటు (బ్యాంకులు ఆర్‌బీఐ వద్దఉంచే నిధులపై పొందే వడ్డీరేటు) ప్రస్తుతం 5.75 శాతంగా కొనసాగుతోంది. నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్‌ఆర్‌– బ్యాంకులు తమ డిపాజిట్‌ నిధుల్లో ఆర్‌బీఐ వద్ద కచ్చితంగా ఉంచాల్సిన నిధుల పరిమాణం. వీటిపై బ్యాంకులకు ఎలాంటి వడ్డీ లభించదు) 4 శాతం వద్ద ఉంది.


ఎవరేమంటున్నారు...
రానున్న నెలల్లో ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉందని.. దీనివల్ల ఈసారి పాలసీలో వడ్డీరేట్ల కోతకు ఎలాంటి ఆస్కారం లేదని మెజారిటీ బ్యాంకర్లు అంచనావేస్తున్నారు.‘యథాతథ స్థితిని ఆర్‌బీఐ కొనసాగించవచ్చు. వ్యవస్థలో ద్రవ్యసరఫరా(లిక్విడిటీ) చాలా తక్కువగా ఉంది. డిపాజిట్‌ రేట్లు పెరుగుతున్నాయి. అదేవిధంగా ద్రవ్యోల్బణం పెరుగుదల రిస్కులూ పొంచిఉండటమే దీనికి ప్రధాన కారణం’ అని యూనియన్‌బ్యాంక్‌ ఎండీ, సీఈఓ జి. రాజ్‌కిరణ్‌ రాయ్‌ పేర్కొన్నారు. అక్టోబర్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం 7 నెలల గరిష్టానికి (3.58%), టోకు ధరల ద్రవ్యోల్బణం ఆరు నెలల గరిష్టానికి(3.59%) ఎగబాకిన విషయం విదితమే.

4 శాతం పైకి రిటైల్‌ ద్రవ్యోల్బణం: నోమురా
వస్తు–సేవల పన్ను(జీఎస్‌టీ)అమలు తర్వాత ఉత్పత్తి ధరలు కొద్దిగా తగ్గినప్పటికీ... ముడివస్తువుల ధరల ఒత్తిళ్లు పెరిగాయి. దీంతోపాటు అధిక ఆహార ద్రవ్యోల్బణం కారణంగా రిటైల్‌ ద్రవ్యోల్బణం.. నవంబర్‌లో ఆర్‌బీఐ లకి‡్ష్యత 4%కి మించి ఎగసే అవకాశం ఉందని అంతర్జాతీయ ఫైనాన్షియల్‌ సేవల దిగ్గజం నోమురా అభిప్రాయపడింది. ‘ఈ పరిస్థితుల్లో ఆర్‌బీఐ కఠిన విధానాన్ని ఎంచుకోవచ్చు. పాలసీ రేట్లలో ఎలాంటి మార్పులకూ ఆస్కారం లేదు’ అని తాజా నివేదికలో పేర్కొంది.

రేట్ల కోతకు మంచి అవకాశం ఇది: ఫిక్కీ
ఆర్థిక వ్యవస్థలో విశ్వాస స్థాయిలను మరింతగా పెంపొందించేందుకు ఇదే మంచి తరుణమని.. రేట్ల కోతతో ఆర్‌బీఐ తోడ్పాటునందించాలని పారిశ్రామిక మండలి ఫిక్కీ ప్రెసిడెంట్‌ పంకజ్‌ పటేల్‌ వ్యాఖ్యానించారు. పెద్ద నోట్ల రద్దు(డీమోనిటైజేషన్‌), జీఎస్‌టీ అమలు తర్వాత తొలి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు ఒక్కసారిగా మూడేళ్ల కనిష్టానికి(5.7 శాతం) పడిపోయిన సంగతి తెలిసిందే. అయితే, జీఎస్‌టీకి వ్యాపారవర్గాలు నెమ్మదిగా అలవాటుపడుతుండటంతో రెండో త్రైమాసికంలో వృద్ధి మళ్లీ 6.3 శాతానికి పుంజుకోవడంతో రికవరీ ఆశలకు బలం చేకూరుతోంది.

రేట్లు మారవు: ఇక్రా
‘రానున్న నెలల్లో రిటైల్‌ ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ తరుణంలో ద్రవ్యోల్బణం ఆందోళనలను పరిగణనలోకి తీసుకుంటూ ఆర్‌బీఐ పాలసీ కమిటీ రెపో రేటును యథాతథంగానే కొనసాగిస్తుందని భావిస్తున్నాం’ అని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా అభిప్రాయపడింది.

మరిన్ని వార్తలు