-

గణాంకాలు, ఫెడ్‌ కీలకం

11 Jun, 2018 02:24 IST|Sakshi

ఈ వారంలో ఐఐపీ,  ద్రవ్యోల్బణ గణాంకాలు  

ఫెడ్‌ రేట్ల పెంపు తధ్యం !  

కిమ్, ట్రంప్‌ల శిఖర సమావేశమూ ముఖ్యమే  

ఈ వారం  మార్కెట్‌ ప్రభావిత అంశాలు  

పారిశ్రామికోత్పత్తి, ద్రవ్యోల్బణ గణాంకాలతో పాటు అంతర్జాతీయ సంకేతాలు ఈ వారం స్టాక్‌మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని నిపుణులంటున్నారు. ముడి చమురు ధరల గమనం, డాలర్‌తో రూపాయి మారకం కదలికలు, నైరుతి రుతుపవనాల విస్తరణ  కూడా స్టాక్‌ సూచీల గమనాన్ని నిర్దేశిస్తాయని వారంటున్నారు.  

12న ఐఐపీ గణాంకాలు... 
రేపు(మంగళవారం–ఈ నెల 12న) ఏప్రిల్‌ నెలకు సంబంధించిన పారిశ్రామికోత్పత్తి గణాంకాలు వస్తాయి. ఈ ఏడాది మార్చిలో పారిశ్రామికోత్పత్తి 4.4 శాతం వృద్ది చెందింది. ఈ నెల 14న(గురువారం) మే నెల టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడతాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో టోకు ధరల ద్రవ్యోల్బణం 3.18 శాతానికి పెరిగింది. మొండి బకాయిల కోసం ఆస్తుల పునర్వ్యస్థీకరణ కంపెనీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తుండటంతో బ్యాంక్‌ షేర్లు వెలుగులోకి రావచ్చు. అదనపు నిఘా పరిధిలోకి 60 షేర్లను ఎన్‌ఎస్‌ఈ తేవడం ఒకింత ప్రతికూల ప్రభావం చూపవచ్చు. 

ఫెడ్‌ సమావేశం కీలకం.. 
ఈ వారం మన మార్కెట్‌కు అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ సమావేశం కీలకమని కోటక్‌ సెక్యూరిటీస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌(రీసెర్చ్‌) సంజీవ జర్బాడే చెప్పారు. ఈ సారి ఫెడ్‌ రేట్లను పెంచే అవకాశాలు అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇక యూరప్‌ కేంద్ర బ్యాంక్‌ ప్యాకేజీకి ముగింపు పలికే అవకాశాలున్నాయని వివరించారు. రుతుపవనాల పురోగతి, గ్రామీణ మార్కెట్‌పై ఆశావహ అంచనాలు ఆర్థిక వ్యవస్థకు జోష్‌నిస్తున్నాయని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ చెప్పారు.  ఇక అంతర్జాతీయంగా చూస్తే, గత శుక్రవారం ప్రారంభమైన జీ 7 సమావేశ ప్రభావం కూడా మార్కెట్‌పై ఉంటుంది. ఈ నెల 12న అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ల మధ్య శిఖరాగ్ర సమావేశం జరగనున్నది. ఈ వారంలో మూడు కేంద్ర బ్యాంక్‌లు సమావేశం కానున్నాయి. ఈ నెల 13న అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ రేట్లపై నిర్ణయాన్ని వెలువరిస్తుంది. ఇక యూరప్‌ కేంద్ర బ్యాంక్, జపాన్‌ కేంద్ర బ్యాంక్‌లు కూడా కీలకమైన నిర్ణయాలను వెలువరిస్తాయని అంచనా.  

ఆరు రోజుల్లో రూ.2,200 కోట్లు  
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు మన ఈక్విటీ మార్కెట్లో గత 6 ట్రేడింగ్‌ సెషన్లలో రూ.2,200 కోట్ల  పెట్టుబడులు పెట్టారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడం, కంపెనీల ఆర్థిక ఫలితాలు పుంజుకోవడం వల్ల విదేశీ ఇన్వెస్టర్లు  ఈ స్థాయిలో పెట్టుబడులు పెట్టారని నిపుణులంటున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్ల కొనుగోలు వల్ల విదేశీ పెట్టుబడులు ఈ స్థాయిలో ఉన్నాయని, లేకుంటే నికర అమ్మకాలే చోటుచేసుకుని వుండేవని మార్కెట్‌ విశ్లేషకుల ఉవాచ. కాగా గత రెండు నెలల్లో స్టాక్‌ మార్కెట్‌ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు రూ.15,600 కోట్ల మేర పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం, ఈ నెలలో ఇప్పటివరకూ విదేశీ ఇన్వెస్టర్లు మన స్టాక్‌ మార్కెట్లో రూ.2,241 కోట్లు పెట్టుబడులు పెట్టగా, డెట్‌ మార్కెట్‌ నుంచి రూ.405 కోట్లు పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు.  

మరిన్ని వార్తలు